టీమిండియా బ్యాటర్, రాజస్తాన్ స్టార్ ప్లేయర్ దీపక్ హుడా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అదరగొడుతున్నాడు. రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌లో భాగంగా జైపూర్ వేదికగా ముంబైతో జరుగుతున్న మ్యాచ్‌లో హుడా అద్బుతమైన డబుల్ సెంచరీతో చెలరేగాడు. 121 పరుగుల ఓవర్ నైట్‌స్కోర్‌తో మూడో రోజు ఆటను ప్రారంభించిన హుడా.. వన్డే తరహాలో తన బ్యాటింగ్‌ను కొనసాగించాడు.
ఆచితూచి ఆడుతూ వీలు చిక్కినప్పుడల్లా బంతిని బౌండరీకి తరలించాడు. ఈ క్రమంలోనే తన రెండో ఫస్ట్ క్లాస్ డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. మొత్తంగా 335 బంతులు ఎదుర్కొన్న హుడా.. 22 ఫోర్లు, 2 సిక్స్‌లతో 248 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ 293గా ఉంది.
ఇక మ్యాచ్‌లో హుడా ద్విశతకం ఫలితంగా రాజస్తాన్ తొలి ఇన్నింగ్స్‌ను 617/6 వద్ద డిక్లేర్ చేసింది. రాజస్తాన్ ఇన్నింగ్స్‌లో హుడాతో కార్తీక్ శర్మ(139), సచిన్ యాదవ్(92) రాణించారు. దీంతో రాజస్తాన్‌కు మొదటి ఇన్నింగ్స్‌లో 363 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ముంబై బౌలర్లలో తుషార్ దేశ్‌పాండే, ములానీ తలా రెండు వికెట్లు సాధించారు.
మూడో రోజు ఆట ముగిసే సమయానికి ముంబై వికెట్ నష్టపోకుండా 89 పరుగులు చేసింది.క్రీజులో జైశ్వాల్(56), ముషీర్ ఖాన్(32) ఉన్నారు. ఇక దీపక్ హుడా విషయానికి వస్తే.. భారత తరపున చివరగా 2023లో న్యూజిలాండ్‌పై ఆడాడు. అయితే ఐర్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో సెంచరీతో మెరిసిన హుడా, ఆ తర్వాత వరుస మ్యాచ్‌ల విఫలమయ్యాడు. దీంతో అతడిని నుంచి జట్టు నుంచి తప్పించారు. గత రెండు ఐపీఎల్ సీజన్‌లలోనూ అతడు విఫలమయ్యాడు.
చదవండి: Womens World Cup: విశ్వ విజేతలకు డైమండ్ నెక్లెస్‌లు..


