IND VS AUS: రికార్డు శతకం.. చరిత్ర సృష్టించిన టీమిండియా ప్లేయర్‌ | IND VS AUS 2nd ODI: smriti mandhana brings up 12th hundred | Sakshi
Sakshi News home page

IND VS AUS: రికార్డు శతకం.. చరిత్ర సృష్టించిన టీమిండియా ప్లేయర్‌

Sep 17 2025 4:16 PM | Updated on Sep 17 2025 4:18 PM

IND VS AUS 2nd ODI: smriti mandhana brings up 12th hundred

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియా మహిళల జట్టుతో ఇవాళ (సెప్టెంబర్‌ 17) జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా స్టార్‌ ప్లేయర్‌ స్మృతి మంధన చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగగా.. మంధన మెరుపు శతకంతో చెలరేగింది. 

కేవలం 77 బంతుల్లోనే శతక్కొట్టి, భారత్‌ తరఫున వన్డేల్లో సెకండ్‌ ఫాస్టెస్ట్‌ సెంచరీని నమోదు చేసింది. భారత్‌ తరఫున ఫాస్టెస్ట్‌ రికార్డు కూడా మంధన పేరిటే ఉంది. ఇదే ఏడాది ఐర్లాండ్‌పై ఆమె 70 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసింది.

తాజా సెంచరీ మంధనకు వన్డేల్లో 12వది. ఈ శతకంతో ఆమె ప్రపంచ రికార్డును సమం చేసింది. మహిళల వన్డే క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఓపెనింగ్‌ బ్యాటర్‌గా సూజీ బేట్స్‌ (న్యూజిలాండ్‌), ట్యామీ బేమౌంట్‌ (ఇంగ్లండ్‌) సరసన చేరింది. మంధన, బేట్స్‌, బేమౌంట్‌ ఓపెనర్లుగా తలో 12 శతకాలు చేశారు. 

అయితే బేట్స్‌, బేమౌంట్‌ కంటే మంధననే అత్యంత వేగంగా ఈ ఘనత సాధించింది. బేట్స్‌కు 130, బేమౌంట్‌కు 113 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా.. మంధన తన 106వ ఇన్నింగ్స్‌లోనే 12 సెంచరీల మార్కును తాకింది.

చరిత్ర సృష్టించిన మంధన
తాజా సెంచరీ పూర్తి చేసిన తర్వాత మంధన ఓ విభాగంలో చరిత్ర సృష్టించింది. మహిళల క్రికెట్‌కు సంబంధించి, ఓ క్యాలెండర్‌ ఇయర్‌లో (వన్డేల్లో) అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా అవతరించింది. గతంలో ఈ రికార్డు దీప్తి శర్మ పేరిట ఉండేది. దీప్తి 2017లో 19 ఇన్నింగ్స్‌ల్లో సెంచరీ, 7 అర్ద సెంచరీల సాయంతో 787 పరుగులు చేయగా.. మంధన ఈ ఏడాది 13 ఇన్నింగ్స్‌ల్లనే 3 శతకాలు, 4 అర్ద శతకాల సాయంతో 803 పరుగులు చేసింది.

చరిత్రలో తొలి క్రికెటర్‌
తాజా సెంచరీతో మంధన మరో చారిత్రక రికార్డును కూడా సొంతం చేసుకుంది. మహిళల వన్డేల్లో రెండు వేర్వేరు క్యాలెండర్‌ ఇయర్స్‌లో 3కు పైగా సెంచరీలు చేసిన తొలి బ్యాటర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించింది. 2024లో 4 సెంచరీలు చేసిన మంధన.. ఈ ఏడాది ఇప్పటికే 3 సెంచరీలు పూర్తి చేసింది.

తాజా శతకంతో మంధన రెండు వేర్వేరు దేశాలపై (ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా) మూడు వన్డే సెంచరీలు చేసిన తొలి భారత ప్లేయర్‌గానూ చరిత్ర సృష్టించింది. ఈ సెంచరీతో మంధన మహిళల వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల జాబితాలో ట్యామీ బేమౌంట్‌తో పాటు మూడో స్థానంలో నిలిచింది. ఈ విభాగంలో మెగ్‌ లాన్నింగ్‌ (15) అగ్రస్థానంలో ఉండగా.. సూజీ బేట్స్‌ (13), బేమౌంట్‌ (12), మంధన (12) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు.

ఆస్ట్రేలియాతో ప్రస్తుతం జరుగుతున్న మ్యాచ్‌లో మంధన 91 బంతుల్లో 14 ఫోర్లు, 4  సిక్సర్ల సాయంతో 117 పరుగులు చేసి ఔటైంది. తొలి అర్ద సెంచరీకి 45 బంతులు తీసుకున్న మంధన, ఆతర్వాత అర్ద సెంచరీని కేవలం 32 బంతుల్లోనే పూర్తి చేసింది. హాఫ్‌ సెంచరీ మార్కును సిక్సర్‌తో, సెంచరీ మార్కును బౌండరీతో అందుకుంది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేస్తున్న టీమిండియా 38 ఓవర్ల తర్వాత  4 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసింది. మంధన (117), ప్రతిక రావల్‌ (25), హర్లీన్‌ డియోల్‌ (10), హర్మన్‌ప్రీత్‌ (17) ఔట్‌ కాగా.. రిచా ఘోష్‌ (19), దీప్తి శర్మ (20) క్రీజ్‌లో ఉన్నారు. ఆసీస్‌ బౌలర్లలో ఆష్లే గార్డ్‌నర్‌ 2, తహ్లియా మెక్‌గ్రాత్‌ ఓ వికెట్‌ తీశారు. ఈ సిరీస్‌లోని తొలి వన్డేలో ఆస్ట్రేలియా విజయం సాధించిన విషయం తెలిసిందే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement