దక్షిణాఫ్రికాతో భారత్‌ తొలిపోరు.. ఈ సారైనా!

India first Test against South Africa starts on 26 december - Sakshi

నేటి నుంచి దక్షిణాఫ్రికాతో భారత్‌ తొలి టెస్టు

బ్యాటింగ్‌ సత్తాతో కోహ్లి సేన

సొంతగడ్డపై బౌలింగ్‌ను నమ్ముకున్న ఎల్గర్‌ బృందం

మధ్యాహ్నం గం. 1:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

పర్యటనకు ముందు దక్షిణాఫ్రికాలో పుట్టిన ‘ఒమిక్రాన్‌’ కలకలం రేపింది. భారత్‌ పర్యటనను ఒకదశలో ప్రశ్నార్థకంగా మార్చింది. ఇప్పుడు కూడా ఈ వేరియంట్‌ ప్రపంచాన్నే వణికిస్తోంది. కానీ భారత్, దక్షిణాఫ్రికా సిరీస్‌ను మాత్రం ఆపలేకపోయింది. పటిష్టమైన ముందుజాగ్రత్త చర్యలతో క్రికెట్‌ విందు టీవీల ముందుకొచ్చింది.

ఆంక్షలు, లాక్‌డౌన్‌ వార్తలతో విసిగెత్తుతున్న వారికి ఈ సిరీస్‌ క్రికెట్‌ న్యూస్‌ కిక్‌ ఎక్కించడం ఖాయం. గతంలో ఏడుసార్లు దక్షిణాఫ్రికాలో పర్యటించినా టెస్టు సిరీస్‌ విజయాన్ని అందుకోలేకపోయిన టీమిండియా ఈసారైనా సఫలం కావాలని ఆశిద్దాం.

సెంచూరియన్‌: సఫారీ గడ్డపై తొలి సవాల్‌కు కోహ్లి సేన సిద్ధమైంది. ఆదివారం నుంచి భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇక్కడి సూపర్‌స్పోర్ట్‌ పార్క్‌లో ‘బాక్సింగ్‌ డే’ టెస్టు జరగనుంది. తొలి టెస్టుపై మొదటి రోజు నుంచే పైచేయి సాధించాలని టీమిండియా గట్టి పట్టుదలతో ఉంది. ఓపెనింగ్‌ జోడీ బలం, మిడిలార్డర్‌లో కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్‌లతో కూడిన బ్యాటింగ్‌ దళం పటిష్టంగా ఉంది.

విశేషానుభవం గల రాహుల్‌ ద్రవిడ్‌ కోచ్‌గా ఉండటం జట్టుకు బాగా ఉపకరిస్తుంది.  మరోవైపు సొంతగడ్డ అనుకూలతలతో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) రన్నరప్‌ భారత్‌ను ఆరంభం నుంచే ఇబ్బందుల్లోకి నెట్టాలని ఆతిథ్య దక్షిణాఫ్రికా భావిస్తోంది. పేస్‌ బౌలర్‌ అన్రిచ్‌ నోర్జే లేని లోటు జట్టును బాధిస్తున్నప్పటికీ సత్తాగల ఆటగాళ్లు ఉన్న సఫారీ జట్టు... భారత్‌కు ఐదు రోజులూ పెను సవాళ్లు విసిరేందుకు ‘సై’ అంటోంది.  

ఐదుగురు బౌలర్లతో...
ఎప్పటిలాగే సారథి కోహ్లి ఐదుగురు బౌలర్ల ఫార్ములాతోనే బరిలోకి దిగే అవకాశముంది. సీమ్‌ వికెట్‌ దృష్ట్యా ఈసారి భారత టీమ్‌ మేనేజ్‌మెంట్‌ పేస్‌ బౌలర్లకే పెద్దపీట వేయనుంది. ఈ నేపథ్యంలో నలుగురు సీమర్లు శార్దుల్‌ ఠాకూర్, షమీ, బుమ్రా, సిరాజ్‌లతో బరిలోకి దిగడం ఖాయం. స్పిన్నర్‌ అశ్విన్‌ తన అనుభవాన్ని జతచేస్తే ప్రత్యర్థి బ్యాటర్లకు తిప్పలు తప్పవు. ఇక బ్యాటింగ్‌ విషయానికొస్తే ఓపెనర్లు కేఎల్‌ రాహుల్, మయాంక్‌ అగర్వాల్‌ విజయవంతమైన జోడీగా ఇప్పటికే నిరూపించుకున్నారు.

ఇందులో ఇక ఏ మార్పు ఉండబోదు. టాపార్డర్‌లో చతేశ్వర్‌ పుజారా, మిడిలార్డర్‌లో కోహ్లి జట్టును నడిపిస్తాడు. అయితే ఫామ్‌లో లేని రహానేకు ఈ మ్యాచ్‌లోనూ చాన్స్‌ లేనట్లే! అందివచ్చిన అవకాశాల్ని అందిపుచ్చుకున్న శ్రేయస్‌ వైపే జట్టు మేనేజ్‌మెంట్‌ మొగ్గు చూపుతోంది. దీంతో తెలుగు ఆటగాడు, టెస్టు స్పెషలిస్టు హనుమ విహారికి కూడా తుది జట్టులో అంతంత మాత్రంగానే అవకాశాలున్నాయి. లోయర్‌ ఆర్డర్‌లో వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌తో పాటు అశ్విన్, పేస్‌ ఆల్‌రౌండర్‌ శార్దుల్‌ ఠాకూర్‌ అందుబాటులో ఉన్నారు.  

రబడపైనే భారం
ఈ సీజన్‌ ఐపీఎల్, టి20 ప్రపంచకప్‌లో సీమర్‌ నోర్జే చక్కగా రాణించాడు. దీంతో సొంతగడ్డపై అతనే తురుపుముక్కగా జట్టు భారీ అంచనాలు పెట్టుకుంది. కానీ తుంటి గాయంతో మొత్తం సిరీస్‌కే దూరమవడం జట్టుకు శాపమైంది. ఈ నేపథ్యంలో బౌలింగ్‌ భారమంతా రబడపైనే పడింది. ఇన్‌గిడి, ఒలీవర్‌లు ఉన్నప్పటికీ నోర్జే అంతటి ప్రస్తుత పేస్‌ పదును వీరికి లేదు. స్పిన్నర్‌ కేశవ్‌ మహరాజ్‌ సొంతగడ్డపై తన మాయాజాలం కనబరిచేందుకు తహతహలాడుతున్నాడు. బ్యాటింగ్‌లో కెప్టెన్‌ ఎల్గర్, మార్క్‌రమ్, పీటర్సన్, డసెన్‌లతో పాటు వికెట్‌ కీపర్‌ డికాక్‌ అందరూ ఫామ్‌లో ఉండటం జట్టుకు కలిసొచ్చే అంశం. ఎల్గర్, మార్క్‌రమ్‌ శుభారంభమిస్తే... మిడిలార్డర్‌లో డసెన్, బవుమా ఇన్నింగ్స్‌ను భారీస్కోరువైపు నడిపించగలరు.
పిచ్, వాతావరణం
సెంచూరియన్‌ వికెట్‌ ఆరంభంలో మందకొడిగా ఉంటుంది. పిచ్‌పై పచ్చిక దృష్ట్యా రెండు, మూడో రోజుల్లో పేసర్లకు అనుకూలిస్తుంది. తొలి రెండు రోజుల్లో చిరుజల్లులు కురిసే అవకాశముంది.

జట్లు (అంచనా)
భారత్‌: కోహ్లి (కెప్టెన్‌), రాహుల్, మయాంక్‌ అగర్వాల్, పుజారా, రహానే/శ్రేయస్‌ అయ్యర్‌/ హనుమ విహారి, రిషభ్‌ పంత్, అశ్విన్, శార్దుల్, షమీ, బుమ్రా, సిరాజ్‌/ఇషాంత్‌ శర్మ.
దక్షిణాఫ్రికా: డీన్‌ ఎల్గర్‌ (కెప్టెన్‌), మార్క్‌రమ్, కీగన్‌ పీటర్సన్, వాన్‌ డెర్‌ డసెన్, బవుమా, డికాక్, వియాన్‌ మల్డర్, కేశవ్‌ మహారాజ్, రబడ,డిన్‌గిడి, ఒలీవర్‌.

శ్రేయస్, రాహుల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top