ప్రొ హాకీ లీగ్‌: తొలి మ్యాచ్‌లో భారత జట్టు అద్భుతం

Indian Men Make Remarkable Comeback To Down Spain 5-4 In FIH Pro League Hockey - Sakshi

భారత్‌ అద్భుతం

స్పెయిన్‌తో మ్యాచ్‌లో 1–4తో వెనుకబడి చివరకు 5–4తో గెలిచిన టీమిండియా

భువనేశ్వర్‌: ప్రొ హాకీ లీగ్‌లో భాగంగా స్పెయిన్‌ పురుషుల జట్టుతో శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు అద్భుతం చేసింది. ఒక దశలో 1–4తో వెనుకబడి ఓటమి ఖాయమనుకున్న స్థితి నుంచి టీమిండియా అనూహ్యంగా తేరుకుంది. వరుసగా నాలుగు గోల్స్‌ సాధించి చివరకు 5–4తో విజయాన్ని ఖాయం చేసుకుంది. మ్యాచ్‌ మరో ఎనిమిది సెకన్లలో ముగుస్తుందనగా హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ పెనాల్టీ స్ట్రోక్‌ను లక్ష్యానికి చేర్చి భారత్‌ను గెలిపించాడు. భారత్‌ తరఫున హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ (15వ, 60వ ని.లో) రెండు గోల్స్‌ చేయగా... శిలా నంద్‌ లాక్రా (41వ ని.లో), షంషేర్‌ సింగ్‌ (43వ ని.లో), వరుణ్‌ కుమార్‌ (55వ ని.లో) ఒక్కో గోల్‌ సాధించారు. స్పెయిన్‌ జట్టుకు కెప్టెన్‌ మార్క్‌ మిరాలెస్‌ (20వ, 23వ, 40వ ని.లో) మూడు గోల్స్, పౌ కునిల్‌ (14వ ని.లో) ఒక గోల్‌ అందించారు.  

మహిళల జట్టూ గెలిచింది...
మహిళల ప్రొ హాకీ లీగ్‌లో భాగంగా స్పెయిన్‌ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు 2–1తో విజయం సాధించింది. ఆట 18వ నిమిషంలో మార్టా సెగూ గోల్‌తో స్పెయిన్‌ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే 20వ నిమిషంలో జ్యోతి గోల్‌తో భారత్‌ 1–1తో స్కోరును సమం చేసింది. అనంతరం 52వ నిమిషంలో నేహా చేసిన గోల్‌తో భారత్‌ 2–1తో విజయాన్ని ఖరారు చేసుకుంది. ప్రొ లీగ్‌లో భారత్‌కిది వరుసగా మూడో విజయం కావడం విశేషం. ఇటీవల ఒమన్‌లో చైనాతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ భారత్‌ గెలుపొందింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top