‘టైటిల్‌ మాదే.. రాసిపెట్టుకోండి’.. గిల్‌ హెచ్చరిక! | Shubman Gill Sends Message Rivals After Win Over SRH, Says GT Not Stuck To One Brand Of Cricket, We’re Eyeing The IPL 2026 Title | Sakshi
Sakshi News home page

‘టైటిల్‌ మాదే.. రాసిపెట్టుకోండి’.. గిల్‌ హెచ్చరిక!

May 13 2026 8:03 AM | Updated on May 13 2026 10:02 AM

GT Captain Shubman Gill Sends Message Rivals-After Win Over SRH

Photo Courtesy: IPL 2026

ఐపీఎల్ 2026 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ వరుసగా ఐదో విజయాన్ని సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకొచ్చింది. మంగళవారం ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 82 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. 200 ప్లస్ స్కోర్లు కూడా ఈజీగా ఛేదిస్తున్న ఈ సీజన్‌లో 160 ప్లస్ స్కోరును కాపాడుకోవడం గుజరాత్‌కు మాత్రమే చెల్లింది. 

మ్యాచ్ విజయం అనంతరం గుజరాత్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్ మాట్లాడాడు. ‘అహ్మదాబాద్ వికెట్ పై 170 పరుగులు చేయడం కూడా కష్టమే. మేం 160-170 పరుగులు చేస్తే.. మా బౌలింగ్ అటాక్ ముందు ఆ స్కోర్‌ను ఛేదించడం అంత సులువు కాదని ముందే అంచనా వేశాం. ఈ మ్యాచ్‌లో మా వ్యూహం కూడా అదే. సన్‌రైజర్స్ బ్యాటింగ్ లైనప్, ముఖ్యంగా టాపార్డర్‌ను పడగొట్టడానికి మేం వేసిన ప్రణాళికలు పక్కాగా పనిచేశాయి.

సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ ఈ స్లో పిచ్‌పై అద్భుతంగా రాణించారు. ఈ గెలుపు క్రెడిట్ వారికి ఇవ్వాల్సిందే. ఓ వైపు వికెట్లు పడిపోతున్నా.. వారిద్దరూ నిలబడి జట్టుకు ఆ స్కోర్‌ను అందించారు. మేము ఒక బ్రాండ్ క్రికెట్‌కు మాత్రమే పరిమితం అవ్వాలని అనుకోవడం లేదు. మేము ఒక నిర్దిష్ట శైలి లేదా బ్రాండ్ క్రికెట్ ఆడే జట్టు కాదని మీకు తెలుసు. 

వరుస విజయాలు ఊరికే రాలేదు. రాసిపెట్టుకోండి.. ఈసారి టైటిల్‌ కొట్టబోతున్నాం. పిచ్‌ను చూసి, పరిస్థితులను అంచనా వేసి ఆడి గెలిచే జట్టుగా ఉండాలని కోరుకుంటున్నాం. 240 పరుగులు చేసే వికెట్ అయితే కచ్చితంగా ఆ స్కోర్ కోసం ప్రయత్నిస్తాం. 

ముఖ్యంగా జాసన్ హోల్డర్.. మా టీమ్ గెలుపు సీక్రెట్. అతడు వేస్తున్న లెంగ్త్‌లు మా జట్టుకు చాలా ప్లస్ అవుతున్నాయి. దాదాపు ప్రతి మ్యాచ్‌లో హోల్డర్ వరుసగా నాలుగు ఓవర్లు వేస్తూ రాణిస్తూ మాకు గెలుపు మంత్రంగా మారిపోయాడు.’ అని గిల్ వెల్లడించాడు.

చదవండి: ‘న‌న్ను పావుగా వాడుకొని కోహ్లీపై కుట్ర పన్నాగం’

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement