Karnam Malleswari: తెలుగు బిడ్డ కరణం మల్లీశ్వరీ విజయగాథ

Inspirational Story About Olympian Karnam Malleswari - Sakshi

2000, సెప్టెంబర్‌ 19.. ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం.. ఒలింపిక్స్‌ బహమతి ప్రదానోత్సవ వేదికపై భారత జాతీయ జెండా ఎగిరింది. కళ్ళల్లో అంతు లేని ఆనందం! బయటకు వ్యక్తీకరించలేని భావోద్వేగంతో పాతికేళ్ల వయసున్న ఒక అచ్చ తెలుగు బిడ్డ సగర్వంగా ఆ వేదికపై నిలబడింది. ప్రపంచానికి మరో వైపు భారత్‌లో కూడా దాదాపు అదే తరహా వాతావరణం కనిపించింది. మన అమ్మాయి సృష్టించిన కొత్త చరిత్ర గురించే అంతటా చర్చ. ఇంకా చెప్పాలంటే తామే ఆ ఘనతను సాధించినంతగా ఎంతో మంది సంబరపడిపోయారు. కొద్ది క్షణాల తర్వాత ‘భారత్‌ కీ బేటీ’ అంటూ దేశ ప్రధాని వాజ్‌పేయి నుంచి వచ్చిన ఏకవాక్య ప్రశంస ఆ చారిత్రక ఘట్టం విలువను మరింత పెంచింది. 

ఒలింపిక్స్‌ చరిత్రలో భారత్‌ నుంచి ఒక మహిళ సాధించిన తొలి పతకమది. బరువులెత్తే పోటీల్లో భారత అభిమానుల అంచనాల భారాన్ని మోస్తూ బరిలోకి దిగిన మన ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి అందుకున్న గొప్ప విజయమది. ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల ప్రాంతం ఊసవానిపేట నుంచి వచ్చి ఒలింపిక్స్‌ వేదికపై కాంస్యం అందుకున్న ఆ అద్భుతం పేరే కరణం మల్లీశ్వరి.

ఒలింపిక్స్‌లో మనోళ్లు పాల్గొనడమే తప్ప అంచనాలు లేని, పతకం ఆశించని భారత క్రీడాభిమానులకు ఆ కంచు కూడా కనకంలా కనిపించింది. అన్నింటికి మించి మలీశ్వరి గెలిచిన మెడల్‌ ఆమె కంఠానికి మాత్రమే ఆభరణంగా మారలేదు. భవిష్యత్తులో మన దేశం నుంచి క్రీడల్లో రాణించాలనుకున్న అమ్మాయిలకు స్ఫూర్తిగా నిలిచి లక్ష్యాలను నిర్దేశించింది. 

సిడ్నీ ఒలింపిక్స్‌కు ముందు భారత్‌ ఖాతాలో రెండు వ్యక్తిగత పతకాలు మాత్రమే ఉన్నాయి. 1952 హెల్సింకీ ఒలింపిక్స్‌లో రెజ్లింగ్‌లో కె.డి. జాదవ్, 1996 అట్లాంటా ఒలింపిక్స్‌లో టెన్నిస్‌లో లియాండర్‌ పేస్‌ ఆ పతకాలు సాధించారు. సిడ్నీ ఒలింపిక్స్‌లోనే మహిళల వెయిట్‌ లిఫ్టింగ్‌ను తొలిసారి ప్రవేశపెట్టారు. మల్లీశ్వరి అప్పటికీ అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటి తానేంటో రుజువు చేసుకుంది. అయినా సరే ఒలింపిక్స్‌ పతకంపై అంచనాలు లేవు.

ఇతర ఈవెంట్లలో ఎన్ని ఘనతలు సాధించినా ఒలింపిక్స్‌కు వచ్చేసరికి మన ప్లేయర్లు తడబడటం అప్పటికే ఎన్నో సార్లు కనిపించగా.. మల్లీశ్వరి వెయిట్‌ కేటగిరీకి ఇది పూర్తిగా భిన్నం కావడంతో ఎలాంటి ఆశా లేకుండింది. 1993, 1994, 1995, 1996లలో వరుసగా నాలుగేళ్ల పాటు వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో మల్లీశ్వరి పతకాలు గెలుచుకుంది. ఇందులో 2 స్వర్ణాలు, 2 కాంస్యాలు ఉన్నాయి. దీంతో పాటు 1994 హిరోషియా ఆసియా క్రీడల్లో కూడా రజతం సాధించింది. అయితే ఇవన్నీ 54 కేజీల విభాగంలో వచ్చాయి. ఆ తర్వాత కొంత బరువు పెరిగిన ఆమె 63 కేజీల కేటగిరీకి మారి 1998 బ్యాంకాక్‌ ఆసియా క్రీడల్లోనూ కాంస్యం సాధించింది.

అయితే ఒలింపిక్స్‌కు వచ్చే సరికి 69 కేజీల కేటగిరీలో పోటీ పడాల్సి వచ్చింది. అప్పటి వరకు ఆమె ఆ విభాగంలో ఎలాంటి అంతర్జాతీయ ఈవెంట్‌లో పాల్గొనకపోగా, వరల్డ్‌ చాంపియన్‌షిప్‌లో పతకం సాధించి కూడా నాలుగేళ్లయింది. దాంతో మల్లీశ్వరి గెలుపుపై సందేహాలే నెలకొన్నాయి. 

ఆ రోజు ఏం జరిగిందంటే...
ఫైనల్లో మొత్తం 15 మంది లిఫ్టర్లు పోటీ పడ్డారు. 12 మంది పేలవ ప్రదర్శనతో బాగా వెనుకబడిపోగా, ముగ్గురి మధ్యనే తుది పోటీ నెలకొంది. స్నాచ్‌ విభాగంలో 110 కిలోల బరువెత్తిన మల్లీశ్వరి మరో లిఫ్టర్‌తో కలసి సమానంగా రెండో స్థానంలో ఉంది. ఆ తర్వాత రెండో అంకమైన క్లీన్‌ అండ్‌ జర్క్‌ వచ్చింది. ఆమె కంటే ముందుగా చైనా, హంగేరీ అమ్మాయిలు 132.5, 130 కిలోల చొప్పున బరువులెత్తి సవాల్‌ విసిరారు.

రెండు విభాగాల్లో కలిపి మొత్తం పాయింట్లు చూస్తే మిగతా ఇద్దరికంటే మల్లీశ్వరి 2.5 కిలోలు తక్కువ బరువెత్తింది. ఆమెకు ఆఖరి ప్రయత్నం మిగిలి ఉంది. ఆమె శరీర బరువును కూడా లెక్కలోకి తీసుకుంటే 132.5 కిలోలు ఎత్తితే రజతం ఖాయం, ఆపై 135 కిలోలు ఎత్తితే స్వర్ణం లభించేది. అయితే ఈ సమయంలో కోచ్‌లు ఇచ్చిన సూచనలతో పెద్ద సాహసానికి ప్రయత్నించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం కోల్పోరాదని భావించి నేరుగా 137.5 కిలోలు ఎత్తేందుకు సిద్ధపడింది.

ప్రాక్టీస్‌లో దీనిని సునాయాసంగా ఎత్తిన అనుభవం ఉండటం ఆమె నమ్మకానికి కారణం. అయితే అంతకు ముందు రెండో ప్రయత్నంలో 130 కిలోలే ఎత్తిన మల్లీశ్వరి మూడో ప్రయత్నంలో ఏకంగా 7.5 కిలోలు పెంచడం అసాధ్యంగా మారింది. దానిని పూర్తి చేయలేక ఈ ప్రయత్నం ‘ఫౌల్‌’గా మారింది. చివరకు ఓవరాల్‌గా 240 కిలోల బరువుతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం అందుకుంది. అయితేనేం.. భారత క్రీడల్లో కొత్త చరిత్ర సృష్టించేందుకు అది సరిపోయింది. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళగా మల్లీశ్వరి కీర్తి చిరస్థాయిగా నిలిచింది. 

అమ్మ అండగా..
మల్లీశ్వరి ఆటలో ఓనమాలు నేర్చుకున్న సమయంలో పరిస్థితులు పూర్తిగా భిన్నం. అందుబాటులో ఉన్న కొద్దిపాటి స్థలంలో పాతకాలపు పరికరాలతోనే వెయిట్‌ లిఫ్టింగ్‌ సాధన మొదలైంది. ఈ క్రీడలో భవిష్యత్తు ఎలా ఉంటుందో ఎవరికీ నమ్మకం లేని సమయంలో తన అక్కను చూసి మల్లీశ్వరి ఆట వైపు ఆకర్షితురాలైంది. ఆరంభంలో బలహీనంగా ఉందంటూ కోచ్‌ నీలంశెట్టి అప్పన్న తిరస్కరించినా, ఆ తర్వాత ఆమెకు అవకాశం కల్పించాడు.

ఈ క్రమంలో అందరికంటే ఎక్కువగా తల్లి శ్యామల అండగా నిలిచి కూతురుని ప్రోత్సహించింది. 1990 ఆసియా క్రీడలకు ముందు జాతీయ క్యాంప్‌లో అక్కను కలిసేందుకు వెళ్లిన మల్లీశ్వరిలో ప్రతిభను కోచ్‌ లియోనిడ్‌ తారానెంకో గుర్తించి సరైన దిశ చూపించాడు. దాంతో బెంగళూరు ‘సాయ్‌’ కేంద్రంలో ఆమెకు అవకాశం దక్కింది.

ఆపై జాతీయ జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో వరుసగా రికార్డులు నెలకొల్పి సీనియర్‌ నేషనల్స్‌లో రజతం సాధించడంతో మల్లీశ్వరి విజయ ప్రస్థానం మొదలైంది. ఆపై వరుస అవకాశాలు అందుకున్న ఆమె వరల్డ్‌ చాంపియన్‌ షిప్‌లలో సంచలన ప్రదర్శనతో పలు ఘనతలు తన పేరిట లిఖించుకుంది. 18 ఏళ్ల వయసులో తొలి వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ పతకంతో మొదలు పెట్టి ఈ ప్రయాణం చివరకు ఒలింపిక్స్‌ మెడల్‌ వరకు సాగడం విశేషం. 

ఆమె స్ఫూర్తితోనే..
‘80వ దశకం చివర్లో మన మహిళా ప్లేయర్లు మంచి ఫలితాలు సాధిస్తుండటం మొదలైంది. ఉష, షైనీ విల్సన్, కుంజరాణిలాంటి ప్లేయర్లు పెద్ద వేదికపై రాణించారు. కానీ మలీశ్వరి విజయంతోనే అసలైన మార్పు వచ్చింది. 2000 తర్వాతే అన్ని క్రీడాంశాల్లో ప్రాతినిధ్యం పెరుగుతూ వచ్చింది. ఒలింపిక్స్‌లో  సైనా, సింధు, మేరీకోమ్‌వంటి విజేతలు వచ్చేందుకు మల్లీశ్వరి విజయమే కారణం’ అని అథ్లెట్‌ దిగ్గజం అంజూ జార్జ్‌ చెప్పడం ఆ పతకం విలువను చెప్పింది.

సిడ్నీలో భారత్‌ సాధించిన ఏకైక పతకం కూడా అదే. రెజ్లింగ్‌లో స్టార్లను అందించిన మహావీర్‌ ఫొగాట్‌కు తన కూతుళ్లు ఏదైనా సాధించగలరనే నమ్మకాన్ని మల్లీశ్వరి విజయం అందించిందట. ఈ విషయాన్ని స్వయంగా రెజ్లర్‌ గీతా ఫొగాట్‌ వెల్లడించడం విశేషం. ‘మల్లీశ్వరి గెలిచినప్పుడు విజయం స్థాయి ఏంటో మాకు అర్థం కాలేదు కానీ నాన్న మాత్రం అదే మేలిమలుపుగా చెప్పుకునేవారు. ఆమె గురించే మాకు ట్రైనింగ్‌లో మళ్లీ మళ్లీ చెప్పేవారు. నాన్నకు సంబంధించి మల్లీశ్వరి హరియాణా అమ్మాయే’ అని గీత గుర్తు చేసుకుంది. నిజంగానే ఏ ప్రమాణాల ప్రకారం చూసుకున్నా మల్లీశ్వరి సాధించిన విజయం చాలా గొప్పది. ఆమె సాధించిన ఘనత ఒక తరంలో పెద్ద సంఖ్యలో ఆడపిల్లలను ఆటల వైపు మళ్లించిందనడంలో సందేహం లేదు. 

కొత్త బాధ్యతతో...
సహచర వెయిట్‌లిఫ్టర్‌ రాజేశ్‌త్యాగిని వివాహం చేసుకున్న అనంతరం హరియాణాలోనే..యమునా నగర్‌లో మల్లీశ్వరి స్థిరపడిపోయింది. అక్కడే వెయిట్‌లిఫ్టింగ్‌ అకాడమీని నిర్వహిస్తోన్న ఆమె ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌సీఐ) ఉద్యోగిగా బాధ్యతలు నిర్వర్తిస్తోంది. అర్జున, ఖేల్‌రత్న, పద్మశ్రీ, పురస్కారాలు అందుకున్న మల్లీశ్వరి ఇప్పుడు కొత్త బాధ్యతలు చేపడుతోంది. త్వరలో ఢిల్లీ ప్రభుత్వం ప్రారంభించబోయే స్పోర్ట్స్‌ యూనివర్సిటీకి తొలి వైస్‌ చాన్స్‌లర్‌గా ఆమెను నియమించారు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top