భారత మహిళల క్రికెట్‌లో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఊరిస్తున్న వరల్డ్ కప్ టైటిల్ ఎట్టకేలకు మన అమ్మాయిల సొంతమైంది. ఆదివారం నవీ ముంబై వేదికగా జరిగిన ఫైనల్లో 52 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించిన భారత జట్టు.. తొలిసారి వరల్డ్‌కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది.
2005, 2017లో ఫైనల్స్‌లో ఓటమిని చవిచూసిన టీమిండియా.. మూడో ప్రయత్నంతో విశ్వవిజేతగా నిలిచింది. కాగా హర్మన్ సారథ్యంలోని భారత జట్టు తొలి వరల్డ్‌కప్ ట్రోఫీని సొంతం చేసుకోవడంలో ఆల్‌రౌండర్ అమన్‌జోత్ కౌర్‌ది కీలక పాత్ర. ఫైనల్లో అమన్‌జోత్ అద్బుతమైన క్యాచ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పింది.
సెంచరీతో కదం తొక్కి భారత బౌలర్లకు కొరకరాని కోయ్యిగా మారిన సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్‌ను సంచలన క్యాచ్‌తో ఆమె పెవిలియన్‌కు పంపింది. ఈ ఒక్క క్యాచ్‌తో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. అయితే తన క్యాచ్‌తో భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించిన అమన్‌జోత్ కౌర్ వెనక ఆమె కుటుంబం చేసిన త్యాగం కూడా ఉంది. ప్రపంచకప్ వంటి వేదికలో తన బిడ్డ సత్తాచాటాలని ఆమె కుటుంబం ఎంతో బాధను దిగమింగారు.

ఏమి జరిగిందంటే?
ప్రపంచకప్ ప్రారంభమైన తర్వాత అమన్‌జోత్ కౌర్ వాళ్ల నానమ్మ భగవంతి(75) గుండెపోటుకు గురయ్యారు. అయితే అమన్‌జోత్ తన ఆటపై ఏకాగ్రత కోల్పోకూడదని ఆమె తండ్రి భూపిందర్ సింగ్‌తో సహా కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని ఆమెకు చెప్పకుండా దాచారు. ఈ విషయాన్ని తాజాగా భూపిందర్ సింగ్ వెల్లడించారు. భారత్ విజయం సాధించిన వెంటనే అమన్‌జోత్ తండ్రి భావోద్వేగానికి లోనయ్యాడు. తన కుటుంబంతో కలిసి కన్నీళ్లు పెట్టుకున్నాడు.
అమన్‌జోత్ ఈ స్దాయికి చేరుకుకోవడంలో మా అమ్మ భగవంతిది కీలక పాత్ర. అమన్ క్రికెట్ ఆడటం ప్రారంభించిన రోజు నుంచి మా అమ్మ ఆమెకు ఎంతో సపోర్ట్‌గా ఉండేది. అమన్ చిన్నతనంలో క్రికెట్ ఆడటానికి ఎక్కడికి వెళ్లినా మా అమ్మ తన వెనుక వెళ్లేది. అయితే గత నెలలో ఆమెకు గుండెపోటు వచ్చింది.
ఈ విషయాన్ని మేము అమన్‌జోత్‌కు తెలియజేయలేదు. గత కొన్ని రోజులుగా ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. ఇటువంటి కఠిన సమయంలో ప్రపంచ కప్ విజయం మాకు కాస్త ఉపశమనం కలిగించింది. ఈ విజయం గురుంచి మా అమ్మకు తెలియజేశాము. ఆమె వెంటనే కళ్లు తెరిచి చూసింది అని అని భూపిందర్ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.
ప్రస్తుతం అమన్ వాళ్ల నానమ్మ హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. కాగా ఈ టోర్నమెంట్‌లో 7 మ్యాచ్‌లు ఆడిన అమన్‌జోత్.. 146 పరుగులు చేసి, 6 వికెట్లు పడగొట్టింది. ఫైనల్‌లో లారా వోల్వార్ట్ క్యాచ్‌తో అద్బుతమైన రనౌట్‌తో కూడా అమన్ మెరిసింది.
చదవండి: ఆస్ట్రేలియా సెలెక్టర్ల కీలక నిర్ణయం
After India’s World Cup triumph, cricketer Amanjot Kaur’s father grew emotional, expressing immense pride and joy over his daughter’s remarkable achievement.#WomensWorldCup2025 #WomenInBlue pic.twitter.com/Q1azAudoIj
— Karan Verma (@Mekaranverma) November 2, 2025


