
ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. అతడి తండ్రి జాన్ బట్లర్ కన్నుమూశారు. ఈ చేదు వార్తను బట్లర్ తాజాగా అభిమానులతో పంచుకున్నాడు. రెస్ట్ ఇన్ పీస్ డాడ్, మాకు ప్రతిదీ ఇచ్చినందుకు ధన్యవాదాలు అంటూ తన నాన్నతో కలిసి ఉన్న ఫోటోను ఇన్‌స్టా స్టోరీలో బట్లర్ పోస్ట్ చేశాడు.
అయితే జాన్ బట్లర్ మరణించి దాదాపు వారం రోజులు అయినట్లు తెలుస్తోంది. ఓ వైపు తండ్రి మరణం బాధిస్తున్నప్పటికి ది హాండ్రడ్ లీగ్‌లో ఆడుతూ బట్లర్ క్రికెట్‌పై తనకు ఉన్న అంకిత భావాన్ని చాటుకున్నాడు. హాండ్రడ్ లీగ్-2025లో మాంచెస్టర్ ఒరిజినల్స్‌కు జోస్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.
ఈ టోర్నీలో భాగంగా ఆగస్టు 9న ఓవల్ ఇన్విన్సిబుల్స్, మాంచెస్టర్ ఒరిజినల్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో మాంచెస్టర్ ఒరిజినల్స్ జట్టు మొత్తం నల్లటి ఆర్మ్ బ్యాండ్ ధరించి ఆయన మృతికి నివాళులు అర్పించారు. అయితే ఈ మ్యాచ్‌లో బట్లర్ నాలుగు బంతులాడి డకౌట్‌గా వెనుదిరిగాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. మాంచెస్టర్ ఒరిజినల్స్ పై ఓవల్ ఇన్విన్సిబుల్స్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన మాంచెస్టర్ ఒరిజినల్స్ నిర్ణీత 100 బంతుల్లో 128 పరుగులకు ఆలౌటైంది. మాంచెస్టర్ బ్యాటర్లలో కెప్టెన్ ఫిల్ సాల్ట్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ప్రత్యర్ధి జట్టు బౌలర్లలో రషీద్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టి సత్తాచాటాడు. అనంతరం స్పల్య లక్ష్యాన్ని ఓవల్ ఇన్విన్సిబుల్స్ 57 బంతుల్లోనే కేవలం ఒక్క వికెట్ మాత్రమే నష్టపోయి చేధించింది. ఓపెనర్లు విల్ జాక్స్ (61), టవాండా ముయేయే (59) హాఫ్ సెంచరీలతో మ్యాచ్ ఫినిష్ చేశారు.
చదవండి: కొత్త కారు కొన్న రోహిత్ శర్మ.. ఎన్ని కోట్లంటే?