
మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా మహిళల జట్టుతో ఇవాళ (సెప్టెంబర్ 17) జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా ఓ మోస్తరు స్కోర్‌కే పరిమితమైంది. ఓపెనర్ స్మృతి మంధన (91 బంతుల్లో 117; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు శతకంతో చెలరేగినా భారత్ భారీ స్కోర్ చేయలేకపోయింది. చివరి వరుస బ్యాటర్లు విఫలం కావడంతో 49.5 ఓవర్లలో 292 పరుగులకే ఆలౌటైంది.
ఓ దశలో భారత్ 350కి పైగా స్కోర్ చేస్తుందేమో అనిపించింది. అయితే మంధన ఔటైన తర్వాత పరిస్థితి తారుమారైంది. దీప్తి శర్మ (40), రిచా ఘోష్ (29) కాసేపు పోరాడారు. ఆతర్వాత వచ్చిన రాధా యాదవ్ (6), అరుంధతి రెడ్డి (4), క్రాంతి గౌడ్ (2) స్వల్ప స్కోర్లకే ఔటయ్యారు. ఆఖర్లో స్నేహ్ రాణా (24) బ్యాట్ ఝులిపించిడంతో భారత్ 290 పరుగుల మార్కునైనా తాకగలిగింది.
అంతకుముందు టాపార్డర్ బ్యాటర్లు (మంధన మినహా) కూడా తడబడ్డారు. ఓపెనర్ ప్రతిక రావల్‌కు (25) మంచి ఆరంభం లభించినా భారీ స్కోర్‌గా మలచలేకపోయింది. వన్‌డౌన్ బ్యాటర్ హర్లీన్ డియోల్ (10), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (17) కూడా తక్కువ స్కోర్లకే ఔటై నిరాశపరిచారు.
ఓ పక్క వికెట్లు పడుతున్నా మంధన ఏమాత్రం తగ్గకుండా ధాటిగా ఆడటం కొనసాగించింది. 32.2 ఓవర్లలో 192 పరుగుల వద్ద మంధన ఔట్ కావడంతో భారత్ స్కోర్ నెమ్మదించింది. మంధన ఔటయ్యాక భారత్ చివరి 6 వికెట్లు 53 పరుగుల వ్యవధిలో కోల్పోయింది. మంధన దెబ్బకు తొలుత లయ కోల్పోయిన ఆసీస్ బౌలర్లు, ఆఖర్లో పుంజుకున్నారు.
డార్సీ బ్రౌన్ 3, ఆష్లే గార్డ్‌నర్ 2, మెగాన్ షట్, అన్నాబెల్ సదర్‌ల్యాండ్, తహ్లియా మెక్‌గ్రాత్ తలో వికెట్ తీశారు. వీరిలో గార్డ్‌నర్ (10-1-39-2) పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా వికెట్లు తీయగలిగింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ కెప్టెన్ హీలీ ఏకంగా ఎనిమిది బౌలర్లను ప్రయోగించింది.
అనంతరం 293 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్‌కు రెండో ఓవర్‌లోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ జార్జియా వాల్‌ను రేణుకా సింగ్ డకౌట్ చేసింది. రేణుకా బౌలింగ్‌కు ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడిన వాల్ 5 బంతులు ఎదుర్కొన్న తర్వాత క్లీన్ బౌల్డ్ అయ్యింది.
భారత్‌కు ఐదో ఓవర్ ఐదో బంతికి మరో బ్రేక్ లభించింది. మరో ఓపెనర్ అలైస్సా హీలీని (9) క్రాంతి గౌడ్ బోల్తా కొట్టించింది. దీంతో ఆసీస్ 5 ఓవర్లలో 12 పరుగులకే ఓపెనర్ల వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ మ్యాచ్‌లో ఆసీస్ గెలవాలంటే 45 ఓవర్లలో మరో 281 పరుగులు చేయాలి. కాగా, ఈ సిరీస్‌లోని తొలి వన్డేలో గెలిచి ఆసీస్ 1-0 ఆధిక్యంలో ఉన్న విషయం తెలిసిందే.