కోట్లు పెట్టి కొన్నాం, వదిలించుకోక తప్పదు!

Kings Punjab Plans To Dismiss Glenn Maxwell And Sheldon Cottrell - Sakshi

రాహుల్‌, కుంబ్లేల కొనసాగింపు!

న్యూఢిల్లీ: ఈ ఏడాది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)లో దారుణంగా విఫలమైన ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్, వెస్టిండీస్‌ బౌలర్‌ షెల్డన్‌ కాట్రెల్‌లపై వేటు వేసేందుకు కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ సిద్ధమైంది. వచ్చే ఏడాది జరిగే ఐపీఎల్‌కు మరో ఆరు నెలల సమయం మాత్రమే ఉండటంతో... ఈ ఏడాది జట్టు ప్రదర్శనపై పంజాబ్‌ యాజమాన్యం అప్పుడే సమీక్షను ఆరంభించింది. కెప్టెన్‌గా కేఎల్‌ రాహుల్, హెడ్‌ కోచ్‌గా అనిల్‌ కుంబ్లేను కొనసాగించేందుకు సిద్ధమైంది. రాహుల్‌ ఈ ఏడాది అద్భుతంగా రాణించాడు.

14 మ్యాచ్‌ల్లో 55.83 సగటుతో 670 పరుగులు చేసి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడికి ఇచ్చే ఆరెంజ్‌‌ క్యాప్‌ను గెల్చుకున్నాడు. ఇందులో ఒక సెంచరీ, ఐదు అర్ధ సెంచరీలు ఉండటం విశేషం. అంతేకాకుండా పంజాబ్‌ కోచ్‌గా తనకు తొలి ఏడాదే అయినా... జట్టును వరుస ఓటముల నుంచి గెలుపు బాట పట్టించిన కుంబ్లే పనితీరుపై పంజాబ్‌ సంతృప్తితోనే ఉంది. అయితే వేలంలో కోట్లు వెచ్చించి తెచ్చుకున్న మ్యాక్స్‌వెల్‌ (రూ.10.75 కోట్లు), కాట్రెల్‌ (రూ.8.5 కోట్లు) ప్రదర్శనలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న పంజాబ్‌... వారిని వదిలించుకునేందుకు సిద్ధమైనట్లు సమాచారం.
(చదవండి: నేను అలాంటి వాడిని కాదు: రోహిత్‌)

మ్యాక్స్‌వెల్‌ ఆడిన 13 మ్యాచ్‌ల్లో కేవలం 108 పరుగులు మాత్రమే చేశాడు. మయాంక్‌ అగర్వాల్, నికోలస్‌ పూరన్, షమీ, గేల్, యువ లెగ్‌స్పిన్నర్‌ రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్‌ సింగ్‌లను కొనసాగించే వీలుంది. ముఖ్యంగా మిడిల్‌ ఆర్డర్‌ను పటిష్టం చేసేలా కసరత్తులు ఆరంభించింది. ఈ సీజన్‌ తొలి అర్ధ భాగంలో కేవలం ఒకే విజయాన్ని నమోదు చేసిన పంజాబ్‌... అనంతరం వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో గెలిచి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించేలా కనిపించింది. అయితే చివరి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడి ఇంటి దారి పట్టింది.
(చదవండి: 100 బాల్స్‌.. 102 రన్స్‌.. నో సిక్సర్స్‌)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top