పక్కా ప్లాన్‌తోనే.. సన్‌రైజర్స్‌ను దెబ్బకొట్టిన ఆర్సీబీ! | Andy Flower Explains Why Did RCB Let SRH Win With Slow Batting | Sakshi
Sakshi News home page

పక్కా ప్లాన్‌తోనే.. ఓడినా సన్‌రైజర్స్‌ను దెబ్బకొట్టిన ఆర్సీబీ!

May 23 2026 1:09 PM | Updated on May 23 2026 1:22 PM

Andy Flower Explains Why Did RCB Let SRH Win With Slow Batting

డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్‌-2026లోనూ సత్తా చాటుతోంది. టేబుల్‌ టాపర్‌గా లీగ్‌ దశను ముగించి క్వాలిఫయర్‌-1కు అర్హత సాధించింది. కాగా తమ చివరి లీగ్‌ మ్యాచ్‌లో భాగంగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ శుక్రవారం ఆర్సీబీతో తలపడ్డ సంగతి తెలిసిందే. 

భారీ స్కోరు సాధించినా..
సొంతమైదానం ఉప్పల్‌లో ఆర్సీబీపై భారీ తేడాతో గెలిస్తేనే టాప్‌–2 దక్కే అవకాశం ఉండటంతో పట్టుదలగా ఆడి 255 పరుగుల భారీ స్కోరు సాధించింది. కానీ.. బెంగళూరును 166 పరుగులలోపు మాత్రం కట్టడి చేయలేకపోయింది. 

ఎలిమినేటర్‌ మ్యాచ్‌ ఆడాల్సిన స్థితిలో
ఫలితంగా హైదరాబాద్‌ ఈ మ్యాచ్‌లో గెలిచినా మూడో స్థానంతో ముగించి ఎలిమినేటర్‌ మ్యాచ్‌ ఆడాల్సిన స్థితిలో నిలిచింది. మరోవైపు ఆర్సీబీ ఈ మ్యాచ్‌లో ఓడినా... ముందుగా 166, ఆపై 178 స్కోరును దాటి అగ్రస్థానాన్ని సాధించడంలో సఫలమైంది. స్లోగా బ్యాటింగ్‌ చేస్తూనే అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంది.

అవును.. పక్కా ప్లాన్‌తోనే
ఇదే విషయాన్ని ఆర్సీబీ హెడ్‌కోచ్‌ ఆండీ ఫ్లవర్‌ తాజాగా వెల్లడించాడు. తమ దృష్టి సన్‌రైజర్స్‌ను ఓడించడం కంటే కూడా.. టేబుల్‌ టాపర్‌గా నిలవాలంటే కావాల్సిన 166 పరుగుల మీదే ఉందని తెలిపాడు. డ్రెసింగ్‌రూమ్‌లో మాట్లాడుతూ..

‘‘256 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం ముఖ్యమే. అయితే, పాయింట్ల పట్టికలో నెట్‌రన్‌రేటుతో అగ్రస్థానంలో నిలవడమే అంతిమ లక్ష్యం. అందుకే మనం వేర్వేరు టార్గెట్లు పెట్టుకున్నాం.

166 పరుగుల మార్కు దాటితే
ముందుగా 166 పరుగుల మార్కు దాటితే మనకు టాప్‌-2 బెర్తు ఖరారు అవుతుంది. ఆ తర్వాత 179 పరుగుల మార్కుకు చేరుకున్నామంటే.. టేబుల్‌ టాపర్‌ మనమే. ఆ తర్వాత 256 పరుగులు సాధిస్తే ఈ మ్యాచ్‌లో గెలుపు మనదే. ఇందుకు తగ్గట్లుగానే మన బ్యాటింగ్‌ కొనసాగింది.

వెంకటేశ్‌ అయ్యర్‌ అత్యద్భుతంగా బ్యాటింగ్‌ చేసి మనం అగ్రస్థానంలో నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ముందుగా మన లక్ష్యం 180 పరుగులేనని బ్యాటర్లు ఫీలయ్యేలా చేశాము’’ అని ఆండీ ఫ్లవర్‌ చెప్పుకొచ్చాడు.

వెంకటేశ్‌ అయ్యర్‌ ధనాధన్‌తో
కాగా సన్‌రైజర్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 255 పరుగులు చేసింది. ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన ఆర్సీబీ స్వల్ప వ్యవధిలోనే ఓపెనర్‌ విరాట్‌ కోహ్లి (15), వన్‌డౌన్‌ బ్యాటర్‌ దేవ్‌దత్‌ పడిక్కల్‌ (21) వికెట్లు కోల్పోయింది.

ఇలాంటి తరుణంలో మరో ఓపెనర్‌ వెంకటేశ్‌ అయ్యర్‌ (19 బంతుల్లో 44) మెరుపు ఇన్నింగ్స్‌తో పరిస్థితి చక్కదిద్దాడు. ఇక మధ్య ఓవర్లలో కెప్టెన్‌ రజత్‌ పాటిదార్‌ (39 బంతుల్లో 56), కృనాల్‌ పాండ్యా (31 బంతుల్లో 41 నాటౌట్‌) కాస్త నెమ్మదిగానే ఆడారు. 

ఆఖర్లో టిమ్‌ డేవిడ్‌ 7 బంతుల్లో 15 పరుగులతో పాండ్యాతో కలిసి అజేయంగా నిలవగా.. 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి ఆర్సీబీ 200 పరుగులు చేసింది.

ఓటమిపాలైనా.. టేబుల్‌ టాపర్‌గా
సన్‌రైజర్స్‌ చేతిలో 55 పరుగుల తేడాతో ఓటమిపాలైనా.. టేబుల్‌ టాపర్‌గా నిలవడంలో సఫలమైంది. ఇక ఆర్సీబీ- సన్‌రైజర్స్‌ మ్యాచ్‌ ఫలితంతో గుజరాత్‌ టైటాన్స్‌ రెండో స్థానంలో నిలిచింది.

ఈ క్రమంలో ‘ప్లే ఆఫ్స్‌’లో భాగంగా ఈనెల 26న ధర్మశాలలో జరిగే క్వాలిఫయర్‌–1లో ఆర్సీబీ జట్టుతో గుజరాత్‌ తలపడుతుంది. నాలుగో స్థానంలో నిలిచే జట్టుతో ఈనెల 27న న్యూచండీగఢ్‌లో జరిగే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఆడుతుంది. 

ఇక క్వాలిఫయర్‌–1లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌ చేరుకుంటుంది. ఓడిపోయిన జట్టు ఫైనల్లో స్థానం కోసం ఎలిమినేటర్‌ మ్యాచ్‌ విజేతతో ఈనెల 29న జరిగే క్వాలిఫయర్‌–2లో పోటీపడుతుంది.   

చదవండి: వారిద్దరూ అద్భుతం.. ఎంత పొగిడినా తక్కువే: కమిన్స్‌ 

Advertisement
 
Advertisement
Advertisement