ముంబై ఇండియన్స్‌కు బిగ్‌ షాక్‌ | IPL 2026: Rohit Sharma likely to miss Punjab Kings match | Sakshi
Sakshi News home page

పంజాబ్‌తో మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియన్స్‌కు బిగ్‌ షాక్‌

Apr 16 2026 7:55 AM | Updated on Apr 16 2026 8:40 AM

IPL 2026: Rohit Sharma likely to miss Punjab Kings match

ఐపీఎల్‌ 2026లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 16) పంజాబ్‌ కింగ్స్‌, ముంబై ఇండియన్స్‌ మధ్య బిగ్‌ ఫైట్‌ జరుగనుంది. వాంఖడే వేదికగా జరుగబోయే ఈ మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియన్స్‌కు భారీ షాక్‌ తగిలింది. స్టార్‌ బ్యాటర్‌ రోహిత్‌ శర్మ ఈ మ్యాచ్‌కు దూరం కానున్నాడని తెలుస్తుంది.

రోహిత్‌ ఆర్సీబీతో మ్యాచ్‌ సందర్భంగా గాయపడిన (Hamstring Injury) విషయం తెలిసిందే. స్కాన్‌లలో గాయం ఉందా లేదా అన్న విషయం స్పష్టంగా తెలియడం లేదు. దీంతో ఎంఐ మేనేజ్‌మెంట్‌ ముందు జాగ్రత్త చర్యగా హిట్‌మ్యాన్‌కు కొద్ది రోజుల పాటు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. గుజరాత్‌తో మ్యాచ్‌ (ఏప్రిల్‌ 20) సమయానికి రోహిత్‌ పూర్తిగా కోలుకునే అవకాశం ఉంది. కాగా, ఆర్సీబీ మ్యాచ్‌లో రోహిత్‌ బ్యాటింగ్‌ చేస్తూ మధ్యలోనే వైదొలిగిన విషయం తెలిసిందే.

పంజాబ్‌తో మ్యాచ్‌కు రోహిత్‌ దూరమైతే, ఇప్పటికే కష్టాల్లో ఉన్న ముంబై ఇండియన్స్‌ మరింత ఇబ్బంది పడనుంది. ఈ సీజన్‌లో ముంబై తొలి మ్యాచ్‌ విజయం తర్వాత హ్యాట్రిక్‌ పరాజయాలు ఎదుర్కొని పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. రోహిత్‌ విషయానికొస్తే.. ఈ సీజన్‌లో అతను ఓ మోస్తరు ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 137 పరుగులు చేశాడు. పంజాబ్‌ మ్యాచ్‌కు రోహిత్‌ మిస్‌ అయితే అతని స్థానంలో నమన్‌ ధీర్‌కు ఓపెనర్‌గా అవకాశం దక్కవచ్చు.

మరోపక్క నేటి పంజాబ్‌ మ్యాచ్‌కు స్టార్ ఆల్‌రౌండర్‌ విల్‌ జాక్స్‌ అందుబాటులో ఉంటాడు. జాక్స్‌ బుధవారమే జట్టుతో చేరాడు. అతను తుది జట్టులో ఉంటాడా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు.

పంజాబ్‌ విషయానికొస్తే.. ఈ జట్టు ప్రస్తుత సీజన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఓటమి ఎరుగని జట్టు ఏదైనా ఉందా అంటే అది పంజాబే. ఈ సీజన్‌లో పంజాబ్‌ 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సొంతం చేసుకొని పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. కేకేఆర్‌తో జరగాల్సిన ఓ మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది.

పంజాబ్‌తో మ్యాచ్‌కు ముంబై ఇండియన్స్‌ తుది జట్టు (అంచనా)..
ర్యాన్‌ రికెల్టన్‌, నమన్‌ ధీర్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, తిలక్‌ వర్మ, హార్దిక్‌ పాండ్యా, షెర్ఫాన్‌ రూథర్‌ఫోర్డ్‌, మిచెల్‌ సాంట్నర్‌, శార్దూల్‌ ఠాకూర్‌, ట్రెంట్‌ బౌల్ట్‌, మయాంక్‌ మార్కండే, జస్ప్రీత్‌ బుమ్రా

 

Advertisement
 
Advertisement
Advertisement