చావోరేవో.. పంజాబ్‌ కింగ్స్‌ ‘ప్లే ఆఫ్స్‌’ చేరాలంటే! | How Can Punjab Kings Finish 4th In IPL 2026 Playoffs Race Check | Sakshi
Sakshi News home page

చావోరేవో.. పంజాబ్‌ కింగ్స్‌ ‘ప్లే ఆఫ్స్‌’ చేరాలంటే!

May 23 2026 2:15 PM | Updated on May 23 2026 3:13 PM

How Can Punjab Kings Finish 4th In IPL 2026 Playoffs Race Check

PC: BCCI

ఐపీఎల్‌-2026 ‘ప్లే ఆఫ్స్‌’లో నాలుగో బెర్తు కోసం నాలుగు జట్లు బరిలో ఉన్నాయి. ఇప్పటికే డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ), గుజరాత్‌ టైటాన్స్‌ (జీటీ), సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ (ఎస్‌ఆర్‌హెచ్‌) తొలి మూడు స్థానాల్లో నిలిచాయి.

టాప్‌-2లో ఉన్న ఆర్సీబీ- గుజరాత్‌ క్వాలిఫయర్‌-1లో తలపడనుండగా.. ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌తో తలపడే జట్టు ఏదో ఆదివారం (మే 24) తేలిపోతుంది. ఇక ఈ బెర్తు కోసం రాజస్తాన్‌ రాయల్స్‌, పంజాబ్‌ కింగ్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ రేసులో ఉన్నాయి.

చావోరేవో
ఈ క్రమంలో పంజాబ్‌ శనివారం నాటి మ్యాచ్‌లో చావోరేవో తేల్చుకోవాల్సిన స్థితిలో నిలిచింది. నిజానికి సీజన్‌ ఆరంభంలో పంజాబ్‌ వరుస విజయాలతో ప్లే ఆఫ్స్‌ దిశగా దూసుకువచ్చింది. తొలి ఆరు మ్యాచ్‌లలో విజయం సాధించి.. చాన్నాళ్లు టాపర్‌గా కొనసాగింది.

కోల్‌కతాతో ఆడాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైపోయింది. దీంతో ఓవరాల్‌గా పంజాబ్‌ ఖాతాలో 13 (12+1) పాయింట్లు చేరాయి. కానీ ఆ తర్వాత శ్రేయస్‌ అయ్యర్‌ సేన దారుణంగా విఫలమైంది. వరుసగా ఆరు మ్యాచ్‌లలో ఓడి ప్లే ఆఫ్స్‌ అవకాశాలను దాదాపు దూరం చేసుకుంది.

అయితే, మిగతా జట్ల ఫలితాల కారణంగా పంజాబ్‌ ఇప్పటికీ అధికారికంగా రేసులో నిలవగలిగింది. ఈ నేపథ్యంలో లీగ్‌ దశలో మిగిలిన మ్యాచ్‌లో పంజాబ్‌ లక్నో సూపర్‌ జెయింట్స్‌తో తలపడనుంది. ఏకనా స్టేడియం ఇందుకు వేదిక.

పంజాబ్‌కు ప్లే ఆఫ్స్‌ బెర్తు ఖరారు కావాలంటే..
లక్నోతో మ్యాచ్‌లో పంజాబ్‌ తప్పక గెలవాలి. తద్వారా పాయింట్ల సంఖ్య 15కు చేరుకుంది. అయితే, రాజస్తాన్‌ రాయల్స్‌ నుంచి పంజాబ్‌కు ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్న రాజస్తాన్‌ ఖాతాలో 14 పాయింట్లు ఉన్నాయి. 

రాజస్తాన్‌ తప్పక ఓడిపోవాలి
కాబట్టి రాజస్తాన్‌ తమ ఆఖరి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ చేతిలో తప్పక ఓడిపోతేనే.. పంజాబ్‌కు అవకాశాలు ఉంటాయి. మరోవైపు.. కేకేఆర్‌ కూడా పంజాబ్‌ మాదిరే 13 పాయింట్లు కలిగి ఉంది.

ఒక్క పరుగు తేడాతో గెలిచినా.. 
అయితే, ప్రస్తుతం నెట్‌రన్‌రేటు పరంగా పంజాబ్‌ (+0.227).. కేకేఆర్‌ (+0.011) కంటే మెరుగైన స్థితిలో ఉండటం సానుకూలాంశం. ఈ నేపథ్యంలో పంజాబ్‌ లక్నోపై ఒక్క పరుగు తేడాతో గెలిచినా.. పైచేయి సాధించగలదు.

అదే సమయంలో కేకేఆర్‌ ఢిల్లీపై గెలిస్తే పంజాబ్‌ మాదిరే 15 పాయింట్లు వస్తాయి. అప్పుడు నెట్‌రన్‌రేటు కీలకంగా మారుతుంది. కాబట్టి కేకేఆర్‌ ఢిల్లీని కనీసం 52 పరుగులతో ఓడించాల్సి ఉంటుంది. అలాకాని పక్షంలో మరోసారి పంజాబ్‌దే పైచైయి అవుతుంది.

ఒకవేళ పంజాబ్‌ గనుక దురదృష్టశాత్తూ లక్నో చేతిలో ఓడిపోతే.. ఈ సమీకరణలతో సంబంధం లేకుండా అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. అప్పుడు రాజస్తాన్‌ రాయల్స్‌, కోల్‌కతా నాలుగో స్థానం కోసం పోటీలో ఉంటాయి.

చదవండి: పక్కా ప్లాన్‌తోనే.. ఓడినా సన్‌రైజర్స్‌ను దెబ్బకొట్టిన ఆర్సీబీ!

Advertisement
 
Advertisement
Advertisement