
పల్లెకెలె: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన శ్రీలంక జట్టు... బంగ్లాదేశ్‌పై వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన చివరి వన్డేలో శ్రీలంక 99 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా 2–1తో సిరీస్ చేజిక్కించుకుంది. అంతకుముందు రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను సైతం ఆతిథ్య లంక జట్టు 1–0తో గెలుచుకుంది.
మూడో వన్డేలో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. వికెట్ కీపర్ కుశాల్ మెండిస్ (114 బంతుల్లో 124; 18 ఫోర్లు) సెంచరీతో కదంతొక్కగా... కెప్టెన్ అసలంక (68 బంతుల్లో 58; 9 ఫోర్లు) అర్ధశతకంతో రాణించాడు. ఓపెనర్ పాథుమ్ నిసాంక (35) ఫర్వాలేదనిపించాడు. బంగ్లాదేశ్ బౌలర్లలో తస్కీన్ అహ్మద్, మెహదీ హసన్ మిరాజ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
అనంతరం లక్ష్యఛేదనలో బంగ్లాదేశ్ 39.4 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌటైంది. తౌహిద్ హృదయ్ (78 బంతుల్లో 51; 3 ఫోర్లు, 1 సిక్స్) అర్ధశతకంతో పోరాడగా... కెప్టెన్ మెహదీ హసన్ మిరాజ్ (28), పర్వేజ్ (28), జాకీర్ అలీ (27) మెరుగైన ఆరంభాలను వృథా చేసుకున్నారు. శ్రీలంక బౌలర్లలో అశిత ఫెర్నాండో, దుశ్మంత చమీరా చెరో 3 వికెట్లు పడగొట్టగా... దునిత్ వెల్లలాగె, వణిండు హసరంగా రెండేసి వికెట్లు తీశారు.
ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లోనూ మొదట బ్యాటింగ్ చేసిన జట్లే గెలుపొందాయి. కుశాల్ మెండిస్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’అవార్డులు దక్కాయి. మెండిస్ ఈ సిరీస్‌లో తొలి వన్డేలో 45, రెండో వన్డేలో 56, ఇప్పుడు మూడో వన్డేలో 124 పరుగులు చేశాడు. ఈ సెంచరీ కుసాల్కు అంతర్జాతీయ క్రికెట్‌లో 16వది.
ఈ మ్యాచ్‌లో కుసాల్ మరో రికార్డు కూడా సాధించాడు. బంగ్లాదేశ్‌పై 2000 పరుగులు (అన్ని ఫార్మాట్లలో) పూర్తి చేసిన రెండో శ్రీలంకన్‌గా నిలిచాడు. గతంలో కుమార్ సంగక్కర (3090) ఒక్కడే ఈ ఘనత సాధించాడు. ఇరు జట్ల మధ్య గురువారం తొలి టి20 జరగనుంది.