13 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో భారత జాతీయ గీతం: వైరల్‌ వీడియో

Indian National Anthem Played At The Olympics After 13 Years Video Goes Viral - Sakshi

టోక్యో: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌ అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా స్వర్ణం గెలిచి భారత్‌ త్రివర్ణ పతకాన్ని అంతర్జాతీయ వేదికపై రెపరెపలాడించారు. దీంతో 13 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో భారత జాతీయ గీతాన్ని వినిపించారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో అభినవ్ బింద్రా పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో బంగారు పతకం సాధించినపుడు భారత జాతీయ గీతాన్ని వినిపించగా.. మళ్లీ ఇన్నేళ్లకు నీరజ్‌ చోప్రా స్వర్ణం సాధించడంతో ఒలింపిక్స్‌లో జాతీయ గీతాన్ని వినిపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక మొదటి ప్రయత్నంలో చోప్రా జావెలిన్‌ను 87.03 మీటర్లకు విసిరారు. రెండో ప్రయత్నంలో 87.58 మీటర్లకు విసిరారు. కాగా రెండో స్థానంలో చెక్ రిపబ్లిక్‌కు చెందిన వడ్లెక్ నిలిచారు. ఈయన గరిష్ఠంగా 86.67 మీటర్లకు జావెలిన్‌ను విసిరారు. అంతే కాకుండా చెక్ రిపబ్లిక్‌కు చెందిన విటెజ్‌స్లావ్ వెస్లీ మూడో స్థానంలో నిలిచారు. ఆయన గరిష్టంగా 85.44 మీటర్లకు జావెలిన్‌ను విసిరారు. ఇక  అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఈ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన గంట వ్యవధిలోనే  లక్షకు పైగా నెటిజనులు వీక్షించారు. అంతేకాకుండా నీరజ్‌ చోప్రాకు  సోషల్‌ మీడియాలో ప్రశంసల జల్లు కురిపిస్తూ.. అభినందనలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా నీరజ్‌ చోప్రాకు తెలంగాణ స్పోర్ట్స్‌ అథారిటీ ఛైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి అభినందనలు తెలిపారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top