పాకిస్తాన్ వివాదాస్పద స్పిన్నర్ ఉస్మాన్ తారిఖ్‌కు ఐపీఎల్ స్టార్, విండీస్ ఆల్‌రౌండర్ సునీల్ నరైన్ అండగా నిలిచాడు. ఇటీవల తారిఖ్ బౌలింగ్ యాక్షన్ మరోసారి వివాదాస్పదమైన నేపథ్యంలో నరైన్ అతడికి ఫోన్ చేసి మద్దతు పలికాడు. విమర్శలపై స్పందించకుండా, బౌలింగ్‌పై దృష్టి పెట్టాలని.. అంపైర్లు అనుమతిస్తున్నంత వరకు యాక్షన్ చట్టబద్ధమేనని నరైన్ భరోసా ఇచ్చినట్లు తారిఖ్ వెల్లడించాడు.
అసలేం జరిగిందంటే..?
ద హండ్రెడ్ లీగ్ 2026లో తారిఖ్ టిమ్ డేవిడ్‌ను ఔట్ చేశాడు. అనంతరం తారిఖ్ బౌలింగ్ యాక్షన్‌పై డేవిడ్ అంపైర్‌కు ఫిర్యాదు చేశాడు. తారిఖ్ యాక్షన్ చట్టబద్ధమేనా అని ప్రశ్నించాడు. డేవిడ్ అప్పీల్‌ను పెద్దగా పట్టించుకోని అంపైర్ ఆ బంతిని నో-బాల్‌గా ప్రకటించలేదు. దీంతో చేసేదేమీ లేక డేవిడ్ పెవిలియన్ బాట పట్టాడు.
ఈ ఉదంతం తర్వాత తారిఖ్ బౌలిగ్ యాక్షన్‌పై చర్చ మరోసారి మొదలైంది. తారిఖ్ బౌలింగ్ యాక్షన్ వైవిధ్యంగా ఉంటుందన్న విషయం తెలిసిందే. అతడు బంతిని డెలివర్ చేసే సమయంలో ఆగుతాడు. అలాగే చేతిని మిగతా బౌలర్లలా కాకుండా ఫ్లాట్‌గా ఉంచుతాడు.
ఐసీసీ నిబంధనల ప్రకారం, బౌలర్ బంతిని సంధించే సమయంలో మోచేయి 15 డిగ్రీలకు మించి వంగకూడదు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం తారిఖ్ యాక్షన్ ఈ పరిమితిలోనే ఉంది. అతని బౌలింగ్ శైలి చూడటానికి అసాధారణంగా కనిపించడం వల్లే అనుమానాలు వస్తున్నాయి. తారిఖ్‌పై ఇలాంటి విమర్శలు రావడం ఇదే మొదటిసారి కాదు.


