గర్జించిన కోహ్లి, పడిక్కల్‌.. ఆర్సీబీ ఘన విజయం | IPL 2026: Royal Challengers Bengaluru Won By 5 Wkts Vs Gujarat Titans | Sakshi
Sakshi News home page

గర్జించిన కోహ్లి, పడిక్కల్‌.. ఆర్సీబీ ఘన విజయం

Apr 24 2026 11:13 PM | Updated on Apr 25 2026 12:10 AM

IPL 2026: Royal Challengers Bengaluru Won By 5 Wkts Vs Gujarat Titans

ఐపీఎల్ 2026 సీజ‌న్‌లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు సొంత‌గ‌డ్డ‌పై మ‌రో విజ‌యాన్ని న‌మోదు చేసింది. శుక్ర‌వారం చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా గుజ‌రాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆర్సీబీ 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. 206 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 18.5 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోహ్లి (81), ప‌డిక్క‌ల్ (55) విధ్వంసంతో ఆర్సీబీ సునాయాస విజ‌యాన్ని అందుకుంది. 

చివ‌ర్లో హైడ్రామా నెల‌కొన్న‌ప్ప‌టికీ టిమ్ డేవిడ్ (10 నాటౌట్‌), కృనాల్ పాండ్యా (23 నాటౌట్‌) జ‌ట్టును విజ‌యతీరాల‌కు చేర్చారు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌లో ర‌షీద్ ఖాన్ 2, సిరాజ్‌, హోల్డ‌ర్‌, మాన‌వ్  సుతార్‌లు త‌లా ఒక వికెట్ తీశారు. అంత‌క‌ముందు గుజరాత్ టైటాన్స్ 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల న‌ష్టానికి 205 ప‌రుగులు చేసింది. సాయి సుద‌ర్శ‌న్ సెంచ‌రీతో చెల‌రేగాడు. ఆర్సీబీ బౌల‌ర్ల‌లో భువ‌నేశ్వ‌ర్‌, సుయాశ్ శ‌ర్మ‌, హాజిల్‌వుడ్ త‌లా ఒక వికెట్ తీశారు.

సాయి సుదర్శన్ సెంచరీ
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ టైటాన్స్‌కు ఓపెనర్లు సాయి సుదర్శన్‌, శుబ్‌మన్ గిల్ శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు ఈ ఇద్దరు 128 పరుగులు జోడించారు. ముఖ్యంగా సాయి సుదర్శన్ ఆది నుంచే బ్యాటింగ్‌లో జోరు ప్రదర్శించాడు. గిల్ ఔటయ్యే సమయానికి సాయి సుదర్శన్ 85 పరుగులతో ఆడుతున్నాడు. 

జట్టు స్కోరు 128 ఉంటే అందులో సాయి సుదర్శన్‌వే ఎక్కువ పరుగులు ఉండడం అతడి విధ్వంసాన్ని చూపిస్తోంది. గిల్ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన బట్లర్  ఎక్కువసేపు నిలవలేకపోయాడు. ఇక 58 బంతుల్లో సెంచరీ సాధించిన సాయి సుదర్శన్ వెనుదిరిగిన అనంతరం గుజరాత్ స్కోరు మందగించింది. ఆఖర్లో సుందర్ (19 నాటౌట్‌), హోల్డర్ (23 నాటౌట్‌) మెరవడంతో గుజరాత్ 200 ప్లస్ స్కోరును దాటింది.

కోహ్లి మాస్.. పడిక్కల్ క్లాస్‌
ఛేదనలో ఆర్సీబీకి ఆరంభంలోనే షాక్ తగిలింది. సిరాజ్ బౌలింగ్‌లో  జాకబ్ బెతల్ (14) షారుక్‌ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే ఆ తర్వాత వచ్చిన పడిక్కల్‌తో కలిసి కోహ్లి విధ్వంసం సృష్టించాడు. మైదానం నలుమూలలా బౌండరరీలు కొట్టిన కోహ్లి ఆర్సీబీని విజయం దిశగా నడిపించాడు. కోహ్లికి తోడు పడిక్కల్‌కూడా రాణించడంతో ఆర్సీబీ లక్ష్యం దిశగా సాగింది. 

ఈ దశలో అర్థసెంచరీ సాధించిన పడిక్కల్ ఔటయ్యాడు. అప్పటికే అర్థసెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లి సెంచరీ దిశగా సాగాడు. కానీ 81 పరుగుల వద్ద హోల్డర్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. అయితే కోహ్లి ఔటైన తర్వాత ఆర్సీబీ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. అయితే ఛేదించాల్సిన పరుగులు తక్కువగా ఉండడంతో ఆఖర్లో టిమ్ డేవిడ్‌,  కృనాల్ పాండ్యాలు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ ఆర్సీబీని గెలుపు తీరాలకు చేర్చారు.  

ఈ సీజన్‌లో ఆర్సీబీకి ఇది ఐదో విజయం. ఈ గెలుపుతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. అటు గుజరాత్ కు ఇది వరుసగా రెండో ఓటమి కాగా.. ఆడిన ఏడు మ్యాచ్‌ల్లో 3 విజయాలు, నాలుగు పరాజయాలతో పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతుంది.

 

Advertisement
 
Advertisement
Advertisement