విరాట్‌ కోహ్లి కాదు.. కొత్త 'కింగ్‌' అతడే..! | Not Virat Kohli, Sunil Narine Named The New King Of IPL | Sakshi
Sakshi News home page

విరాట్‌ కోహ్లి కాదు.. కొత్త 'కింగ్‌' అతడే..!

May 4 2026 7:37 PM | Updated on May 4 2026 7:59 PM

Not Virat Kohli, Sunil Narine Named The New King Of IPL

ఐపీఎల్‌ 2026 మధ్య దశకు చేరుకున్న వేళ ‘కింగ్‌’ అనే బిరుదుపై ఆసక్తికర చర్చ మొదలైంది. ఇప్పటివరకు ఈ ట్యాగ్‌కు ప్రతీకగా నిలిచిన విరాట్‌ కోహ్లికి ఇప్పుడు గట్టి పోటీదారు వచ్చాడని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.

కేకేఆర్‌ సీఈవో వెంకీ మైసూర్‌ తమ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ సునీల్‌ నరైన్‌ను "కొత్త కింగ్‌"గా అభివర్ణిస్తూ సరికొత్త చర్చకు తెరలేపాడు. తాజాగా సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నరైన్ 200 ఐపీఎల్ వికెట్ల మైలురాయిని అందుకోవడంతో ఈ చర్చ మొదలైంది.

నరైన్ ఐపీఎల్‌లో అరుదైన ఘనతలు సాధించిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. 200కు పైగా వికెట్లు, 1000కు పైగా పరుగులు, సెంచరీ, హ్యాట్రిక్, ఐదు వికెట్ల హాల్, మూడు సార్లు మోస్ట్‌ వాల్యుయబుల్‌ ప్లేయర్‌ అవార్డులు.. ఇలాంటి ఎన్నో ఘనతలు అతని ఖాతాలో ఉన్నాయి. ఈ కారణంగానే మైసూర్ నరైన్‌ను గేమ్ చేంజర్‌గా కొనియాడుతూ 'కింగ్'గా అభివర్ణించాడు.

మరోవైపు విరాట్‌ కోహ్లి కింగ్‌ అనే బిరుదుకు సార్దకత చేకూరుస్తూ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. సుదీర్ఘ కాలంగా స్థిరమైన ప్రదర్శన, జట్టు విజయాల్లో కీలక పాత్ర, భారీ అభిమాన వర్గం.. ఇవి కోహ్లీని 'కింగ్'గా నిలబెట్టాయి.

నరైన్‌ కూడా విరాట్‌లాగే కెరీర్‌ ప్రారంభం నుంచి ఒకే ఫ్రాంచైజీకి ప్రాతినిథ్యం వహిస్తూ.. బౌలింగ్‌, బ్యాటింగ్‌ విభాగాల్లో స్థిరంగా రాణిస్తూ.. జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తూ కింగ్‌ బిరుదు కోసం పోటీపడుతున్నాడు. బ్యాటింగ్‌లో విరాట్‌.. ఆల్‌రౌండ్ ప్రదర్శనల్లో నరైన్ ఆధిపత్యం చాటుతుండటంతో కింగ్‌ ఎవరో డిసైడ్‌ చేయడం చాలా కష్టంగా మారింది.

ఇదిలా ఉంటే, ఈ సీజన్‌ తొలి 6 మ్యాచ్‌ల్లో ఒక్క విజయం కూడా సాధించలేని కేకేఆర్‌.. అనూహ్యంగా హ్యాట్రిక్‌ విజయాలు నమోదు చేసి ఉనికి చాటుకుంది. ప్రస్తుతం ఆ జట్టు 9 మ్యాచ్‌ల్లో 3 విజయాలతో 7 పాయింట్లు కలిగి పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉంది. ఆ జట్టుకు ప్లే ఆఫ్స్‌ అవకాశాలు గల్లంతు అయినప్పటికీ.. అధికారికంగా రేసులోనే ఉంది. మరోవైపు విరాట్‌ ప్రాతినిథ్యం వహించే ఆర్సీబీ 9 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 12 పాయింట్లు సాధించి, పట్టికలో రెండో స్థానంలో ఉంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement