డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌కు తృటిలో తప్పిన మరో పరాభవం​ | ICC Women's T20 World Cup 2026: New Zealand beat Ireland by 4 runs | Sakshi
Sakshi News home page

డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌కు తృటిలో తప్పిన మరో పరాభవం​

Jun 20 2026 2:57 AM | Updated on Jun 20 2026 10:09 AM

ICC Women's T20 World Cup 2026: New Zealand beat Ireland by 4 runs

ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్‌ 2026లో డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ న్యూజిలాండ్‌కు వరుస పరాభవాలు ఎదురయ్యాయి. తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్‌, రెండో మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో ఓటమిపాలైన ఆ జట్టు, తాజాగా మరో పరాభావాన్ని తృటిలో తప్పించుకొని ఊపీరి పీల్చుకుంది.

సౌథాంప్టన్‌ వేదికగా ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంప్‌ 4 పరుగుల స్వల్ప తేడాతో బయటపడింది. తద్వారా సూపర్‌-8 అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 140 పరుగులు చేసింది. కెప్టెన్‌ అమేలియా కెర్‌ (30), బ్రూక్‌ హ్యాలీడే (34), ఇజ్జీ షార్ప్‌ (36) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఆ జట్టు ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. 

మిగతా ప్లేయర్లలో ఇసబెల్లా గేజ్‌ 1, ప్లిమ్మర్‌ 4, మ్యాడీ గ్రీన్‌ 2 పరుగులకు ఔట్‌ కాగా.. సూజీ బేట్స్‌ 19, జెస్‌ కెర్‌ 5 పరుగులతో అజేయంగా నిలిచారు. ఐరిష్‌ బౌలర్లలో ప్రెండర్‌గాస్ట్‌, కారా ముర్రే తలో 2 వికెట్లు తీయగా.. మగూర్‌, కెల్లీ చెరో వికెట్‌ పడగొట్టారు.

అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనలో ఐర్లాండ్‌ వికెట్లు కాపాడుకునే ప్రయత్నంలో నిదానంగా ఆడి ఓటమిని కొని తెచ్చుకుంది. గ్యాబీ లెవిస్‌ (58), ప్రెండర్‌గాస్ట్‌ (59) అర్ద సెంచరీలతో రాణించినా లక్ష్యానికి 5 పరుగుల దూరంలో నిలిచిపోయింది. 

చివరి ఓవర్‌లో గెలుపుకు 15 పరుగులు అవసరం కాగా.. సూజీ బేట్స్‌ వారిని నిలువరించింది. లియా పాల్‌ (8 నాటౌట్‌), లూయిస్‌ లిటిల్‌ (5 నాటౌట్‌) ఐర్లాండ్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. న్యూజిలాండ్‌ బౌలర్లలో కెర్‌ 2, ఇల్లింగ్‌, రోస్‌మేరీ తలో వికెట్‌ తీశారు. మిగతా బౌలర్లు వికెట్లు తీయలేకపోయినా పొదుపుగా బౌలింగ్‌ చేశారు.

ఈ ఓటమితో ఐర్లాండ్‌ సూపర్‌-8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఓడి చిట్టచివరి స్థానంలో ఉంది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement