
మ్యూనిక్: రోజుల వ్యవధిలో రెండు ఫుట్‌బాల్ దిగ్గజాలు నేలరాలాయి. శనివారం బ్రెజిల్ మాజీ ఆటగాడు, నాలుగు సార్లు వరల్డ్‌కప్ విన్నర్ మారియో జగల్లో (92) తుది శ్వాస విడువగా.. ఆదివారం జర్మనీ ఫుట్‌బాల్ దిగ్గజం ఫ్రాంజ్ బెకెన్‌బాయెర్ కన్నుమూశారు. 78 ఏళ్ల ఈ జర్మన్ మాజీ కెప్టెన్ నిద్రలోనే తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబసభ్యులు ఒక ప్రకటనలో తెలిపారు.
అయితే ఆయన మృతికి గల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. జర్మనీ ఫుట్‌బాల్‌లో బెకెన్‌బాయెర్ శిఖరం. డిఫెండర్ పొజిషన్‌లో ఆడే ఆయన తొలుత కెప్టెన్‌గా తదనంతరం కోచ్‌గా విజయవంతమై జర్మనీకి రెండు ప్రపంచకప్ టైటిళ్లను అందించారు. పశ్చిమ జర్మనీ కెప్టెన్‌గా 1974లో ప్రపంచకప్ టైటిల్‌ను అందించిన ఆయన 1990 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన జర్మనీకి కోచ్‌గానూ వ్యవహరించారు.