IPL 2022 MI Vs PBKS: తీరు మారని ముంబై ఇండియన్స్‌.. వరుసగా ఐదో ఓటమి.. పంజాబ్ ఘన విజయం

IPL 2022: Punjab beat Mumbai by 12 runs - Sakshi

రోహిత్‌ జట్టుకు వరుసగా ఐదో పరాజయం

12 పరుగులతో పంజాబ్‌ గెలుపు

ధావన్, మయాంక్‌ అర్ధ సెంచరీలు

ఒడియన్‌ స్మిత్‌కు 4 వికెట్లు

పుణే: ఐదు సార్లు ఐపీఎల్‌ చాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌ ఈ సీజన్‌లో ఒక్క విజయం కోసం అల్లాడిపోతోంది! సమష్టి వైఫల్యంతో వరుసగా ఐదో మ్యాచ్‌లో ఓడిన ఆ జట్టు ఇంకా పాయింట్ల ఖాతా తెరవలేకపోయింది. స్ఫూర్తిదాయక ఆటతో పట్టుదలగా పోరాడిన పంజాబ్‌ కింగ్స్‌ బుధవారం జరిగిన పోరులో 12 పరుగుల తేడాతో ముంబైని ఓడించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్‌ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది.

శిఖర్‌ ధావన్‌ (50 బంతుల్లో 70; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మయాంక్‌ అగర్వాల్‌ (32 బంతుల్లో 52; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించగా, జితేశ్‌ శర్మ (15 బంతుల్లో 30 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. అనంతరం ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లకు 186 పరుగులు చేసింది. డెవాల్డ్‌ బ్రెవిస్‌ (25 బంతుల్లో 49; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు), సూర్యకుమార్‌ యాదవ్‌ (30 బంతుల్లో 43; 1 ఫోర్, 4 సిక్స్‌లు), తిలక్‌ వర్మ (20 బంతుల్లో 36; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. బౌలింగ్‌లో 4 వికెట్లు తీయడంతో పాటు కీలక దశలో క్యాచ్, రనౌట్‌తో ఒడియన్‌ స్మిత్‌ పంజాబ్‌ విజయంలో ప్రధాన పాత్ర పోషించాడు.  

భారీ భాగస్వామ్యం...
ముంబై పేలవ బౌలింగ్‌తో పంజాబ్‌కు శుభారంభం లభించింది. ప్రత్యర్థి బౌలర్లపై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన మయాంక్, శిఖర్‌ తొలి వికెట్‌కు 57 బంతుల్లోనే 97 పరుగులు జోడించారు. గత మూడు మ్యాచ్‌లలో విఫలమైన కెప్టెన్‌ మయాంక్‌ ఈసారి చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌తో సత్తా చాటాడు. థంపి వేసిన తొలి ఓవర్లో రెండు బౌండరీలతో మొదలు పెట్టిన అతను మురుగన్‌ అశ్విన్‌ ఓవర్లో వరుస బంతుల్లో 4, 4, 6 బాదాడు. మిల్స్‌ బౌలింగ్‌లో భారీ సిక్సర్‌తో 30 బంతుల్లోనే అతని అర్ధ సెంచరీ పూర్తయింది. మరో ఎండ్‌లో శిఖర్‌ కూడా సీజన్‌లో తొలిసారి ప్రభావవంతమైన ప్రదర్శన కనబర్చాడు.

సిక్స్‌తో ఖాతా తెరచిన అతను ఆ తర్వాతా అదే ధాటిని కనబరుస్తూ 37 బంతుల్లో హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఎట్టకేలకు పదో ఓవర్లో మయాంక్‌ను అవుట్‌ చేసి ముంబై తొలి వికెట్‌ సాధించింది. అనంతరం పంజాబ్‌ ఇన్నింగ్స్‌ తడబడి పరుగులు రావడం కష్టంగా మారింది. మూడు పరుగుల తేడాతో బెయిర్‌స్టో (12), లివింగ్‌స్టోన్‌ (2) అవుట్‌ కాగా, కొద్ది సేపటికే శిఖర్‌ కూడా పెవిలియన్‌ చేరాడు. అయితే చివరి 3 ఓవర్లలో 47 పరుగులు సాధించి పంజాబ్‌ మెరుగైన స్కోరుతో ముగించింది. ఉనాద్కట్‌ ఓవర్లో జితేశ్‌ 2 ఫోర్లు, 2 సిక్స్‌లు కొట్టగా, థంపి ఓవర్లో షారుఖ్‌ (15) రెండు భారీ సిక్సర్లు బాదాడు.  

రాణించిన సూర్యకుమార్‌...
గత మ్యాచ్‌లతో పోలిస్తే ఈసారి దూకుడుగా ఇన్నిం గ్స్‌ మొదలు పెట్టిన రోహిత్‌ శర్మ (17 బంతుల్లో 28; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) అదే జోరులో మరో పుల్‌ షాట్‌కు ప్రయత్నించి అవుట్‌ కాగా, ఇషాన్‌ కిషన్‌ (3) విఫలమయ్యాడు. ఈ దశలో బ్రెవిస్, తిలక్‌ భాగస్వామ్యం ఒక్కసారిగా ముంబై జట్టును ముందుకు తీసుకొచ్చింది. ఒకరితో పోటీ పడి మరొకరు పరుగులు సాధించిన వీరిద్దరు మూడో వికెట్‌కు 41 బంతుల్లోనే 84 పరుగులు జోడించారు.

అర్‌‡్షదీప్‌ ఓవర్లో బ్రెవిస్‌ 2 ఫోర్లు కొట్టగా, వైభవ్‌ ఓవర్లో తిలక్‌ ఫోర్, సిక్స్‌ బాదాడు. భారీ భాగస్వామ్యం మరో భారీ షాట్‌ క్రమంలో బ్రెవిస్‌ వెనుదిరగ్గా, లేని సింగిల్‌కు ప్రయత్నించి తిలక్‌ రనౌటయ్యాడు. పొలార్డ్‌ (10) కూడా బద్ధకంగా పరుగెత్తి రనౌట్‌ కావడంతో ముంబై కష్టాల్లో పడింది. అయి తే మరో ఎండ్‌లో సూర్యకుమార్‌ ధాటిగా ఆడుతూ విజయంపై ఆశలు రేపాడు. కానీ 9 బంతుల్లో 22 పరుగులు చేయాల్సిన స్థితిలో సూర్య కూడా అవుట్‌ కావడంతో ముంబై ఓటమికి చేరువైంది.

స్కోరు వివరాలు
పంజాబ్‌ కింగ్స్‌ ఇన్నింగ్స్‌: మయాంక్‌ (సి) సూర్యకుమార్‌ (బి) అశ్విన్‌ 52; శిఖర్‌ ధావన్‌ (సి) పొలార్డ్‌ (బి) థంపి 70; బెయిర్‌స్టో (బి) ఉనాద్కట్‌ 12; లివింగ్‌స్టోన్‌ (బి) బుమ్రా 2; జితేశ్‌ (నాటౌట్‌) 30; షారుఖ్‌ (బి) థంపి 15; ఒడియన్‌ స్మిత్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 198.
వికెట్ల పతనం: 1–97, 2–127, 3–130, 4–151, 5–197.
బౌలింగ్‌: థంపి 4–0–47–2, ఉనాద్కట్‌ 4–0–44–1, బుమ్రా 4–0–28–1, మురుగన్‌ అశ్విన్‌ 4–0–34–1, మిల్స్‌ 4–0–37–0.  

ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌: రోహిత్‌ (సి) వైభవ్‌ (బి) రబడ 28; ఇషాన్‌ కిషన్‌ (సి) జితేశ్‌ (బి) వైభవ్‌ 3; బ్రెవిస్‌ (సి) అర్‌‡్షదీప్‌ (బి) స్మిత్‌ 49; తిలక్‌ వర్మ (రనౌట్‌) 36; సూర్యకుమార్‌ (సి) స్మిత్‌ (బి) రబడ 43, పొలార్డ్‌ (రనౌట్‌) 10; ఉనాద్కట్‌ (సి) మయాంక్‌ (బి) స్మిత్‌ 12; అశ్విన్‌ (నాటౌట్‌) 0; బుమ్రా (సి) ధావన్‌ (బి) స్మిత్‌ 0; మిల్స్‌ (సి) మయాంక్‌ (బి) స్మిత్‌ 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 186.
వికెట్ల పతనం: 1–31, 2–32, 3–116, 4–131, 5–152, 6–177, 7–185, 8–186, 9–186.
బౌలింగ్‌: వైభవ్‌ 4–0–43–1, రబడ 4–0–29–2, అర్‌‡్షదీప్‌ 4–0–29–0, ఒడియన్‌ స్మిత్‌ 3–0–30–4, లివింగ్‌స్టోన్‌ 1–0–11–0, రాహుల్‌ చహర్‌ 4–0–44–0.

2: పంజాబ్‌తో మ్యాచ్‌లో 28 పరుగులు చేసిన క్రమంలో ముంబై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టి20 క్రికెట్‌లో 10 వేల పరుగులు పూర్తి చేసుకున్న రెండో భారత క్రికెటర్‌గా, ఓవరాల్‌గా ఏడో క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. విరాట్‌ కోహ్లి (10,379 పరుగులు) ఈ జాబితాలో ఐదో స్థానంలో ఉండగా... క్రిస్‌ గేల్‌ (14,562 పరుగులు) టాప్‌ ర్యాంక్‌లో ఉన్నాడు.

ఐపీఎల్‌లో నేడు
రాజస్తాన్‌ రాయల్స్‌ X గుజరాత్‌ టైటాన్స్‌
వేదిక: ముంబై, రాత్రి గం. 7:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top