Ranji Trophy: ఆరు వికెట్లతో అదరగొట్టిన రవితేజ

Hyderabad have registered a big 217-run win over Chandigarh - Sakshi

చండీగఢ్‌పై 217 పరుగుల తేడాతో హైదరాబాద్‌ ఘనవిజయం

భువనేశ్వర్‌: రంజీ ట్రోఫీ సీజన్‌ను హైదరాబాద్‌ క్రికెట్‌ జట్టు ఘనవిజయంతో ప్రారంభించింది. చండీగఢ్‌తో జరిగిన ఎలైట్‌ గ్రూప్‌ ‘బి’ తొలి లీగ్‌ మ్యాచ్‌లో హైదరాబాద్‌ 217 పరుగుల ఆధిక్యంతో గెలుపొందింది. 401 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన చండీగఢ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 50.5 ఓవర్లలో 183 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ స్కోరు 21/2తో చివరిరోజు ఆట కొనసాగించిన చండీగఢ్‌ను హైదరాబాద్‌ మీడియం పేసర్లు తెలుకుపల్లి రవితేజ, రక్షణ్‌ రెడ్డి హడలెత్తించారు.

ఫలితంగా ఆట చివరిరోజు చండీగఢ్‌ 162 పరుగులు జోడించి మిగతా ఎనిమిది వికెట్లు కోల్పోయింది. రవితేజ తన రంజీ కెరీర్‌లో అత్యుత్తమ బౌలింగ్‌ ప్రదర్శన నమోదు చేశాడు. 27 ఏళ్ల రవితేజ రెండో ఇన్నింగ్స్‌లో 17 ఓవర్లు వేసి 41 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టి చండీగఢ్‌ను దెబ్బతీశాడు. మరో పేస్‌ బౌలర్‌ రక్షణ్‌ రెడ్డి 62 పరుగులిచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. ఈ గెలుపుతో హైదరాబాద్‌ ఖాతాలో 6 పాయింట్లు చేరాయి. ఈనెల 24న కటక్‌లో మొదలయ్యే రెండో లీగ్‌ మ్యాచ్‌లో బెంగాల్‌తో హైదరాబాద్‌ ఆడుతుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top