
ఇటీవలికాలంలో టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా ప్రస్తావన వచ్చే సరికి వర్క్ లోడ్ అన్న పదం వినిపిస్తుంది. చాలామందికి ఈ పదం చాలా సాధారణంగా అనిపించవచ్చు. క్రికెట్‌పై పెద్దగా అవగాహన లేని వారు.. ఈ ఇంత దానికే వర్క్ లోడ్ అంటే ఎలా అని అంటుంటారు. గతంలో చాలామంది పేసర్లు బుమ్రా కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడి, లెక్కలేనన్ని ఓవర్లు వేశారని గుర్తు చేస్తుంటారు.
అయితే అప్పటి క్రికెట్‌కు, ఇప్పటి క్రికెట్‌కు పోల్చుకోలేని వ్యత్యాసం ఉందన్న విషయం వారికి అర్దం కాదు. అప్పట్లో పేసర్లు టెస్ట్ మ్యాచ్‌లు, అప్పుడప్పుడు వన్డేలు ఆడేవారు. అది కూడా ఏడాదిలో కొంతకాలం మాత్రమే. అయితే పొట్టి క్రికెట్ ఆగమనంతో పరిస్థితి చాలా మారింది. ఏడాది పొడవునా ఏదో ఒక ఫార్మాట్‌లో మ్యాచ్‌లు జరుగుతుంటాయి. మధ్యలో ప్రైవేట్ లీగ్‌లు, ఖాళీగా ఉంటే దేశవాలీ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది.
ఇలాంటి పరిస్థితుల్లో పేస్ బౌలర్లపై సహజంగానే పని భారం ఉంటుంది. శరీరం పెద్దగా సహకరించదు. ఒకవేళ ధైర్యం చేసి బరిలోకి దిగినా గాయాలు తప్పవు. గాయాల బారిన పడితే కొన్ని సందర్భాల్లో అర్దంతరంగా కెరీర్‌లే ముగిసిపోతాయి. కెరీర్ ముగిస్తే సదరు బౌలర్ జీవితం కూడా ముగిసినట్లే.
ఇవన్నీ చూసుకొనే పేసర్లు ఆచితూచి మ్యాచ్‌లు ఆడుతుంటారు. సంబంధిత క్రికెట్ బోర్డులు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొనే వారిని ఎంపిక చేస్తుంటారు. బుమ్రా సహా ప్రపంచ క్రికెట్‌లో పేసర్లందరి విషయంలోనూ ఇదే జరుగుతుంది.
అయితే, గత ఏడాదిన్నర కాలంగా మిగతా పేసర్లతో పోలిస్తే బుమ్రాపై అదనపు పని భారం పడుతుంది. టెస్ట్‌ల్లో ప్రపంచ ప్రఖ్యాత పేసర్లు మిచెల్ స్టార్క్ (362), కగిసో రబాడ (298) వంటి వారు 2024 నుంచి గరిష్టంగా 362 ఓవర్లు వేస్తే, బుమ్రా ఏకంగా 410 ఓవర్లు వేశాడు. ఈ గణాంకాలు చేస్తే చాలు బుమ్రాపై ఎంత పని భారం పడుతుందో చెప్పడానికి.
టీమిండియా బుమ్రాపై అతిగా ఆధారపడుతూ, అతనిచే సామర్థ్యానికి మించి బౌలింగ్ చేయిస్తుంది. ఇదే కొనసాగితే బుమ్రా ఎక్కువ కాలం క్రికెట్ ఆడే అవకాశం ఉండదు. వర్క్ లోడ్ ఎక్కువై గాయాల బారిన పడి, బుమ్రా కెరీర్ అర్దంతరంగా ముగిసే ప్రమాదం ఉంది. ఇది దృష్టిలో పెట్టుకొనే భారత మేనేజ్‌మెంట్ బుమ్రాను పరిమితంగా వినియోగించుకుంటుంది. ఇంగ్లండ్ టూర్‌లో కేవలం మూడు మ్యాచ్‌లే ఆడించాలని నిర్ణయించుకుంది.
బుమ్రా గురించి ఆలోచిస్తే ఇది ఓకే. మరి టీమిండియా ప్రదర్శన మాటేంటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. గత కొంతకాలంగా టెస్ట్‌ల్లో బుమ్రా లేకపోతే టీమిండియా సున్నా అన్న విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇది తెలిసి కూడా బీసీసీఐ బుమ్రాకు ప్రత్యామ్నాయాన్ని తయారు చేసుకోలేకపోతుంది.
బుమ్రా ఒక్కడు ఎంత వరకు చేయగలడని మాజీలు చాలాకాలంగా ప్రశ్నిస్తూనే ఉన్నారు. బుమ్రా రాణించకపోతే టీమిండియా పరిస్థితి ఏంటన్నది తాజాగా ముగిసిన లీడ్స్ టెస్ట్ సూచిస్తుంది. ఆ మ్యాచ్‌లో బుమ్రా తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసినా, రెండో ఇన్నింగ్స్‌లో ప్రభావం చూపలేకపోవడంతో టీమిండియా ఓటమిపాలైంది. ఇకనైనా భారత్ బుమ్రాపై అతిగా ఆధారపడకుండా, ప్రత్యామ్నాయాలను చూసుకోవాలి.