Jasprit Bumrah: వన్డే ర్యాంకింగ్స్‌లో బుమ్రా అదుర్స్‌.. వరల్డ్‌ నెంబర్‌ వన్‌!

ICC ODI Bowling Rankings: Jasprit Bumrah In No 1 Spot After England Match - Sakshi

ICC ODI Bowling Rankings: ఐసీసీ వన్డే బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా అదరగొట్టాడు. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో రాణించిన అతడు ఏకంగా అగ్రస్థానానికి చేరుకున్నాడు. మూడు స్థానాలు ఎగబాకి 718 పాయింట్లతో వరల్డ్‌ నంబర్‌ వన్‌ వన్డే బౌలర్‌గా నిలిచాడు. బుమ్రా మినహా మరే ఇతర టీమిండియా బౌలర్లు టాప్‌-10లో చోటు దక్కించుకోలేకపోయారు.

కాగా ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్‌లో బుమ్రా అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఓవల్‌ వేదికగా సాగిన ఈ మ్యాచ్‌లో 7.2 ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టి కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. అదే విధంగా ఇంగ్లండ్‌ గడ్డపై వన్డేల్లో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన తొలి పేసర్‌గా నిలిచాడు బుమ్రా.

అంతేకాకుండా పలు ఇతర రికార్డులు కూడా తన పేరిట లిఖించుకున్నాడు. సుమారు ఆరేళ్ల తర్వాత వన్డేల్లో టీమిండియా 10 వికెట్ల తేడాతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కించుకున్నాడు. ఇక ఇప్పటికే ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.. ఈ గెలుపుతో వన్డే సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది.

కాగా బుమ్రా రెండేళ్ల అనంతరం టాప్‌ ర్యాంకు అందుకోవడం విశేషం. గతంలో(2017) టి20 బౌలింగ్‌ విభాగంలో అతను టాప్‌ ర్యాంకులో నిలిచాడు. ఇదిలా ఉంటే.. భారత్‌ తరఫున భువనేశ్వర్‌ మాత్రమే టి20 బౌలర్ల జాబితాలో టాప్‌–10లో (ఏడో ర్యాంకులో) ఉన్నాడు. వన్డే బ్యాట్స్‌మెన్‌ ర్యాంకింగ్స్‌లో కోహ్లి (803), రోహిత్‌ శర్మ (802) వరుసగా మూడు, నాలుగో స్థానాల్లో ఉన్నారు.

ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లో ఉన్న బౌలర్లు వీళ్లే!
1.జస్‌ప్రీత్‌ బుమ్రా(ఇండియా)
2.ట్రెంట్‌ బౌల్ట్‌(న్యూజిలాండ్‌)
3.షాహిన్‌ ఆఫ్రిది(పాకిస్తాన్‌)
4.జోష్‌ హాజిల్‌వుడ్‌(ఆస్ట్రేలియా)
5.ముజీబ్‌ ఉర్‌ రెహమాన్‌(అఫ్గనిస్తాన్‌)
6.మెహెదీ హసన్‌(బంగ్లాదేశ్‌)
7.క్రిస్‌ వోక్స్‌(ఇంగ్లండ్‌)
8. మ్యాట్‌ హెన్రీ(న్యూజిలాండ్‌)
9.మహ్మద్‌ నబీ(అఫ్గనిస్తాన్‌)
10. రషీద్‌ ఖాన్‌(అఫ్గనిస్తాన్‌)

చదవండి:  ICC T20 Rankings: దుమ్ము లేపిన సూర్యకుమార్‌.. ఏకంగా 44 స్థానాలు ఎగబాకి.. ఐదో ర్యాంకు!
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top