IND Vs SA: Shaun Pollock On Virat Kohli Dismissal 'He's Got Really Disappointed' - Sakshi
Sakshi News home page

Virat Kohli Dismissal: 94 బంతులు.. 35 పరుగులు.. మరీ అలా అవుట్‌ అవడం ఏంటి!.. ఫ్రస్ట్రేషన్‌తో హోటల్‌కు వెళ్లి కూర్చున్నాడేమో!

Published Mon, Dec 27 2021 10:38 AM

Ind Vs Sa 1st Test: Shaun Pollock On Virat Kohli Dismissal Be Sitting At Hotel - Sakshi

Ind vs Sa 1st Test, Shaun Pollock About Virat Kohli: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అవుటైన తీరుపై ప్రొటిస్‌ మాజీ బౌలర్‌ షాన్‌ పొలాక్‌ స్పందించాడు. ఇన్నింగ్స్‌ సాఫీగా సాగిపోతున్న సమయంలో వికెట్‌ పారేసుకోవడం కోహ్లికి కూడా చిరాకు తెప్పించి ఉంటుందని పేర్కొన్నాడు. ఏదేమైనా భారత కెప్టెన్‌ తీవ్ర నిరాశకు గురై ఉంటాడని, దెబ్బకు హోటల్‌కు వెళ్లి కూర్చున్నాడేమో అని వ్యాఖ్యానించాడు. కాగా బాక్సింగ్‌ డే టెస్టులో భారత్‌కు శుభారంభం లభించిన సంగతి తెలిసిందే.

ఓపెనర్లు మయాంక్‌ అగర్వాల్‌ అర్ధ సెంచరీ, కేఎల్‌ రాహుల్‌ అద్భుత శతకం(నాటౌట్‌)తో రాణించిన సంగతి తెలిసిందే. నయా వాల్‌గా పేరొందిన ఛతేశ్వర్‌ పుజారా మాత్రం మరోసారి పూర్తిగా నిరాశ పరచగా.. 94 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 35 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద నిష్క్రమించాడు. ముఖ్యంగా రాహుల్‌తో కలిసి మంచి భాగస్వామ్యం నమోదు చేస్తున్నాడనుకుంటున్న సమయంలో నిర్లక్ష్య ధోరణితో వికెట్‌ పారేసుకున్నాడు. ఎంగిడి బౌలింగ్‌లో ఆఫ్‌స్టంప్‌కు దూరంగా వెళ్తున్న బంతిని అనవసరంగా టచ్‌ చేశాడు. ఫలితంగా పెవిలియన్‌ చేరాడు. 

ఈ విషయం గురించి దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ షాన్‌ పొలాక్‌ మాట్లాడుతూ... ‘‘అతడెలా అవుట్‌ అయ్యాడో చూడండి. టచ్‌లో ఉన్నాడు.. మంచిగా ఆడుతున్నాడు... క్రీజులో కుదురుకున్నాడు కాబట్టి భారీ స్కోరు చేస్తాడు అనుకున్న సమయంలో... 35 పరుగులకే నిష్క్రమించాడు. చూస్తున్నవాళ్లే కాదు.. తాను కూడా పూర్తిగా నిరాశకు లోనై ఉంటాడు. తను అవుట్‌ అయిన తీరును జీర్ణించుకోలేక కోపం, విసుగుతో హోటల్‌కు వెళ్లి కూర్చున్నాడేమో’’అని పేర్కొన్నాడు. కాగా తొలి రోజు ఆట ముగిసే సరికి టీమిండియా 3 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌(122 పరుగులు), అజింక్య రహానే(40) క్రీజులో ఉన్నారు.

చదవండి: Mayank Vs Lungi Ngidi: మయాంక్‌ అగర్వాల్‌ ఔట్‌ విషయంలో ఫ్యాన్స్‌ అసంతృప్తి

Advertisement

తప్పక చదవండి

Advertisement