గిల్, ఇషాన్‌ శతకాల మోత | India secures a massive 170 run victory over Afghanistan | Sakshi
Sakshi News home page

గిల్, ఇషాన్‌ శతకాల మోత

Jun 18 2026 2:59 AM | Updated on Jun 18 2026 2:59 AM

India secures a massive 170 run victory over Afghanistan

భారత్‌దే రెండో వన్డే

170 పరుగులతో అఫ్గానిస్తాన్‌ చిత్తు

2–0 సిరీస్‌ టీమిండియా సొంతం  

లక్నో: భారత జట్టు తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో సత్తా చాటింది. బలహీన జట్టు అఫ్గానిస్తాన్‌తో రెండో వన్డేలోనూ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించి సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 170 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 49.5 ఓవర్లలో 402 పరుగులకు ఆలౌటైంది. 

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ శుబ్‌మన్‌ గిల్‌ (110 బంతుల్లో 154; 22 ఫోర్లు, 2 సిక్స్‌లు) తొమ్మిదో సెంచరీ సాధించగా... ఇషాన్‌ కిషన్‌ (79 బంతుల్లో 125; 14 ఫోర్లు, 7 సిక్స్‌లు) కెరీర్‌లో రెండో శతకంతో చెలరేగాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 23.3 ఓవర్లలో 224 పరుగులు జోడించారు. వన్డేల్లో భారత్‌ 400కు పైగా స్కోరు చేయడం ఇది 8వసారి కావడం విశేషం. అనంతరం అఫ్గానిస్తాన్‌ 44.3 ఓవర్లలో 232 పరుగులకే ఆలౌటైంది. రహ్మత్‌ షా (89 బంతుల్లో 79; 8 ఫోర్లు) అర్ధ సెంచరీతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. నామమాత్రమైన చివరి వన్డే శనివారం చెన్నైలో జరుగుతుంది.  

డబుల్‌ సెంచరీ భాగస్వామ్యం... 
ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌ (4) రెండో ఓవర్లోనే వెనుదిరిగినా... రోహిత్‌ శర్మ (39 బంతుల్లో 48; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) తనదైన శైలిలో కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. ఘజన్‌ఫర్‌ ఓవర్లో 3 ఫోర్లతో గిల్‌ కూడా ధాటిని పెంచాడు. అయితే రోహిత్‌ను రషీద్‌ బౌల్డ్‌ చేయడంతో 87 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యానికి తెర పడింది. ఈ దశలో జత కలిసిన గిల్, ఇషాన్‌ వేగంగా దూసుకుపోయారు. 38 బంతుల్లో గిల్‌ హాఫ్‌ సెంచరీ పూర్తి కాగా, 52 బంతుల్లో ఇషాన్‌ హాఫ్‌ సెంచరీని అందుకున్నాడు. 

ప్రతీ బౌలర్‌పై చెలరేగిన వీరిద్దరిని నిలువరించడం అఫ్గాన్‌ వల్ల కాలేదు. సమీ వేసిన ఇన్నింగ్స్‌ 33వ ఓవర్లో 5 బౌండరీలతో 21 పరుగులు రాబట్టిన భారత్‌ 250 పరుగుల స్కోరును దాటింది. ఇదే ఓవర్‌ తొలి బంతికి గిల్‌ సెంచరీ (77 బంతుల్లో) పూర్తి కాగా, చివరి బంతికి ఇషాన్‌ (71 బంతుల్లో) శతకాన్ని అందుకోవడం విశేషం. ఈ దశలో గిల్‌ 16 బంతుల వ్యవధిలో 7 ఫోర్లు బాదడం అతని జోరును చూపించింది. 

ఖరోటే ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు బాదిన ఇషాన్‌ తర్వాతి బంతికి వెనుదిరిగాడు. గిల్, ఇషాన్‌ ఏకంగా 9.6 రన్‌రేట్‌తో పరుగులు జోడించడం విశేషం. గిల్‌ పెవిలియన్‌ చేరాక భారత్‌ ఇన్నింగ్స్‌ ఆశించిన వేగంతో సాగలేదు. గిల్, రాహుల్‌ (0) వరుస బంతుల్లో అవుట్‌ కాగా, శ్రేయస్‌ (26) పెద్దగా ప్రభావం చూపలేదు. 40 ఓవర్లు ముగిసే సరికి స్కోరు 340/3 కాగా... చివరి 10 ఓవర్లలో భారత్‌ 62 పరుగులు మాత్రమే చేసి 7 వికెట్లు కోల్పోయింది.  

టపటపా... 
భారీ ఛేదనలో ఊహించినట్లే అఫ్గాన్‌ చేతులెత్తేసింది. గుర్బాజ్‌ (33 బంతుల్లో 41; 7 ఫోర్లు, 1 సిక్స్‌) మరోసారి దూకుడుగా ఇన్నింగ్స్‌ ఆరంభించినా... ఆపై ఇతర బ్యాటర్లు నిలవలేకపోయారు. రహ్మత్, సాదిఖుల్లా (50 బంతుల్లో 42; 5 ఫోర్లు, 1 సిక్స్‌) మూడో వికెట్‌కు 57 పరుగులు జత చేసిన తర్వాత జట్టు పూర్తిగా కుప్పకూలింది. 

బుధవారం లక్నోలో తీవ్రమైన ఎండ కారణంగా ఇరు జట్ల ఆటగాళ్లంతా బాగా ఇబ్బంది పడ్డారు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడంతో ప్లేయర్లు పదే పదే విరామాలు తీసుకున్నారు. గిల్, ఇషాన్‌ ఎంతో అలసిపోగా, రషీద్‌ ఖాన్‌ మధ్యలోనే మైదానం వీడాడు. కెరీర్‌లో తొలి వన్డే ఆడిన దార్విష్‌ రెండు సార్లు బయటకు వెళ్లాడు. బ్యాటింగ్‌ సమయంలో కండరాలు పట్టేయడంతో పెవిలియన్‌కు వెళ్లిన అతను మళ్లీ రాలేదు.

ప్రిన్స్‌ యాదవ్‌ @263 
ఈ మ్యాచ్‌ కోసం భారత జట్టులో మూడు మార్పులు జరిగాయి. తొడ కండరాల గాయంతో నితీశ్‌ కుమార్‌ రెడ్డి మ్యాచ్‌కు దూరం కాగా... అతని స్థానంలో జైస్వాల్‌కు చోటు లభించింది. ప్రసిధ్, హర్ష్ దూబే స్థానాల్లో ప్రిన్స్‌ యాదవ్, కుల్దీప్‌లకు అవకాశం దక్కింది. ఈ మ్యాచ్‌తో ప్రిన్స్‌ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగు పెట్టాడు. భారత్‌ తరఫున వన్డేలు ఆడిన 263వ ఆటగాడిగా అతను గుర్తింపు పొందాడు.  

స్కోరు వివరాలు  
భారత్‌ ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) ఖరోటే (బి) సలీమ్‌ 4; రోహిత్‌ (బి) రషీద్‌ 48; గిల్‌ (సి) దార్విష్‌ (బి) ఖరోటే 154; ఇషాన్‌ కిషన్‌ (సి) (సబ్‌) ఇక్రామ్‌ (బి) ఖరోటే 125; శ్రేయస్‌ (సి) ఇబ్రహీం (బి)ఖరోటే 26; రాహుల్‌ (సి) ఇబ్రహీం (బి) ఖరోటే 0; సుందర్‌ (సి) గుర్బాజ్‌ (బి) రషీద్‌ 19; గుర్నూర్‌ (సి) ఇబ్రహీం (బి) రషీద్‌ 3; అర్ష్ దీప్ (సి) రషీద్‌ (బి) ఘజన్‌ఫర్‌ 3; కుల్దీప్‌ (నాటౌట్‌) 3; ప్రిన్స్‌ (రనౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (49.5 ఓవర్లలో ఆలౌట్‌) 402. వికెట్ల పతనం: 1–9, 2–96, 3–320, 4–360, 5–360, 6–371, 7–387, 8–392, 9–396, 10–402. బౌలింగ్‌: ఘజన్‌ఫర్‌ 10–1–69–1, సలీమ్‌ 8–0–75–1, సమీ 8.5–0–90–0, ఖరోటే 10–0–76–4, రషీద్‌ 8–0–48–3, హష్మతుల్లా 5–0–36–0. 

అఫ్గానిస్తాన్‌ ఇన్నింగ్స్‌: గుర్బాజ్‌ (సి) రాహుల్‌ (బి) గుర్నూర్‌ 41; ఇబ్రహీమ్‌ (సి) ప్రిన్స్‌ (బి) అర్ష్ దీప్ 21; సాదిఖుల్లా (ఎల్బీ) (బి) సుందర్‌ 42; రహ్మత్‌ (సి) గుర్నూర్‌ (బి) ప్రిన్స్‌ 79; దార్విష్‌ (రిటైర్డ్‌హర్ట్‌) 6; హష్మతుల్లా (బి) గుర్నూర్‌ 4; ఖరోటే (బి) ప్రిన్స్‌ 6; రషీద్‌ (సి) రోహిత్‌ (బి) అర్ష్ దీప్ 12; ఘజన్‌ఫర్‌ (సి) శ్రేయస్‌ (బి) అర్ష్ దీప్ 1; సలీమ్‌ (బి) గుర్నూర్‌ 9; సమీ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (44.3 ఓవర్లలో ఆలౌట్‌) 232. వికెట్ల పతనం: 1–52, 2–71, 3–128, 4–140, 5–170, 6–188, 7–190, 8–220, 9–232. బౌలింగ్‌: అర్ష్ దీప్ 9–0–45–3, ప్రిన్స్‌ 7.3–0–56–2, గుర్నూర్‌ 10–0–60–3, కుల్దీప్‌ 10–0–42–0, సుందర్‌ 7–0–24–1, జైస్వాల్‌ 1–0–3–0. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement