కమిన్స్‌ జైత్రయాత్రకు చెక్‌.. నంబర్‌ 1 ఎవరంటే?! సత్తా చాటిన జడ్డూ.. ఇక బుమ్రా..

ICC Test Rankings Cummins Reign Over As New No1 Bowler Crowned - Sakshi

ICC Men's Test Bowling Rankings: టీమిండియాతో తొలి రెండు టెస్టుల్లో పేలవ ప్రదర్శన కనబరిచిన ఆస్ట్రేలియా కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌ ఐసీసీ బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కోల్పోయాడు. రెండు స్థానాలు దిగజారి మూడో స్థానానికి పడిపోయాడు. ఇక బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేసిన టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ ఒకస్థానం మెరుగుపరచుకుని రెండో ర్యాంకు సాధించాడు.


జేమ్స్‌ ఆండర్సన్‌

చరిత్ర సృష్టించిన ఆండర్సన్‌
న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌లో అత్యద్భుతంగా రాణించిన ఇంగ్లండ్‌ వెటరన్‌ బౌలర్‌ జేమ్స్‌ ఆండర్సన్‌ వీళ్లిద్దరినీ వెనక్కినెట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు. 866 రేటింగ్‌ పాయింట్లతో మొదటి ర్యాంకు అందుకున్నాడు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి బుధవారం ఐసీసీ టెస్టు బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌ విడుదల చేయగా.. ఆండర్సన్‌ ప్రపంచ నంబర్‌ 1 బౌలర్‌గా అవతరించాడు.


రవీంద్ర జడేజా

సత్తా చాటిన జడ్డూ
దాదాపు నాలుగేళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న కమిన్స్‌కు చెక్‌ పెట్టాడు. అదే విధంగా.. అత్యధిక వయసులో నంబర్‌ 1 ఘనత సాధించిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇదిలా ఉంటే.. బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో సత్తా చాటుతున్న టీమిండియా స్పిన్నర్‌ రవీంద్ర జడేజా 6 స్థానాలు ఎగబాకి టాప్‌-10లో చోటు దక్కించుకున్నాడు. 763 పాయింట్లతో తొమ్మిదో ర్యాంకు సాధించాడు. 

త్వరలోనే నంబర్‌ 1 అశ్విన్‌
ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో అశ్విన్‌ మిగతా రెండు టెస్టుల్లోనూ సత్తా చాటితే నంబర్‌1గా అవతరించడం ఖాయం. మరోవైపు.. కమిన్స్‌ మళ్లీ పూర్వవైభవం పొందాలంటే మాత్రం టీమిండియాతో సిరీస్‌లో తప్పక రాణించాలి. అయితే, అత్యవసరంగా స్వదేశానికి తిరిగి వెళ్లిపోయిన అతడు అసలు తిరిగి వస్తాడా లేదా అన్నదే ప్రశ్నార్థకంగా మారింది.

దీంతో అశూ అగ్రస్థానానికి చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక మొదటి రెండు టెస్టుల్లో పేసర్‌ కమిన్స్‌ మొత్తంగా మూడు వికెట్లు తీయగా.. అశ్విన్‌ 14 వికెట్లు పడగొట్టాడు. ఇక జడేజా పదిహేడు వికెట్లతో సత్తా చాటాడు.

ఐసీసీ టెస్టు బౌలర్ల తాజా ర్యాంకింగ్స్‌ టాప్‌-5లో ఉన్నది వీళ్లే
1. జేమ్స్‌ ఆండర్సన్‌- ఇంగ్లండ్‌- 866 పాయింట్లు
2. రవిచంద్రన్‌ అశ్విన్‌- ఇండియా- 864 పాయింట్లు
3. ప్యాట్‌ కమిన్స్‌- ఆస్ట్రేలియా- 858 పాయింట్లు
4. ఓలీ రాబిన్సన్‌- ఇంగ్లండ్‌- 820 పాయింట్లు
5. జస్‌ప్రీత్‌ బుమ్రా- ఇండియా- 795 పాయింట్లు


బుమ్రా

చదవండి: ChatGPT: రాహుల్‌ను తప్పించాలా? అదీ మరీ..! నీకున్న పాటి బుద్ధి వాళ్లకు లేదు!
Bumrah: ‘అలసిపోయాను సర్‌.. శారీరకంగా, మానసికంగా కూడా! స్లోగా బౌలింగ్‌ చేయనా?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top