‘సారా’లతో ప్రేమాయణం: శుబ్‌మన్‌కు సచిన్‌ స్పెషల్‌ విషెస్‌.. పోస్ట్‌ వైరల్‌! | Happy Birthday Prince Of World Cricket: Sachin Tendulkar Wishes Shubman Gill On His 24th Birthday - Sakshi
Sakshi News home page

Shubman Gill: ‘సారా’లతో ప్రేమాయణం: శుబ్‌మన్‌ గిల్‌కు సచిన్‌ స్పెషల్‌ విషెస్‌.. పోస్ట్‌ వైరల్‌!

Published Fri, Sep 8 2023 7:56 PM

Happy Birthday Prince Of World Cricket: Gill Receives Special Wishes Sachin Post - Sakshi

Happy Birthday Shubman Gill: టీమిండియా యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ పుట్టినరోజు నేడు(సెప్టెంబరు 8). పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో జన్మించిన ఈ హ్యాండ్సమ్‌ బ్యాటర్‌ నేటి(శుక్రవారం)తో 24వ పడిలో అడుగుపెడుతున్నాడు. ఈ సందర్భంగా అతడికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 

ఇక టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ సైతం గిల్‌ను ప్రత్యే​కంగా విష్‌ చేయడం హైలైట్‌గా నిలిచింది. కాగా 2018 అండర్‌-19 వరల్డ్‌కప్‌ టోర్నీలో అద్భుతంగా రాణించి అందరి దృష్టిని ఆకర్షించాడు గిల్‌. 104.5 స్ట్రైక్‌రేటుతో 418 పరుగులు సాధించాడు. 

రోహిత్‌ శర్మ ఓపెనింగ్‌ జోడీగా
నాటి ఐసీసీ ఈవెంట్లో కెప్టెన్‌ పృథ్వీ షాకు డిప్యూటీగా వ్యవహరించిన శుబ్‌మన్‌ గిల్‌.. ఇప్పుడు అతడిని దాటుకుని టీమిండియా సారథి రోహిత్‌ శర్మకు ఓపెనింగ్‌ జోడీగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. 

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ సందర్భంగా 2019లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఈ రైట్‌ హ్యాండ్‌ బ్యాటర్‌.. మరుసటి ఏడాది టెస్టుల్లో ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఈ ఏడాది అంతర్జాతీయ టీ20లలోనూ అడుగుపెట్టాడు.

డబుల్‌ సెంచరీ వీరుడు
ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో 18 టెస్టులు, 29 వన్డేలు, 11 టీ20 మ్యాచ్‌లు ఆడిన శుబ్‌మన్‌ గిల్‌.. ఆయా ఫార్మాట్లలో వరుసగా 966, 1514, 304 పరుగులు సాధించాడు. టెస్టుల్లో రెండు శతకాలు సాధించిన ఈ పంజాబీ కుర్రాడు.. వన్డేల్లో 4 సెంచరీలతో పాటు ఒక డబుల్‌ సెంచరీ కూడా నమోదు చేశాడు.

ఐపీఎల్‌లోనూ హవా
పొట్టి ఫార్మాట్‌లోనూ ఒక శతకం సాధించి.. మూడు ఫార్మాట్లలోనూ సత్తా చాటుతూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఐపీఎల్‌లోనూ ఆకాశమే హద్దుగా చెలరేగుతున్న ఈ గుజరాత్‌ టైటాన్స్‌ ఆటగాడి ఖాతాలో ఏకంగా 3 సెంచరీలు ఉండటం విశేషం.

ఈ నేపథ్యంలో.. టీమిండియా రన్‌మెషీన్‌ విరాట్‌ కోహ్లిని రోల్‌ మోడల్‌గా భావించే గిల్‌.. భవిష్యత్తులో అతడి స్థాయికి ఎదగలడని ప్రశంసలు అందుకుంటున్నాడు. భావి భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టినా ఆశ్చర్యం లేదని ఇప్పటికే పలువురు మాజీ క్రికెటర్లు గిల్ గురించి జోస్యం చెబుతున్నారు.

సొట్ట బుగ్గల కుర్రాడు.. అమ్మాయిల కలల రాకుమారుడు
మేటి బ్యాటర్‌గా ఎదుగుతున్న శుబ్‌మన్‌ గిల్‌కు అమ్మాయిల్లో ఫాలోయింగ్‌ ఎక్కువగానే ఉంది. అహ్మదాబాద్‌లో ఓ మ్యాచ్‌ సందర్భంగా ఓ యువతి.. ఏకంగా నన్ను పెళ్లి చేసుకుంటావా గిల్‌ అంటూ ప్లకార్డు ప్రదర్శించడం చూస్తే ఈ మాట నిజమే అనిపిస్తుంది.

‘సారా’లతో ప్రేమాయణం
పట్టుమని పాతికేళ్లు కూడా లేని ఈ సొట్ట బుగ్గల కుర్రాడి ‘ప్రేమాయణాలు’ సోషల్‌ మీడియాలో ఎప్పుడూ హాట్‌ టాపికే! సచిన్‌ టెండుల్కర్‌ గారాలపట్టి సారా టెండుల్కర్‌తో గిల్‌ ప్రేమలో ఉన్నట్లు గతంలో వార్తలు వచ్చాయి.

వీరిద్దరు ఇన్‌స్టాలో ఒకరినొకరు ఫాలో చేసుకోవడం.. అడపాదడపా కలిసి బయట కనిపించడం ఇందుకు ఊతమిచ్చింది. అయితే, దేవతలను ప్రేమించకూడదంటూ గిల్‌ పెట్టిన పోస్ట్‌తో సారాతో బ్రేకప్‌ అయ్యిందని ఊహాగానాలు వినిపించాయి.

పటౌడీల యువరాణితో చెట్టాపట్టాల్‌

ఆ తర్వాత బాలీవుడ్‌ హీరోయిన్‌ సారా అలీఖాన్‌తో శుబ్‌మన్‌ గిల్‌ కలిసి కనిపించడం మరోసారి రూమర్స్‌కు దారితీసింది. పటౌడీ పరగణా వారసురాలితో ఈ కుర్ర క్రికెటర్‌ పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడంటూ గాసిప్‌రాయుళ్లు కథనాలు అల్లేస్తున్నారు.

కెరీర్‌పై ఫుల్‌ ఫోకస్‌
అయితే, ఇవన్నీ పట్టించుకోకుండా తన ఫోకస్‌ మొత్తం కెరీర్‌ మీదే పెట్టాడు గిల్‌. వరుస అవకాశాలు దక్కించుకుంటూ తనను తాను నిరూపించుకుంటూ.. టీమిండియాలో రెగ్యులర్‌ సభ్యుడయ్యాడు. ప్రస్తుతం ఆసియా కప్‌-2023తో బిజీగా ఉన్న గిల్‌.. తదుపరి వన్డే వరల్డ్‌కప్‌-2023తో ఐసీసీ ఈవెంట్‌ బరిలో దిగనున్నాడు.

సచిన్‌ టెండుల్కర్ ఎల్లప్పుడూ ప్రత్యేకంగానే
తన కుమార్తె సారాతో గిల్‌ ప్రేమ వార్తల నేపథ్యంలోనూ సచిన్‌ టెండుల్కర్‌ ఈ యువ క్రికెటర్‌ను ఎప్పటికపుడు ఆకాశానికెత్తడం విశేషం. తన కళ్ల ముందే టీ20 మ్యాచ్‌లో శుబ్‌మన్‌ గిల్‌ సెంచరీ సాధించిన సందర్భంగా సచిన్‌ అతడిపై గతంలో ప్రశంసలు కురిపించాడు. 

తాజాగా అతడి పుట్టినరోజు సందర్భంగా.. ‘‘హ్యాపీయెస్ట్‌ బర్త్‌డే శుబ్‌మన్‌ గిల్‌. ఈ ఏడాది నువ్వు పరుగుల వరద పారించాలి. మరిన్ని గొప్ప జ్ఞాపకాలను పోగుచేసుకోవాలి’’ అని సచిన్‌ ఆకాంక్షించాడు. ఇక రాబిన్‌ ఊతప్ప, అక్షర్‌ పటేల్‌ సహా సహచర క్రికెటర్లు బర్త్‌డే బాయ్‌ గిల్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

చదవండి: పాక్‌ ఫాస్ట్‌బౌలర్లే కాదు.. టీమిండియా పేసర్లూ భేష్‌! వాళ్లకు చుక్కలు ఖాయం

Advertisement
 
Advertisement