లండన్‌ చేరిన భారత జట్టు

Indian team arrives in London - Sakshi

లండన్‌: ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న భారత క్రికెట్‌ జట్టు సోమవారం రెండో టెస్టు ఆడేందుకు లండన్‌ పయనమైంది. అక్కడికి వెళ్లేముందు ఆటగాళ్లందరికీ కోవిడ్‌ టెస్టులు నిర్వహించారు. అందరి రిపోర్టులు నెగెటివ్‌గానే వచి్చనట్లు జట్టు వర్గాలు వెల్లడించాయి. నాటింగ్‌హామ్‌ టెస్టు ఆదివారం వర్షం వల్ల ‘డ్రా’గా ముగిసిన సంగతి తెలిసిందే. తదుపరి రెండో టెస్టు లార్డ్స్‌లో ఈ నెల 12 నుంచి జరగనుండటంతో కోహ్లి సేన లండన్‌ చేరుకుంది. గాయపడిన ఆటగాళ్ల స్థానంలో ఆడేందుకు శ్రీలంక నుంచి నేరుగా ఇంగ్లండ్‌కు వెళ్లిన పృథ్వీ షా, సూర్యకుమార్‌ యాదవ్‌లు ఇంకా క్వారంటైన్‌లోనే ఉన్నారు. పది రోజుల క్వారంటైన్‌ ఈ నెల 13న ముగియనుంది.  

గంగూలీ...లార్డ్స్‌ టెస్టు చూసేందుకు!
బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ లార్డ్స్‌ టెస్టు చూసేందుకు ఇంగ్లండ్‌కు బయల్దేరనున్నాడు. భారత్‌ను తాజాగా ‘రెడ్‌’ లిస్ట్‌ నుంచి ‘అంబర్‌’ జాబితాలోకి మార్చడంతో కఠిన క్వారంటైన్‌ నిబంధనలు తప్పాయి. ఈ అంబర్‌ జాబితాలో ఉంటే... వ్యాక్సిన్‌ తీసుకున్న భారతీయులు కనీస కోవిడ్‌ ప్రొటోకాల్‌ను పాటిస్తే సరిపోతుంది. 10 రోజుల క్వారంటైన్‌ నుంచి మినహాయింపు లభిస్తుంది. దీంతో గంగూలీతో పాటు బోర్డు కార్యదర్శి జై షా, కోశాధికారి అరుణ్‌ ధుమాల్, ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లాలు కూడా ఐదు టెస్టుల సిరీస్‌లో ఒకట్రెండు మ్యాచ్‌లు చూసేందుకు ఆసక్తి కనబరిచారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top