గోల్ఫ్ దిగ్గజం టైగర్‌వుడ్స్‌ను ఫ్లోరిడా పోలీసులు శనివారం అరెస్ట్ చేయడం ఆసక్తి కలిగించింది. వాహనాన్ని ఓవర్‌టేక్ చేసే క్రమంలో నిబంధనలు ఉల్లంఘించడమేగాక, ప్రమాదానికి కారణమైన టైగర్‌వుడ్స్‌ను డ్రైవింగ్ అండర్ ది ఇన్‌ఫ్లూయెన్స్ (డీయూఐ) కింద అదుపు లోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం జూపిటర్ ఐలాండ్‌లోని తన నివాసం సమీపంలో టైగర్ వుడ్స్ ప్రయాణిస్తున్న ల్యాండ్ రోవర్ కారు, మరొక ట్రక్కును ఓవర్‌టేక్ చేసే క్రమంలో దానికి తగిలి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 50 ఏళ్ల వుడ్స్ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు.
అయితే, ప్రమాదం తర్వాత మార్టిన్ కౌంటీ పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకొని బ్రీత్ అనలైజ్‌పరీక్ష నిర్వహించారు. టెస్టులో టైగర్ వుడ్స్ మద్యం సేవించినట్లుగా తేలలేదు. కానీ, ఆయన ఏదైనా మందులు, డ్రగ్స్ ప్రభావంతో కారు నడిపి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మూత్ర పరీక్షకు ఆయన నిరాకరించడంతో, నిబంధనల ప్రకారం డీయూఐ కేసు నమోదు చేసి టైగర్‌వుడ్స్‌ను జైలుకు తరలించారు.
2017లో కూడా టైగర్ వుడ్స్ ఇదే తరహాలో కారు ప్రమాదానికి గురయ్యారు. మోతాదుకు మించి పెయిన్ కిల్లర్స్ తీసుకోవడంతో నిద్రమత్తులోకి జారుకోవడంతో కారు పల్టీలు కొట్టింది. ఈ ఘటన అప్పట్లో సంచలనంగా మారింది. ప్రమాదం నేపథ్యంలో త్వరలో జరగనున్న మాస్టర్స్ టోర్నమెంట్‌లో టైగర్‌వుడ్స్ పాల్గొనడం అనుమానంగా మారింది.


