LLC 2022: గంభీర్ అభిమానులకు గుడ్ న్యూస్.. మళ్లీ బ్యాట్ పట్టనున్న గౌతీ!

టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ లెజెండ్స్ లీగ్ క్రికెట్ రెండో సీజన్‌లో భాగం కానున్నాడు. ఈ విషయాన్ని గంభీర్ శుక్రవారం దృవీకరించాడు. ఈ క్రమంలో గౌతీ మాట్లాడుతూ.. "మళ్లీ క్రికెట్ మైదానంలో అడుగుపెట్టేందుకు ఆతృతగా ఎదురుచూస్తున్నాను. లెజెండ్స్ లీగ్ క్రికెట్‌లో దిగ్గజ ఆటగాళ్లతో ఆడే అవకాశం రావడం నాకు చాలా సంతోషంగా ఉంది" అని పేర్కొన్నాడు. కాగా ఈ టోర్నీ కోసం తొలుత ప్రకటించిన ఇండియా మహారాజాస్ జట్టులో గంభీర్ పేరు లేదు. లెజెండ్స్ లీగ్ క్రికెట్-2022 సెప్టెంబరు 17 నుంచి ప్రారంభం కానుంది.
ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు తలపడనున్నాయి. కాగా టోర్నీ ఓ ప్రత్యేకమైన మ్యాచ్‌తో ఆరంభం కానుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఇండియా మహరాజాస్, వరల్డ్ జెయింట్స్ మధ్య సెప్టెంబర్ 16న ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఓ చారటీ మ్యాచ్ జరగనుంది. ఇండియా మహరాజాస్‌కు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కెప్టెన్‌గా ఎంపిక కాగా.. వరల్డ్ జెయింట్స్‌కు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ సారథ్యం వహించనున్నాడు.
2018లో క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన గంభీర్
గంభీర్ 2018లో అన్ని రకాల క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. 2007 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే ప్రపంచకప్‌లను భారత్ కైవసం చేసుకోవడంలో గంభీర్ కీలక పాత్ర పోషించాడు. టీమిండియా తరపున 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20ల్లో గంభీర్ ప్రాతినిధ్యం వహించాడు. అతడు మూడు ఫార్మాట్‌లు కలిపి 10324 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్‌లోనూ తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర ఏర్పరుచుకున్నాడు. గౌతీ సారధ్యంలో కోల్‌కతా నైట్ నైడర్స్ 2012, 2014 ఐపీఎల్ టైటిల్స్‌ను గెలుచుకుంది.
చదవండి: Deepak Chahar: చాలా కాలం దూరమైతే అంతే! ప్రపంచకప్ జట్టుకు ఎంపికవడం నా చేతుల్లో లేదు!
సంబంధిత వార్తలు