'డబ్బు కోసం లీగ్‌లు ఆడం.. నా జీవితాన్ని మార్చేసింది'

Tabraiz Shamsi Feels Players Dont Feature T20 Leagues Only For Money - Sakshi

జోహన్నెస్‌బర్గ్‌ : ఐపీఎల్‌ లాంటి లీగ్‌ల ద్వారా నైపుణ్యం ఉన్న ఆటగాళ్లు ఎందరో పరిచయమయ్యారు. రవీంద్ర జడేజా, అజింక్య రహానే లాంటి ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడిన తర్వాతే భారత జట్టులో చోటు సంపాదించారు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా బౌలర్‌ తబ్రెజ్‌ షంసీ టీ20 లీగ్‌లపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. '' ఏ దేశానికి చెందిన ఆటగాడైనా సరే.. డబ్బుల కోసం లీగ్‌ మాత్రం ఆడడు.. ఆటలో నైపుణ్యం చూపించే అవకాశం ఇలాంటి లీగ్‌ల ద్వారానే వస్తాయి. నా దృష్టిలో సీపీఎల్‌, ఐపీఎల్‌, ఇంగ్లీష్‌ దేశాల్లో ఆడే కౌంటీ క్రికెట్‌ ద్వారా ఆట మెరుగైందని అనుకుంటున్నా. నేను ఇవాళ దక్షిణాఫ్రికా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నా అంటే దానికి ఇలాంటి లీగ్‌లే కారణం.

ఇలాంటి లీగ్స్‌లో ఆడడం వల్ల వివిధ దేశాలకు చెందిన ఆటగాళ్లతో పరిచయాలు.. వారితో కలిసి ఆడడం వల్ల బౌలింగ్‌లో మరిన్ని మెళుకువలు సాధించే అవకాశాలుంటాయి. నేను ఐపీఎల్‌ ఆడిన మ్యాచ్‌లు తక్కువే కావొచ్చు.. కానీ కరేబియన్‌ లీగ్‌లో మాత్రం చాలా మ్యాచ్‌లు ఆడాను.. అది నా జీవితాన్నే మార్చేసింది.'' అని చెప్పుకొచ్చాడు. కాగా షంసీ 2016లో రైజింగ్‌ పుణే సూపర్‌జెయింట్స్‌ తరపున ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. ఇక దక్షిణాఫ్రికా తరపున  2 టెస్టుల్లో 6 వికెట్లు, 24 వన్డేల్లో 27 వికెట్లు, 32 టీ20ల్లో 31 వికెట్లు తీశాడు.

ఐపీఎల్‌ 14వ సీజన్‌ రద్దు అనంతరం లీగ్‌లో పాల్గొన్న విదేశీ ఆటగాళ్లు ఎవరి సొంత దేశాలకు వారు చేరుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఇప్పటికే వెస్టిండీస్‌, దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌ ఆటగాళ్లు వారి సొంత దేశానికి చేరుకోగా.. ఆస్ట్రేలియా ఆటగాళ్లు మాత్రం డైరెక్ట్‌గా దేశానికి వెళ్లే అవకాశం లేకపోవడంతో మాల్దీవ్స్‌కు వెళ్లి అక్కడినుంచి ఆసీస్‌కు వెళ్లనున్నారు. ఇక న్యూజిలాండ్‌కు చెందిన ఆటగాళ్లలో కొందరు స్వదేశానికి వెళ్లగా.. భారత్‌తో టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆడాల్సి ఉన్న నేపథ్యంలో మరికొందరు ఆటగాళ్లు మాత్రం ఇంగ్లండ్‌కు చేరుకున్నారు.
చదవండి: ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు
'ప్రైవేట్ జెట్‌లో వెళ్లి అక్కడి వీధుల్లో శ‌వాల‌ను చూడండి'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top