హార్దిక్‌ బౌలింగ్‌ ఇప్పట్లో లేనట్లేనా?

Hardik Pandya Eyeing Return To Bowling In T20 World Cup - Sakshi

సిడ్నీ:  ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడింది. ఒక్క షమీ మినహా మిగతా వారంతా ఓవర్‌కు ఆరు పరుగులకు పైగా ఇచ్చిన వారే.  ఎప్పట్నుంచో టీమిండియా స్పిన్‌ విభాగంలో కీలక పాత్ర పోషిస్తున్న యజ్వేంద్ర చహల్‌ 89 పరుగులు సమర్పించుకుని తన చెత్త రికార్డును తానే సవరించుకున్నాడు. భారత్‌ తరఫున ఒక వన్డేలో అత్యధిక పరుగులిచ్చిన స్పిన్నర్‌గా తన రికార్డును తానే బ్రేక్‌ చేశాడు. ఇక ఎన్నో ఆశలతో జట్టులోకి తీసుకున్న నవదీప్‌ సైనీ బౌలింగ్‌ తుస్‌ మనిపించాడు. షమీ తర్వాత బౌలింగ్‌ను పొదుపుగా వేసింది ఎవరైనా ఉన్నారంటే  అది రవీంద్ర  జడేజానే. తన 10 ఓవర్ల కోటాలో జడేజా 63 పరుగులివ్వగా, షమీ 10 ఓవర్లలో 59 పరుగులిచ్చి మూడు వికెట్లు సాధించాడు. 

హార్దిక్‌ బౌలింగ్‌ ఎప్పుడు?
ప్రస్తుత టీమిండియా జట్టులో హార్దిక్‌ పాండ్యానే ప్రధాన ఆల్‌రౌండర్‌. కానీ చాలాకాలం నుంచి ఆ పాత్రకు దూరంగానే ఉంటున్నాడు హార్దిక్‌,. ప్రధానంగా  బ్యాటింగ్‌కే పరిమితం అవుతున్న హార్దిక్‌.. బౌలింగ్‌ మాత్రం చేయడం లేదు. ఆసీస్‌తో మ్యాచ్‌లో హార్దిక్‌ బౌలింగ్‌ను వినియోగించుకునే పరిస్థితి లేకపోవడంతో దాన్ని కోహ్లి దురదృష్టంగా సరిపెట్టుకున్నాడు. ‘ బౌలింగ్‌లో హార్దిక్‌ ఫిట్‌నెస్‌ సాధించకపోవడం దురదృష్టకరం. ఆసీస్‌ జట్టులో మ్యాక్స్‌వెల్‌, స్టోయినిస్‌లు ఆల్‌రౌండర్‌లుండగా మాకు ఆ లోటు కనబడుతోంది. అందుకు కారణంగా హార్దిక్‌ చేతికి ఇంకా బౌలింగ్‌ ఇవ్వలేకపోవడమే. హార్దిక్‌ బౌలింగ్‌లో ఫిట్‌ అనుకున్న తర్వాతే అతని చేత బౌలింగ్‌  చేయిస్తాం’ అని తెలిపాడు. (అది ఆసీస్‌ జట్టు..ఇలా అయితే ఎలా?: కోహ్లి అసహనం)

కాగా, తాను వంద శాతం బౌలింగ్‌ చేసే కెపాసిటీ వచ్చిన తర్వాత దాని జోలికి వెళతానని హార్దిక్‌ తెలిపాడు. దీనిపై సీరియస్‌ దృష్టి సారించినట్లు పోస్ట్‌ మ్యాచ్‌ ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో పేర్కొన్నాడు. ఇప్పట్లో తాను బౌలింగ్‌ చేసే అవకాశం ఉండకపోవచ్చనే సంకేతాలిచ్చాడు హార్దిక్‌. టీ20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని అప్పటివరకూ బౌలింగ్‌ దూరంగా ఉండాలనే విషయాన్ని హార్దిక్‌ సూత్రప్రాయంగా వెల్లడించాడు. తామంతా దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్టిలో ఉంచుకుని జట్టుగా సమాయత్తం అవుతున్నామన్నాడు. ఇందులో తమకు టీ20 వరల్డ్‌కప్‌ అనేది చాలా ముఖ్యమైన టోర్నీ అని, అప్పుడు తన బౌలింగ్‌ కూడా కీలకమన్నాడు. అంటే అప్పటివరకూ బౌలింగ్‌కు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న విషయం హార్దిక్‌ మాటల ద్వారా తెలుస్తోంది. (ఆ మూడు తప్పిదాలతోనే టీమిండియా మూల్యం!)

వెన్నుముక సర్జరీ తర్వాత హార్దిక్‌ కేవలం బ్యాటింగ్‌కు మాత్రమే పరిమితమైన సంగతి తెలిసిందే. అది మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పడంతో హార్దిక్‌ జాగ్రత్తగా ఉంటున్నాడు. ఈ ఏడాది జూన్‌లో హార్దిక్‌ తన వెన్నుగాయంపై మాట్లాడుతూ..  ‘ నా వరకూ చూసుకుంటే భారత క్రికెట్‌లో నేను ఒక బ్యాకప్‌ సీమర్‌గా ఉన్నాననే విషయం తెలుసు. వెన్ను సర్జరీ తర్వాత టెస్టు క్రికెట్‌ను మునుపటిలా ఆడగలనా.. లేదా అనేది సందిగ్థమే. ఇక నుంచి టెస్టు ఫార్మాట్‌ నాకు సవాల్‌తో కూడుకున్న అంశం. ఒకవేళ నేను పూర్తి స్థాయి టెస్టు ప్లేయర్‌ని అయితే వైట్‌బాల్‌ క్రికెట్‌ ఆట ఉండకపోవచ్చు’ అని అన్నాడు. దాంతో టెస్టు ఫార్మాట్‌కు హార్దిక్‌ స్వస్తి పలుకుతాడనే చర్చలు కూడా అప్పట్లో నడిచాయి. ఇంకా దానిపై క్లారిటీ లేకపోయినా సుదీర్ఘ గ్యాప్‌ తర్వాత తన బౌలింగ్‌ను పరీక్షించుకునే అంశాన్ని హార్దిక్‌ పరిశీలిస్తున్నాడు. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top