ఈ బంతులు ఆడేదెలా?

Indian Batsmens Struggle to Face Australian bowlers - Sakshi

మ్యాచ్‌ ముగిశాక విరాట్‌ కోహ్లి చెప్పిన దాని ప్రకారం చూస్తే భారత్‌ శనివారం ఆరంభంలోనే కాస్త వేగంగా ఆడి బౌలర్లపై పైచేయి సాధించి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేది. అయితే అతను చెబుతున్న దూకుడు ఫలితాన్ని ఇచ్చేదా అనేది సందేహమే. తొలి ఇన్నింగ్స్‌లో కూడా ఇదే బౌలర్లను మన బ్యాట్స్‌మెన్‌ సమర్థంగా ఎదుర్కొన్నారు. రెండో ఇన్నింగ్స్‌కు వచ్చేసరికి మన బ్యాట్స్‌మెన్‌ టెక్నిక్‌ కూడా ఒక్కసారిగా ఏమీ మారిపోదు. అయితే శనివారం పరిస్థితులు వారి అదుపులో ఉన్నట్లుగా కనిపించలేదు.

ఆస్ట్రేలియా పేసర్లు అద్భుత బౌలింగ్‌ ముందు ఏమీ చేయలేని స్థితిలో చేతులెత్తేసినట్లుగా కనిపించింది. హాజల్‌వుడ్, కమిన్స్‌ చేతుల్లో బంతి స్వింగ్‌ అయిన తీరు మహా మహా బ్యాట్స్‌మెన్‌కే ఇబ్బంది సృష్టించేలా కనిపించింది. ఆడితే ఒక బాధ, ఆడకపోతే ఒక కష్టం అన్నట్లుగా బ్యాట్స్‌మెన్‌ మనసులో రెండు ఆలోచనలతో బంతిని ఎదుర్కొన్నారు. అంతా ఆసీస్‌కు అనుకూలంగానే సాగింది. డ్రైవ్‌ చేసే అవకాశం లేకుండా సరైన లెంగ్త్‌లో బంతులు పడ్డాయి. బ్యాట్‌ను దాటి వెళ్లిపోకుండా సరిగ్గా ఎడ్జ్‌ తీసుకున్నాయి. బ్యాట్స్‌మెన్‌ క్రీజ్‌ నుంచి కదిలే అవకాశం లేని విధంగా పిచ్‌పై బౌన్స్‌ కనిపించింది. తొలి రోజుతో పోలిస్తే ఊహించినట్లుగానే పిచ్‌ వేగంగా మారిపోయింది. దాంతో కీపర్‌ ముందు పడకుండా సరిగ్గా బంతులు చేతుల్లోకే వెళ్లాయి. సరిగ్గా చెప్పాలంటే రెండు రోజులుగా చూడని ఒక అద్భుత సెషన్‌ ఇక్కడ కనిపించింది.

వికెట్‌ కీపర్‌ పైన్‌ అందుకున్న ఐదు క్యాచ్‌లు రీప్లేలో మళ్లీ మళ్లీ చూస్తే అన్ని వికెట్లు ఒకేలా కనిపిస్తాయంటే ఆశ్చర్యపడనవసరం లేదు! అయితే మన బ్యాటింగ్‌లో పూర్తిగా లోపాలు లేవని చెప్పలేం. 165, 191, 242, 124, 244, 36... వరుసగా ఆరు టెస్టు ఇన్నింగ్స్‌లలో భారత జట్టు స్కోర్లు ఇవి. ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్‌ చేతిలో 0–2తో టెస్టు సిరీస్‌ కోల్పోయిన టీమిండియా ఇప్పుడు మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. వీటిలో ఒక్కసారి కూడా కనీసం 250 పరుగులు చేయలేకపోవడం విదేశీ గడ్డపై మన ప్రదర్శన ఏమిటో మరోసారి చూపించింది. 36 పరుగులు అనేది అయ్యో అనిపిస్తున్నా... స్వల్ప స్కోర్లకే ఆలౌట్‌ కావడం అనూహ్యమేమీ కాదు. బంతి కాస్త స్వింగ్‌ అవుతుందంటే చాలు మన బ్యాట్స్‌మెన్‌లో తడబాటు కనిపిస్తుంది. సరిగ్గా చెప్పాలంటే మన ఆటగాళ్ల డిఫెన్స్‌ టెక్నిక్‌ చాలా పేలవంగా ఉంది.   

కోహ్లి వెళ్లిపోయాక...
ముందుగా అనుకున్నట్లుగానే కెప్టెన్‌ కోహ్లి తన భార్య ప్రసవం కారణంగా ఒక్క టెస్టు తర్వాతే స్వదేశానికి తిరిగి వస్తున్నాడు. అతనితో పోలిస్తే కాస్త శాంతం కనబర్చే రహానే కెప్టెన్‌గా ఆసీస్‌ గడ్డపై జట్టును ఎలా నడిపిస్తాడనేది ఆసక్తికరం. ముఖ్యంగా ఇంత ఘోర ప్రదర్శన తర్వాత టీమ్‌ను మానసికంగా సంసిద్ధం చేయడం కీలకం. బ్యాట్స్‌మన్‌గా, కెప్టెన్‌గా కోహ్లి లేని లోటు స్పష్టంగా కనిపిస్తుంది. కోహ్లి, విఫలమైన పృథ్వీ షా స్థానాల్లో గిల్, రాహుల్‌ రావచ్చని తెలుస్తోంది. వీరిద్దరు జట్టుకు ఎంత బలంగా మారతారో చెప్పలేం. ఇన్ని సమస్యలు దాటి ఆసీస్‌ను ఓడించగలమా అనేది అతి పెద్ద ప్రశ్న!

► భారత టెస్టు క్రికెట్‌ చరిత్రలో ఇన్నింగ్స్‌లో ఒక్క బ్యాట్స్‌మన్‌ కూడా రెండంకెలు స్కోరు చేయకుండా అవుటవ్వడం ఇదే తొలిసారి. ఓవరాల్‌గా టెస్టు క్రికెట్‌లో ఇలా జరగడం రెండోసారి. 1924లో బర్మింగ్‌హమ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 30 పరుగులకు ఆలౌటైంది. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ ఎవరూ రెండంకెల స్కోరు చేయలేదు. అయితే ఆ ఇన్నింగ్స్‌లో ఎక్స్‌ట్రాల రూపంలో 11 పరుగులు ఉన్నాయి.

► సొంతగడ్డపై ఆడిన ఎనిమిది డే–నైట్‌ టెస్టుల్లోనూ గెలిచి ఆస్ట్రేలియా తమ అజేయ రికార్డును కొనసాగించింది.
► భారత జట్టులోకి వచ్చాక కోహ్లి ఒక్క సెంచరీ కూడా చేయకుండా అంతర్జాతీయ క్రికెట్‌ క్యాలెండర్‌ ఇయర్‌ను ముగించడం ఇది రెండోసారి మాత్రమే. ఈ ఏడాది కోహ్లి మూడు టెస్టులు, తొమ్మిది వన్డేలు, పది టి20 మ్యాచ్‌లు ఆడాడు. 2008లో భారత్‌ తరఫున అరంగేట్రం చేసిన ఏడాది కూడా కోహ్లి సెంచరీ చేయలేదు.
► కెప్టెన్‌ కోహ్లి టాస్‌ గెలిచాక భారత్‌ ఓడిపోయిన తొలి టెస్టు ఇదే కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌కు ముందు కోహ్లి కెప్టెన్సీలో భారత్‌ 25 టెస్టుల్లో టాస్‌ గెలిచింది. 21 టెస్టుల్లో భారత్‌కు విజయం దక్కగా... మరో నాలుగు ‘డ్రా’గా ముగిశాయి.
► ఆసియా అవతల భారత జట్టు ఓ సిరీస్‌లోని తొలి టెస్టులో ఓడిపోవడం ఇది 35వ సారి. తొలి టెస్టు ఓడిపోయాక భారత్‌ 31 సార్లు సిరీస్‌ను కూడా చేజార్చు కుంది. కేవలం మూడుసార్లు మాత్రమే సిరీస్‌లను ‘డ్రా’గా ముగించింది.
► ఈ మ్యాచ్‌ ద్వారా హాజల్‌వుడ్‌ టెస్టుల్లో 200 వికెట్ల మైలురాయి చేరుకున్నాడు. ఈ ఘనత సాధించిన 18వ ఆస్ట్రేలియా బౌలర్‌గా హాజల్‌వుడ్‌ నిలిచాడు. ఈ మ్యాచ్‌ ద్వారానే కమిన్స్‌ 150 వికెట్లు పూర్తి చేసుకున్నాడు.

భారత్‌ మరీ 36 పరుగులు నమోదు చేయడం బాధాకరమే అయినా...ఇంత అద్భుతమైన బౌలింగ్‌కు ఎలాంటి జట్టయినా తలవంచేది. వారు కూడా ఏ 72 లేదా 80–90 పరుగులు చేసేవారు. మన బ్యాట్స్‌మెన్‌ను విమర్శించడం కంటే ఆసీస్‌ చాలా బాగా ఆడిందనేది వాస్తవం. 
–సునీల్‌ గావస్కర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top