
నాలుగు దేశాల మహిళల హాకీ టోర్నీ బరిలో భారత జట్టు
బెంగళూరు: ఈ ఏడాది డిసెంబర్‌లో జరిగే మహిళల జూనియర్ ప్రపంచకప్ టోర్నమెంట్‌కు సన్నాహాల్లో భాగంగా భారత జట్టు ఈ నెలలో నాలుగు దేశాల టోర్నీలో పోటీపడనుంది. అర్జెంటీనాలోని రొసారియా నగరంలో ఈనెల 25 నుంచి జూన్ 2వ తేదీ వరకు జరిగే ఈ టోర్నీలో భారత్‌తోపాటు అర్జెంటీనా, చిలీ, ఉరుగ్వే జట్లు పాల్గొంటున్నాయి.
ఈ టోర్నీలో ఆడనున్న భారత జట్టును శనివారం హాకీ ఇండియా ప్రకటించింది. 24 మంది సభ్యులతో కూడిన టీమిండియాకు గోల్‌కీపర్ నిధి నాయకత్వం వహిస్తుంది. డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో భారత జట్టు తమ తొలి మ్యాచ్‌ను మే 25న చిలీతో ఆడుతుంది.
ఆ తర్వాత టీమిండియా వరుసగా ఉరుగ్వేతో (మే 26న), అర్జెంటీనాతో (మే 28న), చిలీతో (మే 30న), ఉరుగ్వేతో (జూన్ 1న), అర్జెంటీనాతో (జూన్ 2న) తలపడతుంది. ‘ఈ టోర్నీ ద్వారా మా అత్యుత్తమ క్రీడాకారిణులు ఎవరో గుర్తిస్తాము. మరో ఆరు నెలల్లో జూనియర్ ప్రపంచకప్ జరగనుంది. తాజా టోర్నీ మన అమ్మాయలకు అంతర్జాతీయ అనుభవం కలిపిస్తుంది’ అని భారత జూనియర్ జట్టు కోచ్ తుషార్ ఖాండ్కర్ తెలిపారు.
భారత జూనియర్ మహిళల హాకీ జట్టు: నిధి (కెప్టెన్, గోల్‌కీపర్), ఏంజిల్ హర్షరాణి మింజ్ (గోల్‌కీపర్), మమితా ఓరమ్, లాల్‌తట్లుయాంగి, మనీషా, పూజా సాహూ, పార్వతి టొప్నో, నందిని, సాక్షి శుక్లా (డిఫెండర్లు), ప్రియాంక యాదవ్, అనీషా సాహూ, రజని కెర్కెట్టా, బినిమా ధన్, ఖైడెమ్ షిలీమా చాను, సంజన హోరో, సుప్రియా కుజుర్, ప్రియాంక డోగ్రా (మిడ్ ఫీల్డర్లు), హీనా బానో, సోనమ్, సుఖ్‌వీర్ కౌర్, గీతా యాదవ్, లాల్‌రిన్‌పుయ్, కనిక సివాచ్, కర్మన్‌ప్రీత్ కౌర్ (ఫార్వర్డ్‌లు). స్టాండ్‌బై: విద్యశ్రీ, హుదా ఖాన్, ముని్మని దాస్, సెలెస్టినా హోరో.