‘అతనేమీ వార్న్‌ కాదు.. కుంబ్లే అనుకోండి’

England Should Treat Yasir Shah Like Anil Kumble, Nasser Hussain - Sakshi

ఇక్కడ కుంబ్లేను తక్కువ చేయడం లేదు

ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ నాసిర్‌ హుస్సేన్‌

సౌతాంప్టన్‌: వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భారత పర్యటనలో ఇంగ్లండ్‌ జట్టు మెరుగ్గా రాణించాలంటే ప్రస్తుతం పాకిస్తాన్‌తో జరుగుతున్న సిరీస్‌లో స్పిన్నర్‌ యాసిర్‌ షాను సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలనే అంశాన్ని నేర్చుకోవాలని ఇంగ్లిష్‌ క్రికెట్‌ జట్టు మాజీ కెప్టెన్‌ నాసిర్‌ హుస్సేన్‌ సూచించాడు. పాక్‌తో స్వదేశంలో జరుగుతున్న మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా ఆఖరి టెస్టులో యాసిర్‌ షా బౌలింగ్‌ ఆడటానికి భయపడుతున్న ఇంగ్లండ్‌ క్రికెటర్లను ఉద్దేశించి హుస్సేన్‌ మాట్లాడాడు. అసలు యాసిర్‌ షా బౌలింగ్‌ను ఎదుర్కోవడానికి ఎటువంటి భయాందోళనలు వద్దని, మానసికంగా దృఢంగా ఉంటే అతని బౌలింగ్‌ను ఆడటం కష్టం కాదన్నాడు. అదే సమయంలో లెగ్‌ బ్రేక్‌ బౌలర్‌ యాసిర్‌ షాను ఆసీస్‌ దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌లా ట్రీట్‌ చేయవద్దని చురకలంటించాడు. (చదవండి: ఇంగ్లండ్‌తో సిరీస్‌పై‌ క్లారిటీ ఇచ్చిన దాదా)

యాసిర్‌ షా ఒక సాధారణ స్పిన్నర్‌ మాత్రమేనని హుస్సేన్‌ అభిప్రాయపడ్డాడు. భారత స్పిన్‌ లెజెండ్‌ అనిల్‌ కుంబ్లే తరహా బౌలర్‌గా యాసిర్‌ షాను భావించాలన్నాడు. ఇక్కడ తానేమీ కుంబ్లేను తక్కువ చేయడం లేదన్నాడు. మూడో టెస్టులో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో సిబ్లే, ఓలీ పోప్‌లు యాసిర్‌ షాకు ఔట్‌ కావడంపై నాసిర్‌ హుస్సేన్‌ స్పందించాడు. సిబ్లే ఎల్బీగా పెవిలియన్‌ చేరగా, ఓలీ పోప్‌లు బౌల్డ్‌ అయ్యాడు. ఈ ఇద్దరూ బ్యాక్‌ఫుట్‌ ఆడుతూ వికెట్లు సమర్పించుకోవడంతో  హుస్సేన్‌ కాస్త సెటైరిక్‌గా మాట్లాడాడు. దానిలో భాగంగానే వార్న్‌, కుంబ్లే ప్రస్తావన తీసుకొచ్చాడు. ‘ యాసిర్‌ షాను మరో వార్న్‌ అనుకోకండి. అతనొక సాధారణ లెగ్‌ స్పిన్నర్‌. కుంబ్లే తరహా బౌలర్‌ అనుకోండి. నేను ఇక్కడ కుంబ్లేను కించపరచడం లేదు. కేవలం విషయం చెబుతున్నా. వార్న్‌ ఏ వికెట్‌పైనైనా తొలి రోజు నుంచే టెస్టుల్లో ఆధిపత్యం చెలాయిస్తాడు. కుంబ్లే అలా కాదు. క్రమంగా వికెట్‌పై పట్టు సాధిస్తాడు. దాంతోనే వార్న్‌-కుంబ్లేల పోలిక తెచ్చా’ అని హుస్సేన్‌ పేర్కొన్నాడు.

ఈ మూడు టెస్టుల సిరీస్‌లో ఇప్పటివరకూ యాసిర్‌ షా 11 వికెట్లు సాధించాడు. ఈ సిరీస్‌లో తొలి టెస్టులో ఇంగ్లండ్‌ విజయం సాధించగా, రెండో టెస్టు డ్రాగా ముగిసింది. ఇక మూడో టెస్టులో ఇంగ్లండ్‌ పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. రెండో రోజు శనివారం ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 583 పరుగులు చేసి డిక్లేర్‌ చేసింది. జాక్‌ క్రాలీ (267; 34 ఫోర్లు, సిక్స్‌) డబుల్‌ సెంచరీ... జోస్‌ బట్లర్‌ (152; 13 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించారు. ఆపై బ్యాటింగ్‌ ప్రారంభించిన పాకిస్తాన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 93 ఓవర్లలో 273 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఇంగ్లండ్‌కు 310 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించింది. పాక్‌ కెప్టెన్‌ అజహర్‌ అలీ (141 నాటౌట్‌) సెంచరీ సాధించాడు. అలాగే టెస్టుల్లో 6 వేల పరుగుల మైలురాయిని దాటి అరుదైన జాబితాలో చేరిపోయాడు.(చదవండి: ‘ఇదేనా ధోనికిచ్చే గౌరవం’)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top