IPL 2021 Phase 2: ఆ జట్టు ప్లేఆఫ్స్‌కు చేరడం కష్టమే: బ్రాడ్‌హాగ్‌

IPL 2021 Phase 2: Brad Hogg Says This Team May Not Enter Playoffs - Sakshi

Brad Hogg On Rajasthan Royals Team: ఐపీఎల్‌- 2021లో రాజస్తాన్‌ రాయల్స్‌ జట్టు ప్లే ఆఫ్స్‌కు చేరే అవకాశం లేదని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ బ్రాడ్‌ హాగ్‌ అభిప్రాయపడ్డాడు. ప్రధాన ఆటగాళ్లంతా జట్టుకు దూరమయ్యారని, దీంతో కెప్టెన్‌ సంజూ శాంసన్‌పైనే ఎక్కువగా ఆధారపడాల్సిన పరిస్థితి ఉందని పేర్కొన్నాడు. కాబట్టి రాజస్తాన్‌కు కష్టాలు తప్పకపోవచ్చని ఈ స్పిన్‌ దిగ్గజం జోస్యం చెప్పాడు. కాగా ఇంగ్లండ్‌ పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌ గాయాలతో బాధపడుతుండగా, జోస్‌ బట్లర్‌, బెన్‌ స్టోక్స్‌, ఆండ్రూ టై వంటి కీలక ఆటగాళ్లు సైతం వివిధ కారణాలతో జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. వీరంతా ఐపీఎల్‌ రెండో దశకు అందుబాటులో ఉండే పరిస్థితి లేదు.

ఈ నేపథ్యంలో బ్రాడ్‌ హాగ్‌ మాట్లాడుతూ.. ‘‘ఈసారి రాజస్తాన్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆర్చర్‌, బట్లర్‌, స్టోక్స్‌, టై వంటి నలుగురు ప్రధాన ఆటగాళ్లు దూరమయ్యారు. ఇలాంటప్పుడు తుదిజట్టు ఎంపికలో మరింత ఆచితూచి వ్యవహరించాల్సిన పరిస్థితి. నాకు తెలిసి బట్లర్‌ స్థానంలో టాపార్డర్‌లో లియాం లివింగ్‌స్టోన్‌ ఆడతాడు. ఇక బౌలింగ్‌ ఆర్డర్‌ విషయానికొస్తే గత మొదటి దశ మాదిరిగానే పాత కాంబినేషన్‌తోనే వారు ముందుకు సాగే అవకాశం ఉంది. అయితే, వారి పేస్‌ బౌలింగ్‌లో అంతగా పదును లేదన్నది తెలిసిన విషయమే’’ అని పేర్కొన్నాడు.

చదవండి: Sanju Samson: ఈసారి కచ్చితంగా చాంపియన్‌గా నిలవాలి!

కెప్టెన్‌ సంజూ శాంసన్‌, సంగక్కర.. ఫొటో: రాజస్తాన్‌ రాయల్స్‌

అదే విధంగా రాజస్తాన్‌ జట్టులో కొత్తగా చేరిన ఆటగాళ్ల గురించి చెబుతూ.. ‘‘భుజానికి గాయమైన కారణంగా ఎవిన్‌ లూయీస్‌ దూరమయ్యే పరిస్థితి. గ్లెన్‌ ఫిలిప్స్‌ను తీసుకుని మంచి పనిచేశారు. అంతేకాదు దక్షిణాఫ్రికా ఆటగాడు తబ్రేజ్‌ షమ్సీని జట్టులోకి తీసుకోవాలన్న నిర్ణయం నాకెంతగానో నచ్చింది. అయితే, ప్రధాన బ్యాట్స్‌మెన్‌ దూరం కావడంతో కెప్టెన్‌ శాంసన్‌పైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుంది. ఏదేమైనా రాజస్తాన్‌ ఈసారి ప్లేఆఫ్స్‌కు చేరుకోవడం కాస్త కష్టమే. ఎందుకంటే ఏడు మ్యాచ్‌లు ఆడి నాలుగింటిలో ఓడారు. మిగిలిన ఏడు మ్యాచ్‌లలో కనీసం నాలుగింటిలో గెలిస్తేనే టాప్‌- 4కు చేరుకునే అవకాశం ఉంటుంది. నాకు తెలిసి రాజస్తాన్‌ ఈసారి ప్లే ఆఫ్స్‌కు వెళ్లలేదు’’ అని హాగ్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు. కాగా యూఏఈ వేదికగా జరుగనున్న ఐపీఎల్‌ రెండో అంచెలో భాగంగా సెప్టెంబరు 21న రాజస్తాన్‌, పంజాబ్‌ కింగ్స్‌తో తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. 

చదవండి: IPL 2021 Phase 2: ఈసారి కూడా టైటిల్‌ వాళ్లదే: ఇంగ్లండ్‌ మాజీ క్రికెటర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top