Indian Olympic Association: మాకొద్దీ చైనా దుస్తులు!

IOA drops Chinese brand as team kit sponsor after criticism - Sakshi

‘లీ నింగ్‌’తో ఒప్పందం రద్దు చేసుకున్న ఐఓఏ

మనోభావాల పేరుతో అనూహ్య నిర్ణయం

న్యూఢిల్లీ: గత గురువారం... టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే భారత ఆటగాళ్లు ధరించే కిట్‌లను కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు, భారత ఒలింపిక్‌ సంఘం (ఐఓఏ) అధ్యక్షుడు నరీందర్‌ బాద్రా లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ కిట్‌లను చైనాకు చెందిన ‘లీ నింగ్‌’ కంపెనీ స్పాన్సర్‌ చేస్తోంది. ఈ కార్యక్రమంలో పలువురు ఆటగాళ్లు పాల్గొని ఆ కిట్‌లో పోజులు ఇచ్చారు. అయితే వారం తిరక్క ముందే కథ మారింది. అంతర్గతంగా ఏం జరిగిందో గానీ అనూహ్యంగా ‘సెంటిమెంట్‌’ ముం దు కు వచ్చింది.

చైనా కంపెనీ తయారు చేసిన దుస్తులతో తమ ఆటగాళ్లు ఒలింపిక్స్‌ బరిలోకి దిగరని, ‘లీ నింగ్‌’తో ఒప్పందం రద్దు చేసుకుంటున్నట్లు ఐఓఏ బుధవారం ప్రకటించింది. ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఐఓఏ అధ్యక్షుడు నరీందర్‌ బాత్రా వెల్లడించారు. ‘మేం కిట్‌ను ఆవిష్కరించిన తర్వాత అన్ని వర్గాలనుంచి విమర్శలు వచ్చాయి. ప్రజల సెంటిమెంట్‌ కోణంలోనే ఆ కంపెనీని పక్కన పెట్టాలని భావించాం. అభిమానుల భావోద్వేగాలు కూడా ముఖ్యం కదా’ అని ఆయన అన్నారు. అయితే టోక్యో ఒలింపిక్స్‌లో మన ఆటగాళ్లు ఏ అపెరల్‌ కంపెనీ లోగో కూడా లేని దుస్తులతో బరిలోకి దిగుతారని ముందుగా ప్రకటించిన బాత్రా... ఈ నెలాఖరులోగా మరో కొత్త స్పాన్సర్‌ కోసం వెతుకుతామని చెప్పడం విశేషం.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top