IPL 2022, DC Vs RR: Rajasthan Royals Beat Delhi Capitals By 15 Runs - Sakshi
Sakshi News home page

IPL 2022 DC Vs RR: బట్లర్‌ ‘తీన్‌’మార్‌...

Published Sat, Apr 23 2022 5:17 AM

IPL 2022: Rajasthan Royals Beat Delhi Capitals By 15 Runs - Sakshi

ముంబై: ఐపీఎల్‌లో జోస్‌ బట్లర్‌ దూకుడు, అతని ప్రదర్శనతో రాజస్తాన్‌ రాయల్స్‌ జోరు కొనసాగుతోంది. 2022లో ఇప్పటికే రెండు సెంచరీలు సాధించిన బట్లర్‌ ముచ్చటగా మూడో శతకంతో రాయల్స్‌ను గెలిపించాడు. రాజస్తాన్‌ భారీ స్కోరును ఛేదించే క్రమంలో చివరి వరకు పోరాడిన ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓటమితో సరిపెట్టుకుంది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ 15 పరుగుల తేడాతో క్యాపిటల్స్‌ను ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్‌ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది.

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జోస్‌ బట్లర్‌ (65 బంతుల్లో 116; 9 ఫోర్లు, 9 సిక్స్‌లు) ఈ సీజన్‌లో మూడో సెంచరీతో చెలరేగగా... దేవదత్‌ పడిక్కల్‌ (35 బంతుల్లో 54; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ చేశాడు. వీరిద్దరు తొలి వికెట్‌కు 91 బంతుల్లోనే 155 పరుగులు జోడించారు. ఐపీఎల్‌ చరిత్రలో రాజస్తాన్‌కు ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. ఆపై కెప్టెన్‌ సంజు సామ్సన్‌ (19 బంతుల్లో 46 నాటౌట్‌; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా  చెలరేగాడు. అనంతరం ఢిల్లీ 20 ఓవర్లలో 8 వికెట్లకు 207 పరుగులు చేసి ఓడిపోయింది. రిషభ్‌ పంత్‌ (24 బంతుల్లో 44; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), లలిత్‌ యాదవ్‌ (24 బంతుల్లో 37; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), పృథ్వీ షా (27 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్‌), రావ్‌మన్‌ పావెల్‌ (15 బంతుల్లో 36; 5 సిక్స్‌లు) రాణించారు.

రికార్డు భాగస్వామ్యం
తొలి 5 ఓవర్లలో 29 పరుగులు... రాజస్తాన్‌కు లభించిన సాధారణ ఆరంభమిది! ఖలీల్‌ తొలి ఓవర్లో బట్లర్‌ 2 ఫోర్లు, ముస్తఫిజుర్‌ ఓవర్లో పడిక్కల్‌ వరుసగా మూడు ఫోర్లు కొట్టినా... మెయిడిన్‌ ఓవర్‌తో శార్దుల్‌ కట్టడి చేశాడు. అయితే ఆ తర్వాత రాయల్స్‌ దూసుకుపోయింది. బట్లర్‌ తిరుగులేని బ్యాటింగ్‌కు పడిక్కల్‌ ప్రదర్శన తోడయింది. ఖలీల్‌ ఓవర్లో రెండు సిక్సర్లతో జోరు మొదలు పెట్టిన బట్లర్‌ చివరి వరకు దానిని కొనసాగించాడు. అక్షర్‌ ఓవర్లో పడిక్కల్‌ వరుసగా 6, 4 కొట్టగా, కుల్దీప్‌ వేసిన తర్వాతి ఓవర్లో బట్లర్‌ ఇదే తరహాలో వరుస సిక్స్, ఫోర్‌తో పరుగులు రాబట్టాడు.

ఈ జోడీని అడ్డుకోవడంలో ఢిల్లీ బౌలర్లు విఫలం కావడంతో భాగస్వామ్యం వంద పరుగులు దాటింది.2015 ఐపీఎల్‌ తర్వాత రాజస్తాన్‌ ఓపెనర్లు సెంచరీ భాగస్వామ్యం నమోదు చేయడం ఇదే మొదటిసారి. 36 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న బట్లర్‌...లలిత్‌ ఓవర్లో మరో రెండు సిక్స్‌లు, ఫోర్‌ బాదాడు. కుల్దీప్‌ బౌలింగ్‌లో బట్లర్‌ వరుసగా మళ్లీ రెండు భారీ సిక్స్‌లు కొట్టగా 31 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం పడిక్కల్‌ నిష్క్రమించాడు.

అదే ఓవర్లో 57 బంతు ల్లోనే బట్లర్‌ శతకం పూర్తయింది. అయితే మూడో స్థానంలో వచ్చిన సామ్సన్‌ మెరుపులు రాయల్స్‌కు మరింత భారీ స్కోరు ను అందించాయి. ఖలీల్‌ ఓవర్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో చెలరేగిన సామ్సన్‌... శార్దుల్‌ వేసిన చివరి ఓవర్లోనూ 2 ఫోర్లు, సిక్స్‌ బాదడం విశేషం.  

రాణించిన పృథ్వీ, పంత్‌
ఛేదనలో తొలి వికెట్‌కు 27 బంతుల్లో 43 పరుగులు జోడించి పృథ్వీ, వార్నర్‌ (14 బంతుల్లో 28; 5 ఫోర్లు, 1 సిక్స్‌) ఢిల్లీకి శుభారంభం అందించారు. అయితే ఐదు పరుగుల తేడాతో వార్నర్, సర్ఫరాజ్‌ (1)లను అవుట్‌ చేసి రాయల్స్‌ పైచేయి సాధించింది. ఈ దశలో జట్టును గెలిపించాల్సిన బాధ్యత పృథ్వీ, పంత్‌లపై పడింది. మెక్‌కాయ్‌ ఓవర్లో వీరిద్దరు ధాటిని ప్రదర్శించడంతో 3 ఫోర్లు, సిక్స్‌ సహా మొత్తం 26 పరుగులు వచ్చాయి. పరాగ్‌ ఓవర్లో కూడా పంత్‌ 2 సిక్స్‌లు, ఫోర్‌ కొట్టడంతో 22 పరుగులు లభించాయి. అయితే 50 పరుగుల (31 బంతుల్లో) భాగస్వామ్యం తర్వాత పృథ్వీని అవుట్‌ చేసి అశ్విన్‌ ఢిల్లీని దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత విజయానికి 51 బంతుల్లో 99 పరుగులు చేయాల్సిన స్థితిలో పడిక్కల్‌ చక్కటి క్యాచ్‌కు పంత్‌ వెనుదిరగడంతో ఢిల్లీ ఆశలు కోల్పోయింది.

ప్రసిధ్‌ సూపర్‌
ఢిల్లీ విజయానికి చివరి 2 ఓవర్లలో 36 పరుగులు కావాలి. అంతకుముందు ఓవర్లో 2 సిక్స్‌లు కొట్టిన పావెల్‌ జోరు మీదుండటంతో అవకాశం ఉందనిపించింది. అయితే 19వ అద్భుతంగా బౌల్‌ చేసిన ప్రసిధ్‌ ప్రత్యర్థికి ఆ అవకాశం ఇవ్వలేదు. ఐదు డాట్‌ బంతులతో పాటు లలిత్‌ వికెట్‌ తీసి మెయిడిన్‌గా ముగించడంతో ఢిల్లీ అవకాశాలు దెబ్బతిన్నాయి. ఆ ఓవర్లో పావెల్‌కు అసలు స్ట్రయిక్‌ రాలేదు.

స్కోరు వివరాలు  
రాజస్తాన్‌ రాయల్స్‌ ఇన్నింగ్స్‌: బట్లర్‌ (సి) వార్నర్‌ (బి) ముస్తఫిజుర్‌ 116; పడిక్కల్‌ (ఎల్బీ) (బి) ఖలీల్‌ 54; సామ్సన్‌ (నాటౌట్‌) 46; హెట్‌మైర్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 2 వికెట్లకు) 222.
వికెట్ల పతనం: 1–155, 2–202.
బౌలింగ్‌: ఖలీల్‌ 4–0–47–1, శార్దుల్‌ 3–1–29–0, లలిత్‌ 4–0–41–0, ముస్తఫిజుర్‌ 4–0–43–1, కుల్దీప్‌ 3–0–40–0, అక్షర్‌ 2–0–21–0.  

ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: పృథ్వీ షా (సి) బౌల్ట్‌ (బి) అశ్విన్‌ 37; వార్నర్‌ (సి) సామ్సన్‌ (బి) ప్రసిధ్‌ 28; సర్ఫరాజ్‌ (సి) ప్రసిధ్‌ (బి) అశ్విన్‌ 1; పంత్‌ (సి) పడిక్కల్‌ (బి) ప్రసిధ్‌ 44; లలిత్‌ (సి) సామ్సన్‌ (బి) ప్రసిధ్‌ 37; అక్షర్‌ (బి) చహల్‌ 1; శార్దుల్‌ (రనౌట్‌) 10; పావెల్‌ (సి) సామ్సన్‌ (బి) మెక్‌కాయ్‌ 36; కుల్దీప్‌ (నాటౌట్‌) 0; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 207. వికెట్ల పతనం: 1–43, 2–48, 3–99, 4–124, 5–127, 6–157, 7–187, 8–207.

బౌలింగ్‌: బౌల్ట్‌ 4–0– 47–0, ప్రసిధ్‌ 4–1–22–3, మెక్‌కాయ్‌ 3–0– 52–1, అశ్విన్‌ 4–0–32–2, చహల్‌ 4–0–28–1, పరాగ్‌ 1–0–22–0.

ఐపీఎల్‌లో నేడు
కోల్‌కతా నైట్‌రైడర్స్‌ X గుజరాత్‌ టైటాన్స్‌
వేదిక: ముంబై, మధ్యాహ్నం గం. 3:30 నుంచి

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ X బెంగళూరు
వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం.

Advertisement
Advertisement