ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ స్పష్టీకరణ
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో గత కొంత కాలంగా చర్చకు కారణమవుతున్న ‘ఇంపాక్ట్ సబ్’ నిబంధనపై గవర్నింగ్ కౌన్సిల్ స్పష్టతనిచ్చింది. లీగ్‌లో ఈ నిబంధన కనీసం 2027 వరకు కొనసాగుతుందని వెల్లడించింది. ఐపీఎల్ నిబంధనలు, ఇతర సూచనలకు సంబంధించి బుధవారం బీసీసీఐ కార్యాలయంలో 10 జట్ల
సారథులతో ‘కెప్టెన్స్ మీట్’ జరిగింది. ఇందులో అన్ని అంశాలపై కౌన్సిల్ ప్రతినిధులు కెప్టెన్ల సందేహ నివృత్తి చేశారు. ముఖ్యంగా ‘ఇంపాక్ట్ సబ్’పై అభ్యంతరాలు కూడా వ్యక్తమయ్యాయి.
2023లో దీనిని తొలిసారి ప్రవేశపెట్టారు. ఆపై 2027 వరకు ఈ నిబంధనను పొడిగిస్తూ 2024లోనే బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ‘పలువురు కెపె్టన్లు దీనిపై తమ అభిప్రాయాలు వెల్లడించారు. అయితే 2027 వరకు దానిని మార్చలేమని వారికి చెప్పాం’ అని బోర్డు వర్గాలు వెల్లడించాయి. రెండో ఇన్నింగ్స్‌లో మంచు ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుంటూ 10 ఓవర్ల తర్వాత కొత్త బంతిని తీసుకునే అవకాశం ఫీల్డింగ్ కెప్టెన్లకు గత సీజన్‌లో కల్పించారు.
అయితే ఈసారి తొలి ఇన్నింగ్స్ సమయంలో కూడా అలాంటి అవకాశం ఇవ్వాలని కెప్టెన్లు సూచించారు. దీనిపై కూడా కౌన్సిల్ వివరణ ఇచి్చంది. మంచు కారణంగానే కొత్త బంతిని ఇస్తున్నాం కాబట్టి గత ఏడాదిలాగే ఈసారి కూడా నిబంధనలో ఎలాంటి మార్పు ఉండదని చెప్పింది.
హర్షిత్ రాణా స్థానంలో నవ్‌దీప్ సైనీ
గాయంతో ఐపీఎల్‌కు దూరమైన హర్షిత్ రాణా స్థానంలో కోల్‌కతా నైట్ రైడర్స్ నవ్‌దీప్ సైనీని ఎంపిక చేసుకుంది. టి20 ప్రపంచకప్ ముందు గాయపడ్డ హర్షిత్ రాణా మోకాలికి శస్త్రచికిత్స జరగగా... అతడు ఈ సీజన్ మొత్తానికి అందుబాటులో లేకుండా పోయాడు. గుజరాత్ టైటాన్స్‌కు ఆడాల్సిన ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ యర్రా పృథ్వీరాజ్ కూడా గాయంతో దూరమయ్యాడు. అతని స్థానంలో రూ. 30 లక్షల ప్రాథమిక ధరతో కుల్వంత్ ఖెజ్రోలియాను గుజరాత్ ఎంపిక చేసుకుంది.


