గంభీర్‌కు ధోనీ అంటే అసూయ.. అందుకే బర్త్‌డే రోజు అలా చేశాడు

Gautam Gambhir Slammed For Changing His Facebook Cover Pic On Dhonis 40th Birthday - Sakshi

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ ఓపెనర్‌, ప్రస్తుత ఢిల్లీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌పై భారత మాజీ కెప్టెన్‌, దిగ్గజ ఆటగాడు మహేంద్రసింగ్‌ ధోనీ అభిమానులు విరుచుకుపడుతున్నారు. తమ ఆరాధ్య క్రికెటర్‌ ధోనీ అంటే గంభీర్‌కు అసూయ అని, అతనికున్న క్రేజ్‌ను చూసి గంభీర్‌ ఓర్చుకోలేకపోతున్నాడని మండిపడుతున్నారు. ఇంతకీ ధోనీ అభిమానులు ఇంతాలా రెచ్చిపోవడానికి కారణం ఏమై ఉంటుందని అనుకుంటున్నారా..? వివరాల్లోకి వెళితే.. నిన్న ధోనీ 40వ పుట్టిన రోజు(జులై 7, 2021) సందర్భంగా యావత్‌ క్రీడా ప్రపంచం అతనికి శుభాకాంక్షలు తెలిపింది. దిగ్గజ క్రికెటర్లు, బీసీసీఐ, ఐసీసీ, పలు ఇపీఎల్‌ ఫ్రాంఛైజీలు ధోనీకి విషెస్‌ చెప్పారు. 

అయితే, ఈ సందర్భంగా ధోనీ అభిమానులు ఒక విషయాన్ని నోటీస్‌ చేశారు. ధోనీ సహచరుడు మాజీ క్రికెటర్‌ గంభీర్‌.. తన ఫేస్‌బుక్‌ కవర్‌ పిక్చర్‌ను మార్చడాన్ని గుర్తించారు. ఓ పక్క యావత్‌ క్రీడా ప్రపంచం ధోనీ జన్మదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలుపుతుంటే, గంభీర్‌ మాత్రం 2011 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్స్‌ నాటి తన ఫోటోను ఫేస్‌బుక్‌ కవర్‌ పిక్‌గా అప్‌డేట్‌ చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ధోనీ అవమానించడానికి గంభీర​ ప్రణాళికా బద్ధంగా ఇలా చేశాడని, ఇదేదో యాదృచ్చికంగా జరిగినది కాదని మండిపడుతున్నారు. గంభీర్‌కు మొదటి నుంచి ధోనీ అంటే అసూయ అని, 2011 వరల్డ్‌కప్‌ ఫైనల్లో 97 పరుగులు చేసినప్పటికీ తనకు దక్కాల్సిన క్రెడిట్‌ దక్కలేదని కుమిలిపోతున్నాడని ఆరోపిస్తున్నారు. 

శ్రీలంకతో జరిగిన ఫైనల్లో ధోనీ.. విన్నింగ్ షాట్‌ను సిక్సర్‌గా మలిచి భారతీయుల దృష్టిలో హీరో అయిపోవడాన్ని గంభీర్‌ జీర్ణించుకోలేకపోతున్నాడని ధ్వజమెత్తారు.  ధోనీపై అక్కసుతోనే గంభీర్‌ ఇలా చేశాడని, ధోనీ సాధించిన అపురూప విజయాలు సోషల్‌ మీడియాలో ట్రోల్‌ అవడం చూసి ఓర్వలేకే, ఇలా తన ద్వేశాన్ని వ్యక్తపరిచాడని ఆరోపించారు. మరోవైపు గంభీర్‌ అభిమానులు కూడా ధోనీ ఫ్యాన్స్‌పై ఎదురుదాడికి దిగుతున్నారు. తమ ఫేవరెట్‌ క్రికెటర్‌ సాధించిన పరుగుల వల్లే టీమిండియా రెండోసారి జగజ్జేతగా నిలిచిందంటూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కాగా, టీమిండియా రెండోసారి వన్డే ప్రపంచ ఛాంపియన్లు కావడంలో ధోనీ సహా యువరాజ్‌, గంభీర్‌ కీలకపాత్ర పోశించిన విషయం తెలిసిందే. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top