'మేం లేకపోయినా.. చెన్నైకి నష్టం లేదు'

Harbhajan Singh On CSK Missing Him And Suresh Raina In IPL 2020 - Sakshi

దుబాయ్‌ : నేడు ఐపీఎల్‌ 13వ సీజన్‌కు తెరలేవనుంది. ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ డిపెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో తలపడుతుంది. ఈ సందర్భంగా టీమిండియా వెటరన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్టుకు ఆల్‌ ది బెస్ట్‌ విషెస్‌ చెప్పాడు. ఈసారి ఐపీఎల్‌లో తనతో పాటు సురేశ్‌ రైనా లేకున్నా చెన్నైకి ఎలాంటి నష్టం లేదన్నాడు. తమ గైర్హాజరీలో కెప్టెన్‌ ఎంస్‌ ధోని, షేన్‌ వాట్సన్‌, డ్వేన్‌ బ్రేవో, రవీంద్ర జడేజాలతో జట్టు పటిష్టంగానే ఉందని తెలిపాడు. (చదవండి : ఇండియన్‌ పండుగ లీగ్‌...)

ఇండియా టుడే నిర్వహించిన ఇంటర్య్వూలో భజ్జీ మాట్లాడుతూ..'చెన్నై తరపున ఐపీఎల్‌లో ఈసారి ఆడకపోడం కొంచెం బాధ కలిగిస్తుంది.‌ ఐపీఎల్‌ మొదటి సీజన్‌ నుంచి ఆడుతున్న నాకు ఎన్నో మధురానుభూతులు ఉన్నాయి. కానీ ఈ ఏడాది అనుకోని పరిస్థితుల వల్ల ఐపీఎల్‌కు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఆ కారణాలేంటనది ఇదివరకే చెప్పా. నాతో పాటు సురేశ్‌ రైనా కూడా చెన్నై జట్టుకు దూరమవ్వడం కొంచెం వెలితిగా అనిపించింది. అయినా ఎవరి కారణాలు వారికి ఉంటాయి. మేమిద్దరం ఆడకపోయినా.. సీఎస్‌కేకు వచ్చిన నష్టం ఏంలేదు.

జట్టులో ధోని, వాట్సన్‌, బ్రేవో, జడేజా లాంటి ఆటగాళ్లు ఉన్నారు. టోర్నీ మొత్తం చెన్నై సూపర్‌ కింగ్స్‌ మంచి ప్రదర్శన కనబరుస్తుందని ఆశిస్తున్నా. ఇక ఐపీఎల్‌ టైటిల్‌ ఎవరు గెలుస్తారనడం చెప్పడం కష్టమే. చెన్నై జట్టు సభ్యుడిగా కచ్చితంగా మా జట్టే టైటిల్‌ గెలవాలని కోరుకుంటా. కానీ ఐపీఎల్‌లో ఎవరి స్ట్రాటజీలు వారికి ఉంటాయి. ఇది టీ20.. నిమిషాల వ్యవధిలో ఆట స్వరూపమే మారిపోతుంది. గెలుస్తారనుకున్న జట్టు ఓడిపోవచ్చు.. ఓడుతుందనుకున్న జట్టు గెలవవచ్చు. అందుకే టైటిల్‌ ఎవరు గెలుస్తారనేది ముందే ఊహించకూడదు. (చదవండి : 'ఐపీఎల్‌ నా దూకుడును మరింత పెంచనుంది')

సురేశ్‌ రైనా లాంటి సీనియర్‌ ఆటగాడి సేవలను చెన్నై కోల్పోవడం కొంచెం బాధాకరమే అయినా.. ఆ లోటు తెలియకుండా మిగతావారు రాణిస్తారనే నమ్మకం ఉంది. జట్టు సభ్యులు నన్ను ఎంత మిస్సవుతున్నారో తెలియదు గానీ.. నేను మాత్రం చాలా మిస్సవుతున్నా. ఈసారికి ఇంతే అని సర్థిపెట్టుకుంటా. ఆల్‌ ది బెస్ట్‌.. చెన్నై సూపర్‌ కింగ్స్‌ 'అంటూ ముగించాడు. షార్జా, అబుదాబి, దుబాయ్‌ వేదికగా 53 రోజుల పాటు జరగనున్న ఐపీఎల్‌ 13వ సీజన్‌లో ఫైనల్‌ మ్యాచ్‌ నవంబర్‌ 10న జరగనుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top