ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌కు ముందు టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ..! | India Dealt With Injury Blow To Star Player Ahead Of Headingley Test Says Reports | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌కు ముందు టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ..!

Jun 19 2025 11:41 AM | Updated on Jun 19 2025 12:41 PM

India Dealt With Injury Blow To Star Player Ahead Of Headingley Test Says Reports

భారత క్రికెట్‌ జట్టు రేపటి నుంచి (జూన్‌ 20) వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ కొత్త సైకిల్‌ను (2025-27) ప్రారంభిస్తుంది. భారత్‌, ఇంగ్లండ్‌ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ రేపటి నుంచి మొదలవుతుంది. ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్‌ హెడింగ్లేలోని లీడ్స్‌లో జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్‌ రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది.

ఈ మ్యాచ్‌ కోసం ఇరు జట్లు అస్త్రశస్త్రాలు సిద్దం చేసుకున్నాయి. ఇంగ్లండ్‌ ఇదివరకే తుది జట్టును ప్రకటించింది. భారత్‌ కూడా తుది జట్టుపై క్లారిటీ ఇచ్చేసింది. రోహిత్‌, విరాట్‌, అశ్విన్‌ల రిటైర్మెంట్‌ తర్వాత యంగ్‌ ఇండియా ఎదుర్కోబోయే తొలి అగ్నిపరీక్ష ఇదే.

ఈ సిరీస్‌తో శుభ్‌మన్‌ గిల్‌ టీమిండియా కెప్టెన్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెడతాడు. భారత తుది జట్టులో చాలా మార్పులకు అవకాశం ఉంది. యువ ఆటగాడు సాయి సుదర్శన్‌ అరంగేట్రం దాదాపుగా ఖరారైపోయింది. బ్యాటింగ్‌ స్థానాలపై కూడా వైస్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ నిన్నటి ప్రెస్‌ మీట్‌లో క్లారిటీ ఇచ్చాడు. నాలుగో స్థానంలో గిల్‌, ఐదో ప్లేస్‌తో తను బ్యాటింగ్‌కు దిగుతామని పంత్‌ వెల్లడించాడు.

ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్‌, కేఎల్‌ రాహుల్‌.. వన్‌డౌన్‌లో సాయి సుదర్శన్‌ పేర్లు కూడా దాదాపుగా ఖరారైపోయాయి. ఆరో స్థానంపై కూడా టీమిండియా మేనేజ్‌మెంట్‌కు నిన్నటి వరకు ఎలాంటి అనుమానం లేకుండింది. 8 ఏళ్ల తర్వాత భారత టెస్ట్‌ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన కరుణ్‌ నాయర్‌ ఈ స్థానంలో బ్యాటింగ్‌ చేస్తాడని మేనేజ్‌మెంట్‌ సూచనప్రాయంగా వెల్లడించింది.

అయితే నిన్న జరిగిన ప్రాక్టీస్‌ సెషన్‌లో టీమిండియాకు ఓ ఊహించని ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తుంది. దేశవాలీ క్రికెట్‌లో పరుగుల వరద పారించి టీమిండియా తలుపులు తట్టిన కరుణ్‌ నాయర్‌ నెట్స్‌ గాయపడ్డాడని ప్రచారం జరుగుతుంది. ప్రసిద్ద్‌ కృష్ణ బౌలింగ్‌ను ఎదుర్కోబోయి కరుణ్‌ పక్కటెముకల్లో దెబ్బ తగిలించుకున్నాడని సమాచారం. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. 

ఒకవేళ నిజంగానే కరుణ్‌ గాయపడినట్లైతే టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలనట్లవుతుంది. కరుణ్‌ ఇటీవల ఇంగ్లండ్‌ లయన్స్‌తో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీ సాధించి జోరుమీదున్నాడు. అతని గాయం తీవ్రమైందైతే తుది జట్టులో అతని స్థానం గల్లంతైనట్లే. ఇది టీమిండియా బ్యాటింగ్‌ కూర్పును భారీగా ప్రభావితం చేస్తుంది. ఆరో స్థానం కోసం మేనేజ్‌మెంట్‌ మరో ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. 

ఆ స్థానం కోసం ప్రత్యామ్నాయ ఆటగాడిగా ధృవ్‌ జురెల్‌ అందుబాటులో ఉన్నప్పటికీ.. అతను మ్యాచ్‌ కోసం సిద్దంగా ఉండకపోవచ్చు. కరుణ్‌కు ప్రత్యామ్నాయంగా ఆల్‌రౌండర్‌తో ముందుకు వెళ్లాలనుకుంటే కూడా వాషింగ్టన్‌ సుందర్‌ అందుబాటులో ఉన్నాడు. 

కరుణ్‌ గాయం తీవ్రమైందైతేనే ఈ ఈక్వేషన్స్‌ అన్నిటికీ ఆస్కారం ఉంటుంది. సోషల్‌మీడియాలోని మరో వర్గం కరుణ్‌ గాయాన్ని కొట్టిపారేస్తుంది. అతని గాయం తీవ్రమైంది కాదని అంటుంది. తొలి టెస్ట్‌లో కరుణ్‌ తప్పక ఆడతాడని చెబుతుంది. ఈ విషయమై మరికొద్ది గంటల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు భారత తుది జట్టు (అంచనా).. 
యశస్వి జైశ్వాల్‌,  కేఎల్ రాహుల్‌, సాయి సుదర్శన్‌, శుభ్‌మన్ గిల్‌(కెప్టెన్‌), రిషబ్ పంత్‌ (వైస్‌ కెప్టెన్‌), కరుణ్‌ నాయర్‌, నితీష్ కుమార్ రెడ్డి/శార్దూల్‌ ఠాకూర్‌, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా,మహ్మద్ సిరాజ్,ప్రసిద్ కృష్ణ/అర్షదీప్‌ సింగ్‌

టీమిండియాతో తొలి టెస్టుకు ఇంగ్లండ్‌ తుదిజట్టు..
జాక్‌ క్రాలే, బెన్‌ డకెట్‌, ఓలీ పోప్‌, జో రూట్‌, హ్యారీ బ్రూక్‌, బెన్‌ స్టోక్స్‌, జేమీ స్మిత్‌ (వికెట్‌ కీపర్‌), క్రిస్‌ వోక్స్‌, బ్రైడన్‌ కార్సే, జోష్‌ టంగ్‌, షోయబ్‌ బషీర్‌.

 

Advertisement
 
Advertisement
Advertisement