తొలి వన్డే వరల్డ్‌కప్‌ను గెలిచి భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆదివారం జరిగిన ఫైనల్లో 52 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించిన భారత జట్టు.. తమ చిరకాల స్వప్నాన్ని నేరవేర్చుకుంది. అంజుమ్ చోప్రా, జులాన్ గో స్వామి, మిథాలీ రాజ్ వంటి దిగ్గజ కెప్టెన్‌లకు సాధ్యం కాని వరల్డ్‌కప్‌ను హర్మన్ ప్రీత్ కౌర్ భారత్‌కు అందించింది.
దీంతో ఉమెన్ ఇన్ బ్లూపై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో భారత జట్టుకు పారిశ్రామికవేత్త, రాజ్యసభ సభ్యులు గోవింద్ ధోలాకియా ప్రత్యేక బహుమతిని ప్రకటించారు. సూరత్‌కు చెందిన గోవింద్ ధోలాకియా.. హర్మన్ సేనకు వజ్రాభరణాలు(డైమండ్ నెక్లస్), సోలార్ ప్యానెళ్లను గిప్ట్‌గా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఆదివారం ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఢోలాకియా బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లాకు లేఖ రాశారు.
"వన్డే వరల్డ్‌ప్‌లో మన భారత మహిళల జట్టు అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తోంది. ఫైనల్లో కూడా విజయం సాధించి మన అమ్మాయిలు ఛాంపియన్‌గా నిలుస్తారని ఆశిస్తున్నాను. ఒకవేళ భారత్ కప్‌ను గెలుచుకుంటే జట్టులో సభ్యులందరికీ వజ్రాల ఆభరణాలను కానుకగా ఇవ్వాలనుకుంటున్నాను. దీంతో పాటు వారందరి ఇళ్లపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయాలనుకుంటున్నాను" అని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.
ఇప్పుడు భారత జట్టు విశ్వ విజేతగా నిలవడంతో ధోలాకియా తన మాటను నిలబెట్టుకోనున్నారు. త్వరలోనే జట్టులోని ప్రతీ ఒక్కరికి తన ప్రకటించిన గిఫ్ట్‌లను ఇవ్వనున్నట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. కాగా వరల్డ్ ఛాంపియన్స్‌కు బీసీసీఐ కూడా భారీ నజరానా ప్రకటించింది. భారత జట్టుతో పాటు సహాయక సిబ్బందికి కలిపి రూ. 51 కోట్ల భారీ నగదు బహుమతిని భారత క్రికెట్ బోర్డు ఇవ్వనుంది.
చదవండి: Womens World cup: చెల్లి కోసం అన్న త్యాగం.. ఇప్పుడు ఏకంగా వరల్డ్‌కప్‌నే


