
టీమిండియాతో ఐదో టెస్టులో ఇంగ్లండ్ యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ (Harry Brook) అదరగొట్టాడు. బజ్‌బాల్ ఆటను గుర్తుచేస్తూ భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారాడు. 35వ ఓవర్లో ప్రసిద్ కృష్ణ బౌలింగ్‌లో బ్రూక్ బంతిని గాల్లోకి లేపగా.. ఫైన్ లెగ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న భారత పేసర్ మహ్మద్ సిరాజ్ చక్కటి క్యాచ్ అందుకున్నాడు.
సిరాజ్ ఇచ్చిన ‘గిఫ్ట్’
కానీ.. బంతిని ఒడిసిపట్టిన తర్వాత సిరాజ్ బౌండరీ లైన్ తొక్కి.. బ్యాలెన్స్ చేసుకోలేక లైన్ అవతల ల్యాండ్ అయ్యాడు. దీంతో కథ అడ్డం తిరిగింది. అవుటవ్వాల్సిన బ్రూక్ ఖాతాలోకి.. సిక్సర్ చేరిపోయింది. అప్పటికి బ్రూక్ స్కోరు 19. ఇలా తనకు లైఫ్ లభించిన తర్వాతే.. అతడు మరి వెనుదిరిగి చూడలేదు.
ఆకాశమే హద్దుగా చెలరేగుతూ శతక్కొట్టేశాడు. కేవలం 98 బంతుల్లోనే 14 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో 111 పరుగులు సాధించాడు. జో రూట్ (105)తో కలిసి ఇంగ్లండ్‌ను పటిష్ట స్థితికి చేర్చాడు. కాగా బ్రూక్‌కు టెస్టుల్లో ఇది పదో సెంచరీ.
హ్యారీ బ్రూక్ ‘ఫాస్టెస్ట్’ టెస్టు రికార్డు
ఈ క్రమంలో బ్రూక్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇరవై ఒకటవ శతాబ్దంలో టెస్టులో అత్యంత వేగంగా టెస్టుల్లో పది శతకాల మార్కు అందుకున్న ప్లేయర్‌గా నిలిచాడు. బ్రూక్ 50 ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించి.. ఆస్ట్రేలియా స్టార్ మార్నస్ లబుషేన్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. కాగా 70 ఏళ్ల క్రితం అంటే.. 1955లో వెస్టిండీస్ క్రికెటర్ క్లైడ్ వాల్కాట్ 47 ఇన్నింగ్స్‌లోనే 10 టెస్టు సెంచరీలు సాధించి ఆల్‌టైమ్ రికార్డు నెలకొల్పాడు.
ఇదిలా ఉంటే.. భారత్- ఇంగ్లండ్ మధ్య ఓవల్ మైదానంలో గురువారం మొదలైన ఐదో టెస్టు తుది అంకానికి చేరుకుంది. సోమవారం ఆఖరిదైన ఐదో రోజు ఆటలో మ్యాచ్‌తో పాటు సిరీస్ ఫలితం తేలనుంది. కాగా ఆండర్సన్- టెండుల్కర్ ట్రోఫీలో భాగంగా ఇరుజట్ల మధ్య నాలుగు టెస్టులు పూర్తి కాగా.. ఆతిథ్య ఇంగ్లండ్ టీమిండియాపై 2-1తో ఆధిక్యంలో ఉంది.
21వ శతాబ్దంలో టెస్టుల్లో అత్యంత వేగంగా 10 టెస్టు సెంచరీలు సాధించిన క్రికెటర్లు
👉హ్యారీ బ్రూక్- 50 ఇన్నింగ్స్‌లో
👉మార్నస్ లబుషేన్- 51 ఇన్నింగ్స్‌లో
👉కెవిన్ పీటర్సన్- 56 ఇన్నింగ్స్‌లో
👉ఆండ్రూ స్ట్రాస్- 56 ఇన్నింగ్స్‌లో
👉వీరేందర్ సెహ్వాగ్- 56 ఇన్నింగ్స్‌లో.
చదవండి: అతడిని ముందుగానే తీసుకురావాల్సింది: గిల్, గంభీర్ తీరుపై అశ్విన్ ఆగ్రహం