దక్షిణాఫ్రికాపై తొమ్మిది వికెట్లతో భారత్‌ విజయం

India Women Beat South Africa In 2nd ODI To Level Series - Sakshi

రెండో వన్డేలో దక్షిణాఫ్రికాపై తొమ్మిది వికెట్లతో భారత్‌ విజయం

రాణించిన స్మృతి, పూనమ్, జులన్‌  

లక్నో: తొలి వన్డేలో ఎదురైన పరాజయం నుంచి భారత మహిళల క్రికెట్‌ జట్టు వెంటనే తేరుకుంది. రెండో వన్డేలో దక్షిణాఫ్రికాను ఆల్‌రౌండ్‌ ప్రదర్శన తో దెబ్బకొట్టి సిరీస్‌లో సమంగా నిలిచింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో మిథాలీ రాజ్‌ కెప్టెన్సీలోని భారత జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై జయభేరి మోగించింది. బౌలింగ్‌లో వెటరన్‌ సీమర్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ జులన్‌ గోస్వామి (4/42) దక్షిణాఫ్రికాను వణికించగా... తర్వాత బ్యాటింగ్‌లో స్మృతి మంధాన (64 బంతుల్లో 80 నాటౌట్‌; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగింది. స్మృతికి  పూనమ్‌ రౌత్‌ (89 బంతుల్లో 62 నాటౌట్‌; 8 ఫోర్లు) తోడుగా నిలిచింది. దాంతో భారత్‌ 28.4 ఓవర్లలో కేవలం వికెట్‌ నష్టపోయి 160 పరుగులు చేసి విజయాన్ని దక్కించుకుంది. ఛేజింగ్‌లో వరుసగా పది అర్ధ సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా స్మృతి గుర్తింపు పొందింది.  

అంతకుముందు టాస్‌ నెగ్గిన భారత్‌ ఫీల్డింగ్‌ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు 41 ఓవర్లలో 157 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు లిజెల్లి లీ (4), వోల్వర్డ్‌ (9) జట్టు స్కోరు 20 పరుగులకే వెనుదిరిగారు. ఈ దశలో లారా గుడ్‌ఆల్‌ (49; 2 ఫోర్లు), సునే లూస్‌ (36; 5 ఫోర్లు) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. మూడో వికెట్‌కు 60 పరుగులు జోడించాక కెప్టెన్‌ లూస్‌ను మాన్సీ జోషి అవుట్‌ చేసింది. అక్కడి నుంచి భారత బౌలర్లు పట్టుబిగించారు. కేవలం 58 పరుగుల వ్యవధిలోనే 7 వికెట్లను పడేశారు. లూస్, గుడ్‌ఆల్‌ తర్వాత ఇంకెవరూ భారత బౌలింగ్‌కు అసలు క్రీజులో నిలిచే సాహసం చేయలేకపోయారు.

స్పిన్నర్‌ రాజేశ్వరి గైక్వాడ్‌ 3, మాన్సి జోషి 2 వికెట్లు తీశారు. ఛేజింగ్‌లో ఓపెనర్‌ జెమీమా రోడ్రిగ్స్‌ (9) తక్కువ స్కోరుకే వెనుదిరగగా... స్మృతి, పూనమ్‌ రౌత్‌తో కలిసి అబేధ్యమైన రెండో వికెట్‌కు 138 పరుగులు జోడించడంతో భారత్‌ విజయం ఖాయమైంది. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్లోనే షబ్నిమ్‌ బౌలింగ్‌లో స్మృతి రెండు వరుస సిక్సర్లతో ఎదురుదాడికి దిగింది. ఈ క్రమంలో స్మృతి 46 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. ఆమెకు అండగా నిలిచిన పూనమ్‌ రౌత్‌ 79 బంతుల్లో ఫిఫ్టీని అధిగమించింది.  ఐదు వన్డేల సిరీస్‌ 1–1తో సమంగా ఉండగా... మూడో వన్డే శుక్రవారం ఇదే వేదికపై జరుగుతుంది.

దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో ఆడటం ద్వారా అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా మిథాలీ రాజ్‌ గుర్తింపు పొందింది. 1999లో అరంగేట్రం చేసిన మిథాలీ ఇప్పటివరకు 310 మ్యాచ్‌లు (10 టెస్టులు+211 వన్డేలు+82 టి20లు) ఆడింది. 309 మ్యాచ్‌లతో (23 టెస్టులు+191 వన్డేలు+95 టి20లు) చార్లోటి ఎడ్వర్డ్స్‌ (ఇంగ్లండ్‌) పేరిట ఉన్న రికార్డును మిథాలీ అధిగమించింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top