భారత మహిళల జట్టు ప్రపంచాన్ని జయించింది. ఐసీసీ మహిళల వన్డే వరల్డ్‌కప్-2025 విజేతగా టీమిండియా నిలిచింది. ఆదివారం ముంబై వేదికగా జరిగిన తుది పోరులో 52 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసిన హర్మన్ సేన.. సరికొత్త వరల్డ్ ఛాంపియన్‌గా అవతరించింది. మన అమ్మాయిలు తమ అద్బుత పోరాటంతో విశ్వవేదికపై భారత జెండాను రెపరెపాలడించారు. ఒకే ఒక్క విజయంతో 140 కోట్ల మంది భారతీయులను తలెత్తుకునేలా చేశారు.
కాగా ఈ చారిత్రత్మక విజయంలో స్టార్ పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్‌ది కీలక పాత్ర. ఫైనల్ మ్యాచ్‌లో రేణుకా వికెట్లు పడగొట్టనప్పటికి.. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది. పవర్ ప్లేలో బంతిని స్వింగ్ చేస్తూ ప్రోటీస్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెట్టిన రేణుకా.. డెత్ ఓవర్లలోనూ తన పేస్ బౌలింగ్‌తో సత్తాచాటింది.
మొత్తంగా టోర్నీలో రేణుకా మూడు వికెట్లు పడగొట్టింది. అయితే రేణుకా సక్సెస్ వెనక ఆమె తల్లి సునీత కష్టం దాగి ఉంది. రేణుకా చిన్నతనంలోనే తన తండ్రి మరణించినప్పటికి.. తల్లి సునీత అన్ని తానే అయ్యి బిడ్డలను ఈ స్ధాయికి చేర్చింది.
తండ్రి కలను నేరవేర్చిన రేణుకా..
"మా ఆయనకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. పిల్లల్లో ఎవరో ఒకరిని కబడ్డీ ప్లేయర్‌గా లేదా క్రికెటర్‌గా చూడాలని కలలు కన్నారు. కేహర్ సింగ్ ఇప్పుడు మాతో లేనప్పటికీ, మా అమ్మాయి తన కలను నెరవేర్చింది. చాలా సంతోషంగా ఉంది. నాకు మాటలు రావడం లేదు. రేణుకకు చిన్న తనం నుంచే క్రికెట్‌పై మక్కువ ఎక్కువ.
తన స్కూల్‌డేస్‌లో అబ్బాయిలతో కలిసి క్రికెట్ ఆడేది. చెక్క బ్యాట్, వస్త్రాలతో చేసిన బాల్‌తో రోడ్డుపక్కన ఆడుతుండేది. ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఆమెతో నేను మాట్లాడాను. ఈ రోజు(ఫైనల్లో) నీ కోసం కాదు.. దేశం కోసం ఆడు. ప్రపంచ కప్ గెలుచుకురా అని చెప్పాను. మా అమ్మాయి ఈ రోజు ఈ స్థాయికి చేరినందుకు చాలా ఆనందంగా ఉంది. అమ్మాయిలందరూ ఈ విధంగానే ముందుకు సాగాలి. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని.. నేను ఆ దేవుణ్ని ప్రార్ధిస్తున్నానని రేణుకా తల్లి సునీత" ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది.
చెల్లి కోసం అన్న త్యాగం..
కాగా రేణుక తండ్రి కెహర్ సింగ్ ఠాకూర్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అండ్ ప్రజా ఆరోగ్య శాఖలో పనిచేసేవారు. అయితే రేణుకకు మూడేళ్ల వయసు ఉన్నప్పుడే కెహర్ సింగ్ ఠాకూర్ మరణించారు. అయితే కెహర్‌కు కూడా క్రికెట్ అంటే పిచ్చి. అందుకే భారత స్టార్ క్రికెటర్ వినోద్ కాంబ్లీ పేరు వచ్చేలా తన కుమారుడికి వినోద్ ఠాకూర్ అని పేరు కెహర్ పెట్టాడు.
అయితే వినోద్ ఠాకూర్ కూడా క్రికెటర్ కావాలని కలలు కానేవాడంట. కానీ తన చెల్లి కోసం వినోద్ తన కలను వదులుకున్నాడు. ఆర్ధిక కష్టాలు ఉండడంతో తనకు బదులుగా రేణుకాను క్రికెట్ ఆకాడమీలో జాయిన్ చేయాలని తల్లిని వినోద్ ఠాకూర్ సూచించాడు. అయితే రేణుకాలో టాలెంట్‌ను గుర్తించింది మాత్రం ఆమె మామయ్య భూపిందర్ ఠాకూర్.
ఆయన రేణుకాకు అన్ని విధాలగా మద్దతుగా నిలిచాడని ఆమె తల్లి సునీత స్పష్టం చేసింది. ధర్మశాల క్రికెట్ అకాడమీలో రేణుకాను భూపిందర్ చేర్చాడు. అక్కడ నుంచే ఆమె క్రికెట్ కెరీర్ ప్రారంభమైంది.
చదవండి: Amanjot Kaur: మ్యాచ్‌ను మలుపు తిప్పిన క్యాచ్..! అమన్ వెనుక కన్నీటి గాథ


