Malaysia Masters: చరిత్ర సృష్టించిన హెచ్‌ఎస్‌ ప్రణయ్‌

HS Prannoy-1st Indian-Male-Shuttler-Claims Malaysia Masters Title - Sakshi

మలేసియా మాస్టర్స్‌ సూపర్‌-500  టోర్నీ విజేతగా భారత స్టార్ షట్లర్ హెచ్‌ఎస్ ప్రణయ్ నిలిచాడు. 30 ఏళ్ల ప్రణయ్‌కు ఇదే తొలి బీడబ్ల్యూఎఫ్‌ టైటిల్‌ కావడం విశేషం. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రణయ్ 21-19, 13-21, 21-18 తేడాతో చెనా షట్లర్ వెంగ్ హాంగ్ యాంగ్‌ను ఓడించాడు. గంటా 31 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో విజయం కోసం ప్రణయ్ తీవ్రంగా శ్రమించాడు.

వెంగ్ హంగ్ యాంగ్, హెచ్ ప్రణయ్ మధ్య మొదటి గేమ్ హోరాహోరీగా జరిగింది. ఒకానొక దశలో వెంగ్ హంగ్ 5-7 తేడాతో ఆధిక్యంలోకి దూసుకెళ్లినా ప్రణయ్ అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చి 9-9 తేడాతో స్కోర్లను సమం చేశాడు. ఆ తర్వాత 15-12 తేడాతో 3 పాయింట్లు ఆధిక్యంలోకి వెళ్లిన ప్రణయ్, దాన్ని నిలుపుకోలేకపోయాడు. దీంతో 15-15 తేడాతో స్కోర్లు మరోసారి సమం అయ్యాయి.

అయితే వరుసగా రెండు పాయింట్లు సాధించి 17-16 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లిన ప్రణయ్, మొదటి సెట్‌ని 21-19 తేడాతో సొంతం చేసుకున్నాడు. అయితే రెండో సెట్‌లో ప్రణయ్ పూర్తిగా తేలిపోయాడు. ప్రణయ్ చేసిన తప్పిదాలతో 11-17 తేడాతో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్లాడు. దాన్ని కాపాడుకుంటూ 13-21 తేడాతో రెండో సెట్ సొంతం చేసుకుని, గేమ్‌ని 1-1 తేడాతో సమం చేశాడు..

దీంతో మూడో సెట్ కీలకంగా మారింది. మూడో సెట్‌లో 10-10 తేడాతో ఇద్దరు ప్లేయర్లు సమంగా నిలిచారు. అయితే ఆ తర్వాత దూకుడు చూపించిన హెచ్ఎస్ ప్రణయ్, వరుస పాయింట్లు సాధించి చైనా ప్లేయర్‌పై ఒత్తిడి పెంచాడు. 19-18 తర్వాత వరుసగా 3 పాయింట్లు సాధించి, సెట్‌తో పాటు మ్యాచ్‌ని కూడా కైవసం చేసుకున్నాడు..

మలేషియా మాస్టర్స్‌ ఉమెన్స్ సింగిల్స్‌లో 2013, 2016 సీజన్లలో పీవీ సింధు, 2017లో సైనా నెహ్వాల్ టైటిల్స్ గెలవగా.. పురుషుల సింగిల్స్‌లో టైటిల్ గెలిచిన మొదటి భారత షట్లర్‌గా హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ చరిత్రకెక్కాడు.

చదవండి: శాంతియుత నిరసన.. రెజ్లర్లకు ఘోర అవమానం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top