Ind Vs Ban: బ్యాటర్‌ కంటే ముందుగానే.. గేమ్‌ ఛేంజర్‌ నువ్వే! అతడికి హ్యాట్సాఫ్‌

Ind Vs Ban: Praises On KL Rahul Presence Of Mind In Liton Das Run Out - Sakshi

ICC Mens T20 World Cup 2022 - India vs Bangladesh: టీ20 ప్రపంచకప్‌-2022 టోర్నీలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌కు ముందు తీవ్ర విమర్శలు.. మొదటి మూడు మ్యాచ్‌లలో సింగిల్‌ డిజిట్‌ స్కోర్లకే పరిమితం.. తుది జట్టు నుంచి తప్పించాలంటూ ట్రోలింగ్‌.. వాటన్నింటికీ బ్యాట్‌తోనే సమాధానం చెప్పాడు టీమిండియా ఓపెనర్‌ కేఎల్‌ రాహుల్‌.

సూపర్‌-12లో భాగంగా అడిలైడ్‌లో బుధవారం బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో అద్భుతంగా రాణించాడు. జట్టు యాజమాన్యం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ 32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌ల సాయంతో 50 పరుగులు చేశాడు ఈ కర్ణాటక బ్యాటర్‌. తద్వారా టీమిండియా భారీ స్కోరు నమోదు చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు.

కోలుకోలేని దెబ్బ కొట్టాడు
బ్యాటర్‌గా ఇలా అర్ధ శతకంతో మెరిసిన రాహుల్‌.. బంగ్లాదేశ్‌ను కట్టడి చేయడంలోనూ కీలక పాత్ర పోషించాడనే చెప్పుకోవాలి. సమయస్ఫూర్తితో వ్యవహరించి బంగ్లా ఓపెనర్‌ లిటన్‌ దాస్‌ను రనౌట్‌ చేయడం ద్వారా షకీబ్‌ బృందాన్ని కోలుకోలేని దెబ్బకొట్టాడు. నిజానికి లిటన్‌ దాస్‌ పెవిలియన్‌ చేరిన తర్వాత మ్యాచ్‌ స్వరూపం పూర్తిగా మారిపోయిందని చెప్పవచ్చు.

వర్షం కారణంగా మ్యాచ్‌ డక్‌వర్త్‌ లూయీస్‌ మెథడ్‌లోకి వెళ్లే సమయానికి లిటన్‌ 27 బంతుల్లోనే 7 ఫోర్లు, 3 సిక్సర్లు బాది 60 పరుగులతో జోరు మీదున్నాడు. ఎనిమిదో ఓవర్‌లో అశ్విన్‌.. షాంటోకు బంతిని సంధించాడు. డీప్‌ మిడ్‌ వికెట్‌ దిశగా బంతిని బాదిన షాంటో.. లిటన్‌ దాస్‌తో కలిసి ఒక పరుగు పూర్తి చేసుకున్నాడు. రెండో రన్‌ కూడా తీసేందుకు ఫిక్సయిపోగా. లిటన్‌ దాస్‌ నెమ్మదిగా కదిలాడు.

కొంపముంచిన రనౌట్‌
అదే బంగ్లాదేశ్‌ కొంపముంచింది. డీప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న రాహుల్‌ డైరెక్ట్‌గా వికెట్లకు బంతిని త్రో చేశాడు. నేల మీద వేగంగా దూసుకువచ్చిన బంతి లిటన్‌ దాస్‌ డైవ్‌ చేసే లోపే బెయిల్స్‌ను పడగొట్టింది. దీంతో లిటన్‌ దాస్‌ నిరాశలో కూరుకుపోగా టీమిండియాలో సంబరాలు మొదలయ్యాయి. 

ఇక ఫామ్‌లో ఉన్న లిటన్‌ దాస్‌ పెవిలియన్‌ చేరిన తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఆఖరి బంతి వరకు ఉత్కంఠ రేపిన ఈ మ్యాచ్‌లో రోహిత్‌ సేన 5 పరుగుల తేడాతో గెలుపొంది సెమీస్‌ బెర్తును దాదాపుగా ఖాయం చేసుకుంది.

అతడికి హ్యాట్సాఫ్‌ అన్న టీమిండియా దిగ్గజం
ఈ నేపథ్యంలో కేఎల్‌ రాహుల్‌ మీద ప్రశంసల జల్లు కురుస్తోంది. లిటన్‌ దాస్‌ రనౌట్‌ రాహుల్‌ ప్రెజెన్స్‌ ఆఫ్‌ మైండ్‌కు అద్దం పట్టిందంటూ టీమిండియా దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ కొనియాడాడు. బంగ్లాతో మ్యాచ్‌లో ఇదో మ్యాజికల్‌ మూమెంట్‌ అని హర్షం వ్యక్తం చేశాడు. వికెట్లను హిట్‌ చేయాలని చూడకుండా.. బంతిని త్రో చేసి రాహుల్‌ తెలివైన పని చేశాడని ప్రశంసించాడు.

ఇక రాహుల్‌ ఫ్యాన్స్‌ అయితే అతడి ప్రదర్శనతో ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. బ్యాట్‌తో రాణించాడు. ప్రత్యర్థి జట్టులో కీలక బ్యాటర్‌ను రనౌట్‌ చేసి జట్టును గెలిపించడంలో కీలకంగా మారాడు. నువ్వు నిజంగా గేమ్‌ ఛేంజర్‌ భాయ్‌’’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. ఈ రనౌట్‌కు సంబంధించిన వీడియోను షేర్‌ చేస్తూ సంతోషాన్ని పంచుకుంటున్నారు.

ఇండియా వర్సెస్‌ బంగ్లాదేశ్‌ స్కోర్లు:
ఇండియా- 184/6 (20)
బంగ్లాదేశ్‌- 145/6 (16)
డక్‌వర్త్‌ లూయీస్‌ పద్ధతి ప్రకారం 5 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌పై భారత్‌ విజయం

చదవండి: Ind Vs Ban: కోహ్లి ఫేక్‌ ఫీల్డింగ్‌ చేశాడంటూ ఆరోపణలు.. లేదంటే విజయం తమదేనన్న బంగ్లా క్రికెటర్‌
Shakib Al Hasan: నాకు ఆ స్థాయి ఉందంటారా? పాపం.. పుండు మీద కారం చల్లినట్లు ఏంటది?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top