The Hundred League 2022: స్మీడ్‌ సుడిగాలి శతకం.. 8 ఫోర్లు, 6 సిక్సర్లతో విధ్వంసం

The Hundred League: Birmingham Phoenix player Will Smeed Hits Competitions First Century - Sakshi

ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు (ఈసీబీ) నిర్వహించే ద హండ్రెడ్‌ లీగ్‌ కాంపిటీషన్‌లో తొలి శతకం నమోదైంది. 2022 ఎడిషన్‌లో భాగంగా బర్మింగ్‌హామ్‌ ఫీనిక్స్‌కు చెందిన 20 ఏళ్ల యువ బ్యాటర్‌ విల్‌ స్మీడ్‌ లీగ్‌లో తొట్ట తొలి సెంచరీ సాధించి రికార్డుల్లోకెక్కాడు. అంతకుముందు సహచర ఆటగాడు, పంజాబ్‌ కింగ్స్‌ (ఐపీఎల్‌) ప్లేయర్‌ లియామ్‌ లివింగ్‌స్టోన్‌ చేసిన 92 పరుగులే హండ్రెడ్‌ లీగ్‌ అత్యధిక వ్యక్తిగత స్కోర్‌గా ఉండింది. నిన్న (ఆగస్ట్‌ 10) సథరన్‌ బ్రేవ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్మీడ్‌ ఈ ఘనత సాధించాడు. 

స్మీడ్‌.. 50 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో విధ్వంసకర శతకం నమోదు చేశాడు. ఫలితంగా అతను ప్రాతినిధ్యం వహిస్తున్న బర్మింగ్‌హామ్‌ జట్టు 53 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఫీనిక్స్‌ జట్టు నిర్ణీత 100 బంతుల్లో 4 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేయగా.. ఛేదనలో హెన్రీ బ్రూక్స్‌ (5/25), కేన్‌ రిచర్డ్‌సన్‌ (3/19) ధాటికి ప్రత్యర్ధి సథరన్‌ బ్రేవ్‌ 123 పరుగులకే చాపచుట్టేసింది. 

ఫీనిక్స్‌ ఇన్నింగ్స్‌లో స్మీడ్‌ అజేయమైన సెంచరీ బాదగా, లివింగ్‌స్టోన్‌ (20 బంతుల్లో 21; ఫోర్‌, సిక్స్‌) పర్వాలేదనిపించాడు. సథరన్‌ బ్రేవ్‌ బౌలర్లలో స్టొయినిస్‌, క్రిస్‌ జోర్డాన్‌, జేమ్స్‌ ఫుల్లర్‌, లిన్టాట్‌ తలో వికెట్‌ పడగొట్టారు.సథరన్‌ ఇన్నింగ్స్‌లో అలెక్స్‌ డేవిస్‌ (24 బంతుల్లో 33; 2 ఫోర్లు, సిక్స్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. కాగా, ప్రస్తుత ఎడిషన్‌లో బర్మింగ్‌హామ్‌ ఫీనిక్స్‌కు ఇది తొలి విజయం. మొత్తం 8 జట్లు పాల్గొంటున్న ఈ లీగ్‌లో ప్రస్తుతానికి లండన్‌ స్పిరిట్‌ 2 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. 
చదవండి: దంచికొట్టిన డేవిడ్‌ మలాన్‌.. దూసుకుపోతున్న ట్రెంట్‌ రాకెట్స్‌

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top